Sakshi News home page

ఇక న్యాయ, పాలనా సంస్కరణలపై కేంద్రం దృష్టి

Published Thu, Aug 10 2023 5:05 AM

Administrative, legal reforms to be on govt agenda - Sakshi

కోల్‌కతా:  ప్రభుత్వం తదుపరి సంస్కరణల ఎజెండాలో దేశంలోని పరిపాలనా, న్యాయ రంగాలేనని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్‌ సన్యాల్‌ అన్నారు.ఇక్కడ భారత్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (బీసీసీ)లో సన్యాల్‌ మాట్లాడుతూ, 2014లో కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఇన్నోవేషన్‌ (ఆవిష్కరణ) ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు.

‘‘2014 నుండి సంస్కరణల కొత్త పథం అమలులోకి వచ్చింది. గత దశాబ్దంలో, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం సంస్కరణలు జరిగాయి.  దివాలా కోడ్‌ (ఐబీసీ), వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వంటి కీలక వ్యవస్థలు అమల్లోకి వచ్చాయి. ద్రవ్యోల్బణ లక్ష్యం నిర్దేశ విధానం ప్రారంభమైంది’’ అని ఆయన అన్నారు. ‘‘ఇప్పుడు రెండు ప్రధాన సంస్కరణలు.. పరిపాలనా– న్యాయపరమైన సంస్కరణలు అవశ్యం. దీనికి విస్తృత ప్రజా మద్దతు అవసరం’’ అని ఆయన అన్నారు. 

7 శాతం వరకూ వృద్ధి
స్థూల ఆర్థిక అంశాలను పరిశీలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.5 శాతం నుంచి 7 శాతం వరకూ వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు సన్యాల్‌ విశ్లేíÙంచారు. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరత్వం ఉన్నాయని,   కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌– దేశంలోకి వచ్చీ పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) తగిన స్థాయిలో ఉందని, 13 నెలలకు సరిపడా విదేశీ మారక నిల్వలు  (600 బిలియన్‌ డాలర్లు) ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఉద్దీపనలతో దేశంలో డిమాండ్‌ పరిస్థితులను పెంచాల్సిన తక్షణ అవసరం ఏదీ లేదని కూడా ఆయన ఉద్ఘాటించారు. ఇలాంటి విధానాలతో దిగుమతులు పెరిగితే అది క్యాడ్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. కోవిడ్‌ సంవత్సరాల్లో తీవ్ర ప్రభావానికి గురయిన సరఫరాల వ్యవస్థను పటిష్టంగా ఉంచాల్సిన అవసరం మాత్రం తక్షణం ఉందని ఉద్ఘాటించారు. ద్రవ్యోల్బణంపై అప్పుడప్పుడు కూరగాయల ధరలు పెరుగుతున్న ప్రభావం మినహా అంతర్లీన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అంత బలంగా లేవని భరోసాను ఇచ్చారు.  

మౌలిక రంగం ఊతం
మౌలిక రంగంలో గత పెట్టుబడులు ఇప్పుడు మనకు ప్రయోజనం సమకూర్చుతున్నట్లు సన్యాల్‌ తెలిపారు.  ప్రపంచాన్ని నిరుత్సాహపరిచే పలు ఆర్థిక పరిస్థితలు నేపథ్యంలో భారత్‌ 6.5 శాతం వృద్ధి సాధించడం మామూలు విషయం కాదని కూడా స్పష్టం చేశారు. ఉద్దీపనల వంటి చర్యలతో వృద్ధి వేగాన్ని భారీగా పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం లేదని ఆయన పేర్కొంటూ, ‘‘స్పష్టమైన రహదారి ఉన్నప్పుడే మనం ఆ పని చేయగలం. ఇప్పుడు ఈ బాటలో తీవ్ర ఒడిదుడుకులు ఉన్నాయి’’ అని విశ్లేíÙంచారు. స్థూల ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం ఇప్పుడు కీలకమని పేర్కొన్న ఆయన ఈ విషయంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ సుస్థిరత, సరఫరాల వ్యవస్థలో లోపాలు లేకుండా చేయడం ముఖ్యమన్నారు.

జర్మనీ, జపాన్‌ సరేకానీ...
అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌ తర్వాత ఐదవ స్థానంలో నిలిచిన భారత్‌ ఎకానమీ మన ముందు ఉన్న దేశాలను అధిరోహిస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదని అన్నారు. అయితే తొలి రెండు దేశాలు మాత్రం మనకంటే ఎంతో ముందు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుచేశారు. రూపాయిని అంతర్జాతీయం చేసి, వాణిజ్య మారి్పడిలో కీలక మారకంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోందని సన్యాల్‌ అన్నారు. ‘‘అమెరికా డాలర్‌ విషయంలో ఈ విధానం ఎంతమాత్రం జోక్యం చేసుకోదు. రూపాయిని భవిష్యత్తులో యాంకర్‌ కరెన్సీగా ఉండాలన్నదే దేశ విధానం’’ అని ఆయన చెప్పారు. చివరిగా 2011లో జరిగిన జనాభా లెక్క జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తదుపరి జనాభా గణన చేయాల్సిన అవసరం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా సన్యాల్‌ పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement