గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనంత్
ముంబైలోని ప్రఖ్యాత హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్న బాలుడు వేదాంశ్కు అనంత్ అంబానీ అండగా నిలిచారు. వేదాంశ్ కుటుంబానికి గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ చికిత్సకు పూర్తి స్థాయి భరోసా కల్పించారు. అత్యుత్తమ వైద్యుల నియామకమే కాకుండా కుటుంబ సభ్యుల విమాన ప్రయాణ టికెట్లు, హోటల్ బస, రవాణా, ఆహార వసతితో పాటు అన్ని రకాల అత్యవసర ఏర్పాట్లను రిలయన్స్ ఫౌండేషన్ స్వయంగా పర్యవేక్షిస్తోంది.
గత రెండు మూడు రోజులుగా ముంబై ఆసుపత్రిలో వేదాంశ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పలు కీలక పరీక్షలు నిర్వహించారు. జన్యు చికిత్స పూర్తయిన తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు, వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి బాలుడిని రక్షించే విధానాలపై వైద్య నిపుణులు కుటుంబ సభ్యులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రస్తుతం వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు నెదర్లాండ్స్ నుంచి మరో 15-20 రోజుల్లో రానున్నట్లు తెలుస్తోంది.
ఈ నివేదికలు అందిన తర్వాత వైద్యులు వాటిని పరిశీలించి పరిస్థితి అనుకూలిస్తే తదుపరి జన్యు చికిత్స ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ సమయం తీసుకునేదైనప్పటికీ ప్రస్తుతం వేదాంశ్ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. వేదాంశ్ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆర్థిక సాయం అందించిన ప్రతి ఒక్కరికి, వీడియోలను షేర్ చేసి ప్రార్థనలు చేసిన శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైద్యుల నుంచి అధికారిక సమాచారం అందిన వెంటనే చికిత్స తదుపరి దశ వివరాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. కష్టకాలంలో ఆపన్నహస్తం అందించిన అనంత్ అంబానీ మానవతా దృక్పథంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
అసలేమైందంటే..
చిన్నారి వేదాంశ్ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్-1 వంటి అత్యంత అరుదైన, జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ ప్రాణాంతక వ్యాధికి అవసరమైన జన్యు చికిత్స, మందుల ఖర్చు లక్షల రూపాయలతో కూడుకున్నది కావడంతో సాధారణ మధ్యతరగతి కుటుంబానికి ఆ మొత్తం భరించడం అసాధ్యంగా మారింది. చిన్నారి ప్రాణాలు కాపాడుకోవడం కోసం కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా సహాయం కోరడంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఈ ఉదంతం అనంత్ అంబానీ దృష్టికి వెళ్లింది. ఆయన స్పందిస్తూ ఆ కుటుంబానికి అండగా నిలుస్తానని మాటిచ్చి ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యానికి ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: ఇంట్లో మహారాణులు.. పెట్టుబడుల్లో ప్రేక్షకులు!


