రైల్వే టికెట్‌ బుకింగ్‌: మహిళలకు ప్రత్యేక సదుపాయాలు | Indian Railways Ticket Booking Women Special Benefits Lower Berth Rules | Sakshi
Sakshi News home page

రైల్వే టికెట్‌ బుకింగ్‌: మహిళలకు ఉన్న ప్రత్యేక సదుపాయాలు తెలుసా?

Oct 12 2026 3:32 PM | Updated on Oct 12 2026 4:09 PM

Indian Railways Ticket Booking Women Special Benefits Lower Berth Rules

భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రత కోసం రైల్వే శాఖ పలు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయి. అయితే, ఒంటరిగా ప్రయాణించే మహిళలకు టికెట్‌ బుకింగ్‌ సమయంలో ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? 45 ఏళ్లు పైబడిన మహిళలకు లోయర్‌ బెర్త్‌ ఎలా కేటాయిస్తారు? ఈ కథనంలో తెలుసుకుందాం..

ఒంటరి మహిళలకు ప్రత్యేకంగా సీటు కేటాయిస్తారా?

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకునే మహిళలకు, ముఖ్యంగా ఒంటరి మహిళకు సీటు కేటాయింపు విషయంలో వ్యవస్థ ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఒంటరి మహిళా ప్రయాణికురాలికి అందరూ పురుషులు ఉన్న క్యాబిన్‌లో కాకుండా అప్పటికే మహిళలు ఉన్న క్యాబిన్‌లో సీటు కేటాయించేందుకు ప్రయత్నిస్తుంది.

ఉదాహరణకు రైలు బోగీలో బెర్తులు క్యాబిన్‌లుగా విభజించి ఉంటాయి. సైడ్‌ లోయర్‌, సైడ్‌ అప్పర్‌ కాకుండా ఒక్కో క్యాబిన్‌లో అటు వైపు మూడు, ఇటు వైపు మూడు మొత్తం ఆరు బెర్తులు ఉంటాయి. ఇప్పుడు ఈ ఆరంటిలో 5 బెర్తులు ఇప్పటికే పురుషుల కేటాయించి ఉంటే ఆ మిగిలిన ఒక్క ఖాళీ బెర్తు ఒంటరి మహిళా ప్రయాణికురాలికి సిస్టమ్‌ బెర్త్‌ కేటాయించదు. ఒక్క మహిళ అయినా ఉండే మరో క్యాబిన్‌లో బెర్త్‌ కేటాయించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. రిజర్వేషన్‌ సీట్ల కేటాయింపు అందుబాటులో ఉన్న బెర్తులు, ప్రయాణ తరగతి, కోటాలు, ఇతర రిజర్వేషన్‌ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

మహిళలకు ప్రత్యేక బెర్తుల కోటా

రైల్వే అధికారిక సమాచారం ప్రకారం.. ఎక్కువ దూరం ప్రయాణించే మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌లో మహిళల కోసం ఆరు బెర్తులతో ప్రత్యేక కోటా ఉంది. వయసుతో సంబంధం లేకుండా ఒంటరిగా ప్రయాణించే మహిళలు లేదా మహిళల బృందాలు ఈ కోటా ద్వారా బెర్తులు పొందవచ్చు.  అయితే, ఈ కోటా అందుబాటు రైలు, ప్రయాణ తరగతి, బుకింగ్‌ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

45 ఏళ్లు దాటిన మహిళలకు లోయర్‌ బెర్త్‌ ప్రాధాన్యం

రైల్వేలో లోయర్‌ బెర్త్‌ కేటాయింపునకు సంబంధించి మహిళలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. స్లీపర్‌, ఏసీ త్రీటైర్‌, ఏసీ టూటైర్‌ వంటి నిర్దిష్ట రిజర్వేషన్‌ తరగతుల్లో 45 ఏళ్లు పైబడిన మహిళలకు, వృద్ధ ప్రయాణికులకు, దివ్యాంగులకు వర్తించే నిబంధనల ప్రకారం లోయర్‌ బెర్త్‌ల కేటాయింపులో ప్రాధాన్యం కల్పించే ఏర్పాట్లు ఉన్నాయి. అయితే, ఈ సదుపాయం అందరికీ తప్పనిసరిగా లోయర్‌ బెర్త్‌ లభిస్తుందనే హామీ కాదు. అందుబాటులో ఉన్న బెర్తులు, ప్రయాణ తరగతి, వర్తించే నిబంధనలను బట్టి కేటాయింపు జరుగుతుంది.

టికెట్‌పై అప్పర్‌ బెర్త్‌ వస్తే ఏం చేయాలి?

టికెట్‌ బుక్‌ చేసుకున్నప్పుడు అప్పర్‌ లేదా మిడిల్‌ బెర్త్‌ వచ్చిన మహిళలు, వృద్ధులు రైలులో లోయర్‌ బెర్త్‌ కావాలనుకుంటే టికెట్‌ తనిఖీ అధికారి (టీటీఈ)ని సంప్రదించవచ్చు. అదే రైలులో ఖాళీగా ఉన్న లోయర్‌ బెర్త్‌ అందుబాటులో ఉంటే, వర్తించే నిబంధనల ప్రకారం బెర్త్‌ మార్పునకు అవకాశం ఉండవచ్చు.

ఇదీ చదవండి: రియల్‌ ఎస్టేట్‌ సంపాదనలో ఇదో కొత్త ఐడియా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement