
ప్రభుత్వానికి భూములు ఇవ్వబోమని తేల్చిచెబుతున్న మూలపాడు గ్రామస్తులు
జీవనాధారమైన భూములను లాక్కోవద్దు
స్పోర్ట్స్ సిటీకి భూ సమీకరణను ఒప్పుకోని రైతులు
అయినా ఎన్టీఆర్ జిల్లాలో ల్యాండ్ పూలింగ్‌కు రంగం సిద్ధం.. 5 గ్రామాల్లో 2,874 ఎకరాల పూలింగ్.. వీటిలో ఎక్కువ పట్టా భూములే!
ప్రతి గ్రామసభలోనూ అన్నదాతల నుంచి తీవ్ర వ్యతిరేకత.. మూలపాడులో 90 శాతం మంది రైతుల నిరసన
కాచవరంలో ఒకరిద్దరు తప్ప అందరూ తిరస్కరణ.. కేతనకొండలో అందరూ వ్యతిరేకంగా నినాదాలు
జమీమాచవరంలో అనుకూలంగా ఒక్కరూ లేరు.. లంకలకు వరద తాకిడితో మెరక భూములపై కన్ను
ఆర్డీవో కావూరి చైతన్య వద్ద తేల్చిచెప్పిన రైతులు
భూమితో మాది విడదీయరాని అనుబంధం.. వ్యవసాయం తప్పితే మాకు వేరే వృత్తి తెలియదు.. తక్కువో ఎక్కువో ఉన్నదాంట్లోనే పంటలు పండించుకుంటున్నాం, గుట్టుగా బతుకుతున్నాం.. కన్నతల్లి లాంటి భూమిని మానుంచి లాక్కుని మా జీవితాలతో ఆటలాడొద్దు.. గతంలో భూ సమీకరణకు తీసుకున్న భూములకే ఇప్పటికీ దిక్కూమొక్కు లేదు.. ఇప్పుడు మా నుంచి తీసుకున్న భూమికి ఎప్పుడు న్యాయం చేస్తారు? కళ్లముందు ఉన్న భూమిని పోగొట్టుకుని.. ఎక్కడో ఇచ్చే భూమి మాకెందుకు? – స్పోర్ట్స్ సిటీ భూసమీకరణ గ్రామసభల్లో రైతులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా, మా భూములు ఎందుకివ్వాలని నిలదీస్తున్నా, తమ జీవితాలతో ఆడుకోవద్దని వేడుకుంటున్నా, స్పోర్ట్స్ సిటీ పేరుతో భూ సమీకరణ ద్వారా భారీఎత్తున భూములను తీసుకునేందుకే ప్రభుత్వం సిద్ధమవుతోంది. అన్నదాతలు ససేమిరా అంటున్నా.. మాయమాటలతో మభ్యపెట్టి ముందుకు అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగానే అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. వీటిలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా సరే సర్కారు తన ధోరణిని మార్చుకోవడం లేదు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు, త్రిలోచనాపురం, కాచవరం, కేతనకొండ, జమీమాచవరంలో స్పోర్ట్స్ సిటీకి అవసరమైన భూములను ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేశారు. వాస్తవానికి స్పోర్ట్స్ సిటీకి తొలుత కృష్ణా నది లంక గ్రామాలు, లంక భూములను ప్రభుత్వ పెద్దలు ఎంచుకున్నారు. నెల రోజుల క్రితం కృష్ణా పరీవాహక ప్రాంతమైన చినలంక, పెదలంక, ఇబ్రహీంపట్నం, జూపూడిలో లంక భూములను మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, పలువురు ఎమ్మెల్యేలు పరిశీలించారు. కానీ, ఈ భూములకు కృష్ణా వరద తాకిడి ఉంటుందనే కారణంతో తాజాగా మూలపాడు పరిధిలోని మెరక ప్రాంత భూములపై కన్నేశారు.
అయితే, స్పోర్ట్స్ సిటీ, ఐకానిక్ బ్రిడ్జి పేరుతో విలువైన, జీవనాధారమైన భూములను తీసుకునేందుకు ప్రభుత్వం పన్నిన పన్నాగాన్ని రైతులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. స్పోర్ట్స్ సిటీ పేరుతో వ్యాపారం చేసేందుకే తమ భూములను తీసుకుంటున్నారనే అభిప్రాయం రైతుల్లో నెలకొంది. దీంతో పంట పొలాలను ఇవ్వబోమని విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య ఎదుట తెగేసి చెప్పారు. వారు ఒప్పుకోకున్నా ఏదోరకంగా భూములు స్వా«దీనం చేసుకునే ఎత్తుగడల్లో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు.
ఒప్పుకోకున్నా ఒప్పుకొన్నట్లు..
రైతుల అభిప్రాయ సేకరణకు రెవెన్యూ అధికారులు గురు, శుక్రవారాల్లో గ్రామ సభలు నిర్వహించారు. మూలపాడు సభలో కొందరు భూములు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు కూటమి నేతలు ప్రకటించారు. కానీ, వెంటనే 90 శాతం మంది రైతులు ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వబోమని తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు తెగేసి చెప్పారు. అమరావతి రాజధానినే ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదని ఇక తమ ప్రాంతాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారని సూటిగా ప్రశి్నంచారు. వ్యవసాయమే జీవనాధారంగా బతికే తాము పొలాలను ఎలా ఇస్తామని నిలదీశారు.
భూమి మా చేతిలో ఉంటేనే బంగారం
జమీమాచవరంలో సభకు హాజరైన రైతులు అందరూ ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చేది లేదని తేల్చి చెప్పారు. కాచవరం, కేతనకొండ గ్రామ సభల్లో ఆర్డీవో కావూరి చైతన్య పాల్గొన్నారు. కాచవరంలో ఒకరిద్దరు భూస్వాములు మినహా మిగిలిన రైతులు ప్రభుత్వానికి పొలాలు ఇవ్వబోమని ప్రకటించారు. కేతనకొండలో రైతులు నిరసనగా చప్పట్లు కొడుతూ మరీ పొలాలు ఇచ్చేది లేదని వెల్లడించారు. ‘భూమి మా ఆధీనంలో ఉంటే పిల్లల చదువులు, వివాహాలు, కుటుంబ అవసరాలకు వాడుకుంటాం. ప్లాటు ఇవ్వడానికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. అప్పటివరకు మా అవసరాలు ఎలా తీరతాయి’ అంటూ ఆర్డీవో చైతన్యను రైతులు సూటిగా ప్రశి్నంచారు.
2,874 ఎకరాల సేకరణకు ఎత్తుగడ
ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండలం ఐదు గ్రామాల పరిధిలోని భూములను ల్యాండ్ పూలింగ్‌లో సేకరించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి గ్రామాల్లో ఉన్న భూముల వివరాలను వెల్లడించారు. మూలపాడులో 313 ఎకరాలు, కాచవరంలో 590 ఎకరాలు, త్రిలోచనాపురంలో 1,390 ఎకరాలు, జమీమాచవరంలో 301 ఎకరాలు, కేతనకొండలో 280 ఎకరాలు చొప్పున మొత్తం 2,874 ఎకరాలను ల్యాండ్ పూలింగ్‌లో తీసుకోనున్నారు. వీటిలో ఎక్కువగా పట్టా భూములు ఉండగా, ఎన్‌ఎస్‌పీ కాలువ, ప్రభుత్వ అసైన్‌మెంట్, లంక భూములు కొన్ని ఉన్నాయి.
చిన్న, సన్నకారు రైతుల పొట్టకొడతారా?
చిన్న, సన్నకారు రైతుల భూములను ల్యాండ్ పూలింగ్‌లో తీసుకోవడం దుర్మార్గమైన చర్య. వారి పొట్టకొడతారా? పూలింగ్‌పై ప్రతి గ్రామంలో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. రెవెన్యూ అధికారుల వద్ద వారి ఆవేదనను వెల్లడించారు. భూములే జీవనాధారం అని కూడా తేల్చిచెప్పారు. మెజార్టీ రైతుల అభిప్రాయం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. –గరికపాటి శ్రీదేవి, జెడ్పీ వైస్ చైర్మన్, మూలపాడు
3 పంటలు పండే భూములు..
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఇబ్రహీంపట్నంలో ఎకరా రూ.కోటి నుంచి రూ.2 కోట్ల ధర పలుకుతోంది. మా భూముల్లో ఏడాదికి మూడు పంటలు పండుతాయి. వీటిని ప్రభుత్వానికి ఇచ్చేది లేదు. – ఎస్‌డీ జానీ, పీఏసీఎస్ మాజీ చైర్మన్, కేతనకొండ
ఉన్నది 80 సెంట్లు.. అదీ తీసుకుంటారా?
80 సెంట్ల భూమిలో వ్యవసాయం చేస్తున్నా. కొంత భాగం పొలంలో గ్రాసం పెంచి పాడి పరిశ్రమను నిర్వహిస్తున్నా. కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకు వ్యవసాయం తప్ప మరో పని తెలియదు. ఇప్పుడు ఉన్న పొలం తీసుకుని ప్లాటు ఇస్తామంటే ఎలా? – ఆళ్ల శ్రీనివాసరావు, రైతు, త్రిలోచనాపురం