స్టాక్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తున్న ఐఆర్‌సీటీసీ

IRCTC Shares Are Creating Sensation In Stock Market - Sakshi

స్టాక్‌ మార్కెట్‌ని ఐఆర్‌సీటీసీ షేర్లు కుదిపేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిణామాలు, స్థానిక ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, సెబీ రూల్స్‌ అండ్‌ గైడెన్స్‌ ఇవేమీ పట్టవన్నట్టుగా పైపైకి దూసుకుపోతుంది. ఈ షేర్లు కొనుగోలు చేసిన వారికి ఊహించని స్థాయిలో లాభాలను అందిస్తోంది. 

టాప్‌గేర్‌లో
గత నాలుగైదు రోజులుగా స్టాక్‌మార్కెట్‌ బ్రోకర్లు, ఇన్వెస్టర్లు ఇలా ఎవరి నోట విన్నా ఒకటే మాట ఐఆర్‌సీటీసీ. ఇండియన్‌ రైల్వే టూరిజం అండ్‌ క్యాటరింగ్‌ కార్పోరేషన్‌ షేర్లు గత మూడు నెలలుగా ఇన్వెస్టర్లకు లాభాలు అందిస్తున్నా.. గడిచిన వారం రోజులుగా అయితే ఆకాశమే హద్దుగా ఈ కంపెనీ షేర్లు చెలరేగిపోతున్నాయి. 

ఆకాశమే హద్దు
సెప్టెంబరు 7న ఐర్‌సీటీసీ కంపెనీ షేరు ధర రూ.3,296లుగా నమోదు అయ్యింది. అప్పటి నుంచి వెనుకడుగే లేదన్నట్టుగా షేరు ధర పెరుగుతూనే పోతుంది. అలా పైపైకి చేరుకుంటూ సెప్టెంబరు చివరి నాటికి ఒక షేరు ధర రూ. 3,867 రూపాయలకు అటు ఇటుగా నమోదు అయ్యింది.  ఈ సమయంలోనే ఐఆర్‌సీటీసీ షేర్లను స్ప్లిట్‌ చేస్తున్నట్టు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. పది రూపాయలు ముఖ విలువ ఉన్న షేరుని రెండు రూపాయల ముఖ విలువతో ఐదు షేర్లుగా మారుస్తామని తెలిపింది. ఈ నిర్ణయం అక్టోబరు 29 నుంచి అమల్లోకి వస్తుందంటూ అక్టోబరు ఫస్ట్‌ వీక్‌లో ప్రకటించింది. ఈ నిర్ణయంతో షేర్ల ధరకు కొత్త రెక్కలు వచ్చాయి. దీంతో ​​​​అక్టోబరు 8న  ఒక్కో షేరు ధర రూ.4,867లకు చేరుకుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే వెయ్యి రూపాయలు పెరిగింది. 

ఇప్పుడేం చేయాలి
ఐఆర్‌సీటీసీ షేర్ల ధరలు ఒక్కసారిగా పెరగడం మరోవైపు బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీలు సైతం బుల్‌ ట్రెండ్‌నే కొనసాగిస్తుండటంతో ఈ కంపెనీ షేర్లు కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు అనూహ్యంగా పెరుగుతున్న షేరు ధరపై సెబీ నిఘా పెట్టింది. మరోవైపు షేర్లు కొనుగోలు చేసిన వారు అమ్మేయాలా ? లేక ఉంచుకోవాలా అనేది తెలియక సతమతం అవుతున్నారు. 

లాభాలే లాభాలు
మార్కెట్‌ బిగ్‌బుల్‌ రాకేశ్‌ఝున్‌ఝున్‌వాలా గత నెలలో యాభై లక్షల జీ మీడియా షేర్లను ఒక్కోక్కటి రూ.220 వంతున కొనుగోలు చేయగా వారం రోజుల్లో ఆ షేరు ధర రూ. 337కి పెరిగింది. ఈ ఒక్క డీల్‌లోనే ఆయన సంపాదన రూ.50 కోట్లు పెరిగింది. అలాంటిది వారం రోజుల్లోనే ఐఆర్‌సీటీసీ షేర్లు వారం రోజుల వ్యవధిలోనే వెయ్యి రూపాయలు పెరగడంతో ఇందులో పెట్టుబడి పెట్టిన వారు జాక్‌పాట్‌ కొట్టినంత పనయ్యింది.

కలిసొచ్చిన ప్రైవేటీకరణ
భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఐఆర్‌సీటీసీ పాలిట వరంగా మారింది. ఇప్పటికే ప్రైవేటు రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు ఢిల్లీ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ , నిర్వాహన బాధ్యతలు కూడా ఐఆర్‌సీటీసీకే దక్కాయి. దీంతో అప్పటి నుంచి ఈ కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. 

సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌
స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించి యాక్టివ్‌గా ఉండే పేజీలు, వ్యక‍్తులు ఐఆర్‌సీటీసీ షేర్ల జోరుతో విస్తుబోతున్నారు. అసలు ఐఆర్‌సీటీసీనీ అడ్డుకునేది ఏదీ లేదంటూ రకరకాల మీమ్స్‌తో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు.  

చదవండి :10 నిమిషాల్లో 850 కోట్లు సంపాదించిన ఇండియన్ బిగ్ బుల్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top