
దేశంలో వైద్య విద్య అవకాశం దక్కక విదేశీ బాట పడుతున్న విద్యార్థులు
అనంతరం ఎఫ్‌ఎంజీఈలో రాణించలేక పోతున్న వైనం
మన దేశంలో పీజీ లేదా ప్రాక్టీస్ కోసం ఈ పరీక్ష పాసవ్వడం తప్పనిసరి
2025 జూన్‌లో ఏకంగా 81.39 శాతం మంది ఫెయిల్
పాఠ్యాంశాల్లో తేడా.. తక్కువ క్లినికల్ ఎక్స్‌పోజరే కారణమంటున్న నిపుణులు
దాదాపు ఏటా ఇదే పరిస్థితి.. 20 శాతంలోపే ఉత్తీర్ణత
సాక్షి, అమరావతి : దేశంలో అవకాశం లభించక విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు.. అనంతరం మన దేశంలో పీజీ లేదా ప్రాక్టీస్ కోసం అవసరమయ్యే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ) గట్టెక్కలేక చతికిల బడుతున్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ అభ్యసించిన వారికి ఈ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ పరీక్షను ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) నిర్వహిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన ఎఫ్‌ఎంజీఈ పరీక్ష ఫలితాలను బుధవారం ప్రకటించారు.
36,034 మంది పరీక్ష రాయగా, కేవలం 18.61 శాతం అంటే 6,707 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఏకంగా 81.39 శాతం మంది మెడికోలు పరీక్ష తప్పారు. కొన్నేళ్లుగా ఎఫ్‌ఎంజీఈ పాస్ పర్సంటేజీ చాలా తక్కువగా ఉంటోంది. దీంతో విదేశాల్లో వైద్య విద్య నాణ్యతపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏటా ఎఫ్‌ఎంజీఈ పరీక్షల్లో 70 నుంచి 80 శాతం మందికిపైగా ఫెయిల్ అవుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో 45,552 మంది పరీక్ష రాయగా 13,149 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
గత పదేళ్లలో ఇదే అత్యధిక పాస్ పర్సంటేజీ అని తెలుస్తోంది. 2015–18 మధ్య నాలుగేళ్లలో 61 వేల మందికిపైగా పరీక్ష రాయగా 14 శాతం మేర మాత్రమే ఉత్తీర్ణత సా«ధించారు. భారత పాఠ్యాంశాలతో పోలిస్తే విదేశాల్లో పాఠ్యాంశాల్లో వ్యత్యాసం ఉండటం, తక్కువ క్లినికల్ ఎక్స్‌పోజర్, కొన్ని దేశాల్లో ఇంగ్లిష్ లో కాకుండా అక్కడి భాషల్లో బోధన వంటివి తక్కువ ఉత్తీర్ణతకు కారణమని వైద్య రంగ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
లక్ష్యం నెరవేరక దిగాలు
దేశంలో 20 లక్షల మందికిపైగా విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్ దక్కించుకోవడం కోసం నీట్ యూజీ రాస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో 1.20 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. డిమాండ్‌కు సరిపడా సీట్లు లేకపోవడంతో కష్టపడి చదివిన పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు కన్వినర్ కోటా సీట్లు దక్కడం లేదు. మన దగ్గర ఉన్న ఫీజులతో యాజమాన్య కోటా కింద చదవడం మధ్యతరగతి వారికి తలకు మించిన భారం. ఈ క్రమంలో ఎలాగైనా పిల్లల వైద్య విద్య కలను సాకారం చేయాలనే లక్ష్యంతో అప్పులు చేసి మరీ విదేశాలకు పంపుతున్నారు.
రష్యా, చైనా, ఉక్రెయిన్, నేపాల్, బంగ్లాదేశ్, కజకిస్తాన్, అర్మేనియా, జార్జియా వంటి దేశాలను ఆశ్రయిస్తున్నారు. ఏపీ నుంచి ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు విదేశాలకు ఎంబీబీఎస్ చదవడానికి వెళుతున్నారు. కాగా, కొన్ని దేశాల్లో మన ప్రమాణాలకు అనుగుణంగా వైద్య విద్య లేకపోవడంతో కోర్సు పూర్తయ్యాక ఎఫ్‌ఎంజీఈ గట్టెక్కడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బయట చదివి వచ్చినా, స్థానికంగా ప్రాక్టీస్ పెట్టుకోలేని పరిస్థితి. ఏపీ విద్యార్థులు ఈ తరహా కష్టాలు పడకుండా నివారించే లక్ష్యంతో రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వైద్య విద్య అవకాశాలను విస్తరించేలా అడుగులు వేసింది.
17 కొత్త వైద్య కళాశాలలు నెలకొల్పడం ద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులకు సమకూర్చడం కోసం కృషి చేసింది. 2023–24లో విజయవంతంగా 750 సీట్లను సమకూర్చింది. అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం మన విద్యార్థులకు తీరని ద్రోహం తల పెట్టింది. ఈ క్రమంలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.