ధర్మం చేయండి బాబు.. క్యూఆర్‌ కోడ్‌ యాక్సెప్టెడ్‌!

Details about Hitech Beggar in Bihar Who Accept Digital payments - Sakshi

గంగిరెద్దులు ఆడించే వ్యక్తి క్యూఆర్‌ కోడ్‌తో దానాలు స్వీకరించే వీడియోను గతంలో షేర్‌ చేశారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. ఇండియాలో డిజిటల్‌ పేమెంట్స్‌ వృద్ధికి ప్రతీకగా ఆ వీడియోను మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. అభివృద్ధి పట్టికలో అట్టడుగున ఉండే బీహార్‌లో ఓ బిచ్చగాడు మెడలో క్యూఆర్‌ కోడ్‌ తగిలించుకుని అడుక్కుంటూ వార్తల్లో ట్రెండవుతున్నాడు. 

బీహార్‌ రాష్ట్రంలో బెట్టియా రైల్వే స్టేషన్‌ ఉంది. అక్కడే ఉన్నాడు హైటెక్‌ బిచ్చగాడు రాజు పటేల్‌ (40). రైల్వేస్టేషన్లు, రైళ్లలో అడుక్కుంటూ రాత్రి వేళ అక్కడే పడుకుంటూ కొన్నేళ్లుగా జీవిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగిపోయాయి. ఎవరిని ధర్మం అడిగినా చిల్లర లేదంటూ చెప్పడం కామన్‌ అయిపోయింది. దీంతో రాజు పటేల్‌కి బిచ్చం తగ్గిపోయింది. 

మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా అప్‌డేట్‌ అయ్యాడు రాజు పటేల్‌. గతంలో బిచ్చం ఎత్తుకోగా వచ్చిన డబ్బులతో సమీపంలో బ్యాంకుకి వెళ్లి ఖాతా ఓపెన్‌ చేశాడు. బ్యాంకు అకౌంట్‌ ఆధారంగా ఓ డిజిటల్‌ పేమెంట్‌ సర్వీస్‌ అందించే సంస్థ నుంచి ఈ వాలెట్‌ - క్యూ ఆర్‌ కోడ్‌ సాధించాడు. అక్కడితో ఆగిపోలేదు.. తనకు బిచ్చం వస్తుందో రావట్లేదో తెలుసుకునేందుకు ఓ ట్యాబ్‌ కూడా కొనుక్కున్నాడు. 

ఎప్పటిలాగే స్టేషన్‌ ఆవరణలో బిచ్చం అడుక్కోవడం ప్రారంభించారు. అయితే కొత్త పద్దతిలో దీన్ని ప్రారంభించారు. మెడలో క్యూఆర్‌ కోడ్‌ ఉన్న ప్లకార్డు, చేతిలో ట్యాబ్‌తో.. ధర్మం చేయండి బాబు అని వేడుకుంటాడు. ఎవరైనా బిచ్చం వేయబోతే వెంటనే మెడలో క్యూఆర్‌ కోడ్‌ చూపిస్తాడు. ధర్మం వచ్చింది లేనిది ట్యాబ్‌లో చెక్‌ చేసుకుంటాడు. 

రాజు పటేల్‌ బిచ్చం అడుక్కునే తీరుతో తోటి బిచ్చగాళ్లు అవాక్కవుతున్నారు. ఆ నోటా ఈ నోటా చివరకు రాజు పటేల్‌ స్టోరీ సోషల్‌ మీడియాకు చేరుకుంది. ఇండియాలో డిజిటల్‌ పేమెంట్స్‌ విస్త్రృతికి ఇదో ఉదాహరణగా కొందరు చెబుతుంటే మరికొందరు డిజిటల్‌ పేమెంట్స్‌ వచ్చినా పేదరికం మాత్రం పోవడం లేదంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top