
హాస్టళ్లలో సెల్ఫోన్ల చోరీ కేసు ఛేదన
నిందితుడి అరెస్ట్, 12 ఫోన్లు స్వాధీనం
తాటిచెట్లపాలెం: ద్వారకానగర్‌లోని హాస్టళ్లలో సల్ఫోన్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి.. అతని నుంచి 12 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు క్రైం ఏడీసీపీ మోహనరావు తెలిపారు. ద్వారకా పోలీస్‌స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ద్వారకానగర్‌లోని శ్రీచక్ర బాయ్స్ హాస్టల్‌ను కొవ్వూరి సోమిరెడ్డి నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 7న హాస్టల్లో ఉంటున్న గణేష్ అనే విద్యార్థి తన ఫోన్ కనిపించడం లేదని సోమిరెడ్డికి తెలిపాడు. దీంతో ఆయన హాస్టల్లో విచారించగా.. మొత్తం ఆరు ఫోన్లు, అదే ప్రాంగణంలోని మరో హాస్టల్లో ఐదు ఫోన్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో సోమిరెడ్డి ద్వారకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ద్వారకా పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో నిందితుడు కనకం దామోదర్గా గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు గత నెల 27న అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 12 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కనకం దామోదర్‌పై గతంలో వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో సుమారు 20 సెల్‌ఫోన్ దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని ఏడీసీపీ తెలిపారు.