● విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు ● పరీక్ష కేంద్రాల్లో సకల సౌకర్యాలు ● రేపటి నుంచి 31 వరకు నిర్వహణ
సాక్షి, అనకాపల్లి: పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా మొత్తం107 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 17న ప్రారంభమై 31వ తేదీతో ముగుస్తాయి. 31వ తేదీ రంజాన్ సెలవు ప్రకటిస్తే.. ఆ రోజు జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 1వ తేదీన నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష సమయం. అరగంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష సమయం ముగిసేవరకు విద్యార్థులు బయటకు రాకూడదు. పరీక్ష కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు గానీ, సెల్‌ఫోన్లు గానీ, స్మార్ట్ వాచీలు గానీ అనుమతించరు. మాస్ కాపీయింగ్‌కు ఎలాంటి అవకాశాలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. టెన్త్ విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా అన్ని చర్యలు తీసుకున్నారు. విద్యార్థి హాల్‌టికెట్ చూపిస్తే చాలు.. టిక్కెట్ లేకుండానే ప్రయాణించవచ్చు.
పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ క్యాంప్‌లు
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి పరీక్ష కేంద్రంలో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచుతున్నారు. తాగునీటి సౌకర్యం, పరీక్ష గదిలో ఫ్యాన్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. టేబుళ్లు, మరుగుదొడ్లు తదితర వసతులు అందుబాటులో ఉన్న పరీక్ష కేంద్రాలనే ఎంపిక చేశారు.
ఏర్పాట్లు పూర్తి
పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాటు పూర్తిచేశాం. విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్ష కేంద్రానికి చేరుకోవచ్చు. వారికి అందుబాటులో ఉండేలా స్టాప్‌లు ఏర్పాటు చేయాలని ప్రజారవాణా శాఖ వారిని కోరాం. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాగునీటి సదుపాయం కల్పించి, పరీక్ష గదుల్లో ఫ్యాన్లు పనిచేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వెలుతురు బాగా ఉన్న గదులను ఎంపిక చేశాం.
– అప్పారావునాయుడు,
జిల్లా విద్యాశాఖాధికారి
●
పది పరీక్షలకు పక్కా ఏర్పాట్లు