
సన్నాలకే జై..
● బోనస్ నేపథ్యాన రైతుల మొగ్గు ● విదేశీ ఎగుమతులకూ ఇవే సరి ● డిమాండ్ ఆధారంగా విత్తనాలు అందుబాటులోకి...
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లాలో ప్రధాన పంట వరి కాగా.. రైతులు కొన్నేళ్ల క్రితం వరకు ఎక్కువగా దొడ్డు రకాలనే సాగు చేసేవారు. కొందరు మాత్రమే సన్న రకాలకు మొగ్గు చూపేవారు. సన్న రకాల కన్నా దొడ్డు రకాలు కొంతమేర అధిక దిగుబడి ఇవ్వడం, ధరలో పెద్ద తేడా లేకపోవడం, త్వరగా చేతికి రావడం ఇందుకు కారణమయ్యేది. కానీ కాలక్రమంలో సన్న రకాలకు డిమాండ్ పెరగడం, ధర ఎక్కువగా ఉండడంతో రైతులు ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుండడం.. నీటి వసతి పెరగడంతో గత ఏడాది ఖరీఫ్, యాసంగిలో రైతులు ఎక్కువగా సన్న రకాలే సాగు చేశారు. అంతేకాక వచ్చే ఖరీఫ్‌లోనూ అటే మొగ్గు చూపుతుండడంతో విత్తనాభివృద్ది సంస్థ, ప్రైవేట్ వ్యాపారులు ఆయా రకాల విత్తనాలు సిద్ధం చేస్తున్నారు.
విదేశీ ఎగుమతులకు ప్రాధాన్యత
తెలంగాణలోని పలు జిల్లాల్లో సాగయ్యే వరికి విదేశాల్లో డిమాండ్ ఉంది. ఇప్పటికే పిలిప్పీన్స్‌తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వియత్నాం, ఇండోనేషియా దేశాలతోనూ ఒప్పందం కుదిరే అవకాశమున్నందున ఎగుమతికి అనువైన రకాలను సాగు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా రకాలను సుమారు 2.50 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలనేది లక్ష్యం కాగా, ఉమ్మడి నల్ల గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
అందుబాటులో అనేక రకాలు
ప్రభుత్వ లక్ష్యం, రైతులకు బోనస్, ధర లభిస్తున్న నేపథ్యాన సన్నరకాల విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడంపై యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో సన్న రకానికి సంబంధించి ఎక్కువగా బీపీటీ 5204(సాంబమసూరి) సాగు చేస్తారు. ఇది కాక వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అనేక రకాల విత్తనాలను ప్రవేశపెట్టగా, ప్రైవేట్ కంపెనీ లూ విక్రయిస్తున్నాయి. ఆర్‌ఎన్‌ఆర్ 15048, కేఎన్‌ఎం 1638, హెచ్‌ఎంటీ, తెలంగాణ సోనా, వరంగల్ సోనా, పూజ, చింటు, జిలకర సన్నాలు, జగిత్యాల సాంబ, నెల్లూరు సాంబ, ఐఆర్ 64, ఎంటీయూ 1010, వరంగల్ కాటన్ దొర సన్నాలు, సురేఖ, మసూరి వంటి రకాలు అందుబాటులోకి వచ్చాయి.
విత్తనాభివృద్ది సంస్థ సిద్ధం
ఖమ్మం జిల్లాలో 3లక్షలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. మెజార్టీ రైతులు సన్నాలపై మొగ్గు చూపుతున్నందున తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఖమ్మం యూనిట్‌లో బీపీటీ 5204 రకం 3,400 క్వింటాళ్లు, కేఎన్‌ఎం 1638 రకం 200 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశారు. ఏటా వ్యవసాయ శాఖ ఇచ్చే ఇండెంట్ ఆధారంగా విత్తనాలు సమకూరుస్తుండగా, ఈసారి పూర్తిగా సన్న రకాలే అందుబాటులో ఉంచాలని సూచించినట్లు తెలిసింది. దీంతో మిగతా విత్తనాలు సేకరించడంలో నిమగ్నమయ్యారు. బీపీటీ 5204 వంటి రకాలు 25 కిలోల బస్తా విత్తనాలు ధర రూ.1,075 ఉండగా, ప్రైవేట్ కంపెనీలవైతే డిమాండ్ ఆధారంగా రూ.1,200 వరకు ఉంటోంది.
త్వరలోనే సరఫరా
ప్రభుత్వం నిర్దేశించిన సన్న వరి రకాల విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటికే బీపీటీ 5204(సాంబమసూరి), కేఎన్‌ఎం 1638 విత్తనాలు ఉన్నాయి. ఇంకొన్ని త్వరలోనే జిల్లాకు చేరుకుంటాయి. ఆపై పీఏసీఎస్‌లు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు సరఫరా చేస్తాం.
– ఎన్.బిక్షం, ప్రాంతీయ మేనేజర్,
విత్తనాభివృద్ధి సంస్థ
దొడ్డు రకాలకు చెల్లుచీటీ?
వరిలో దొడ్డు రకాలకు కాలం చెల్లినట్లేనని పలువురు చెబుతున్నారు. ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ ఇస్తుండడమే కాక రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు కూడా ఇదే బియ్యం సరఫరా చేస్తున్న నేపథ్యాన రైతులు సన్న రకాలే సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఈనేపథ్యాన తక్కువ కాలపరిమితి కలిగి, అధిక దిగుబడి ఇచ్చే దొడ్డు రకాలైన ఎంటీయూ 1001 తదితరాల సాగు గణనీయంగా తగ్గముఖం పడుతోంది.

సన్నాలకే జై..