తుమ్మపాల : కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి మహిళ చదువుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొల్లమాంబ జయంతి వేడుకల్లో మొల్లమాంబ చిత్రపటానికి ఆమె పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మహిళలను విద్యకు దూరం చేశారనే భావనను చెరిపేస్తూ 14వ శతాబ్దంలోనే కవయిత్రి మొల్ల సంస్కృతం అభ్యసించారన్నారు. మహిళా దినోత్సవం జరుపుకొన్న కొద్దిరోజులలోనే మహనీయురాలు మొల్లమాంబ జయంతి జరుపుకోవడం, ఆమెను గురించి తెలుసుకోవడం అదృష్ట్టమన్నారు. సంస్కృతంలో గల రామాయణాన్ని తెలుగువారి కోరిక మేరకు తెలుగులోనికి అనువదించడంతో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. కవయిత్రి మొల్లమాంబ చదువుకుని తను కోరిన విధంగా జీవించారని, ప్రతి మహిళ ఆమెను స్ఫూర్తిగా తీసుకుని చక్కగా చదువుకోవాలని, కోరుకున్న ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. కుటుంబంలో ఆడపిల్లలకు వారి కలలు తీర్చుకునే అవకాశం, నచ్చిన రంగాన్ని ఎన్నుకుని రాణించే అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్ర గవర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎం.సురేంద్ర మాట్లాడుతూ కవయిత్రి మొల్లమాంబ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కుమ్మరి కులంలో పుట్టి సంస్కృతం చదువుకుని రామాయణాన్ని తెలుగులో రచించి కుమ్మరి కులానికే గౌరవం తీసుకువచ్చారన్నారు. అటువంటి మహనీయురాలి చరిత్రను భావితరాలకు తెలియజేయాలన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, కుమ్మరి, శాలివాహన సంఘ సభ్యులు అప్పలకొండ, సత్యనారాయణ మొల్లమాంబ జీవిత చరిత్ర గురించి తెలియజేశారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి కె.రాజేశ్వరి, బీసీ సంక్షేమశాఖ వసతిగృహ అధికారులు, సంఘ సభ్యులు కె.గుండప్ప, సిహెచ్. దుర్గాప్రసాద్, ఎస్.అప్పారావు, కె.శేషగిరిరావు, డి.అప్పలరాజు, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు.