
రాష్ట్రంలో ప్రైవేటు సంస్థలకు సెక్యూరిటీ కెమెరాల నిర్వహణ
అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిరంతర నిఘా
15 వేల కెమెరాల సమాచారం ఏఐ/ఎంఎల్ ఆధారంగా విశ్లేషణ
నాలుగేళ్లపాటు నిర్వహణ కోసం బిడ్లు కోరిన ఏపీఎస్‌ఎఫ్‌ఎల్
సాక్షి, అమరావతి : స్వర్ణాంధ్ర–2047లో భాగంగా రాష్ట్రంలో సుస్థిరమైన భద్రత, రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిఘా నేత్రాల ఏర్పాటు, పర్యవేక్షణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారులు, ఆరోగ్య శాఖ, తదితర ప్రభుత్వ విభాగాలకు చెందిన సీసీ టీవీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షించే బాధ్యతను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది. రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్లపాటు సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించడానికి ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ఏపీ ఫైబర్‌నెట్ తాజాగా టెండర్లు పిలవడమే ఇందుకు ఉదాహరణ.
ఎంపికైన సంస్థ.. ఏదైనా ఘటన జరిగితే లైవ్ అలెర్ట్‌లు ఇవ్వడం, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తుంది. ఆటోమేటిక్‌గా నంబర్ ప్లేట్, ముఖాలను గుర్తించే వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. భారీ బహిరంగ సభలు, శాంతి భద్రతలు, ట్రాఫిక్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మిషన్ లెరి్నంగ్ (ఎంఐ)లతో విశ్లేషించనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డేటాను క్రోడీకరించి ఆర్టీజీఎస్‌లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్‌కు పంపించాల్సి ఉంటుంది.
ప్రతి నగరం, పట్టణంపై నిఘా
ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నగరం, పట్టణం, జిల్లా సరిహద్దులు, ముఖ్యమైన సెంటర్లు, జంక్షన్లు, ప్రధాన భవనాలకు వెళ్లే రహదారులు, ప్రభుత్వ బిల్డింగ్‌లు, ముఖ్యమైన ఆస్పత్రులు, పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, టాక్సీ స్టాండ్‌ల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలి. సిటీ ఫ్లైవోవర్స్, వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు, విద్యుత్ సరఫరా స్టేషన్లు, మంచినీటి సరఫరా, పంపింగ్ స్టేషన్లు, వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్స్, జనాభా అత్యధికంగా గుమికూడే ప్రాంతాల్లో కూడా నిఘాను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
నిరంతరం ఈ డేటాను విశ్లేషించడం కోసం సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు ప్రతి జిల్లాలో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రత్యేక వ్యూయింగ్ సెంటర్లు, మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు.. స్మార్ట్‌ఫోన్ల ద్వారా నిర్వహించేలా ఏర్పాటు చేయాలి. ఇందుకోసం కొత్తగా 300 ఆధునిక కెమెరాలతో పాటు ఇప్పటికే ఉన్న14,770 కెమెరాలను అనుసంధానం చేస్తారు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ 12 నెలల్లోగా ఏఐ బేస్డ్ సీసీటీవీ సర్వైలెన్స్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది.