గూగుల్ తన జెమిని ఏఐ సేవల మోడళ్లలో మార్పులు చేయనుంది. అక్టోబర్ 9, 2026 నుంచి ఉచిత యూజర్లకు పరిమిత యాక్సెస్ ఉంటుందని గూగుల్ తెలిపింది. దాంతో వ్యక్తిగత గూగుల్ ఖాతాలతో జెమినిని ఉపయోగించే వారికి ఏఐ ప్లాన్ ఆధారంగా అందుబాటులో ఉండే మోడళ్లు, వినియోగ పరిమితుల్లో మార్పులు రానున్నాయి.
ప్రస్తుత అధికారిక సమాచారం ప్రకారం గూగుల్ ఏఐ ప్లస్ భారత్‌లో నెలకు రూ.399గా ఉంది. ఈ ప్లాన్‌లో ఉచిత స్థాయి కంటే రెండు రెట్లు అధిక వినియోగ పరిమితులు ఉంటాయి. గూగుల్ ఏఐ ప్రో నెలకు రూ.1,950తో నాలుగు రెట్లు అధిక వినియోగ పరిమితులను అందిస్తోంది.
అయితే అక్టోబర్ 9 నుంచి అమల్లోకి రానున్న మార్పుల ప్రకారం, ఉచిత యూజర్లకు అత్యంత శక్తివంతమైన మోడళ్ల యాక్సెస్ తగ్గనుంది. ఏఐ ప్లస్ వినియోగదారులకు ఫ్లాష్-లైట్, ఫ్లాష్ మోడళ్ల వరకు యాక్సెస్ ఉండగా, ప్రో మోడళ్ల కోసం ఏఐ ప్రో లేదా ఏఐ ఆల్ట్రా అవసరం కానుంది. AI Pro, AI Ultra ప్లాన్‌లు Pro మోడళ్లను కొనసాగిస్తాయి. జెమిని వినియోగంలో మరో కీలక మార్పు థింకింగ్/ఎఫర్ట్ స్థాయులకు సంబంధించినది. పనిని ఎంత లోతుగా విశ్లేషించాలన్న దానిపై వినియోగదారులకు మరింత నియంత్రణ ఇవ్వనున్న గూగుల్, అధిక స్థాయి రీజనింగ్ ఎంచుకున్నప్పుడు వినియోగ పరిమితి వేగంగా తగ్గుతుందని స్పష్టం చేస్తోంది.
అధికారికంగా గూగుల్ వినియోగ పరిమితులు ప్రాంప్ట్ సంక్లిష్టత, ఉపయోగించే మోడల్, ఫీచర్లు, చాట్ నిడివి వంటి అంశాలపై ఆధారపడతాయని చెబుతోంది. పరిమితులు సాధారణంగా ఐదు గంటల వ్యవధిలో రిఫ్రెష్ అవుతాయి. వారపు పరిమితి కూడా వర్తిస్తుంది. మొత్తంగా, జెమిని భవిష్యత్ వినియోగంలో ఉచిత యాక్సెస్ కంటే చెల్లింపు ప్లాన్‌లకు అధిక మోడల్ సామర్థ్యం, వినియోగ పరిమితులు కల్పించే దిశగా గూగుల్ అడుగులు వేస్తోంది.
ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం ధరలు.. ఇదే మంచి సమయం!


