టీడీపీ ఎంపీ సీఎం రమేష్ బంధువుల చీప్ ట్రిక్స్!
కడప, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, ఎంపీ సీఎం రమేష్ బంధువులు రూ. 4 కోట్ల విలువైన 35 వాహనాలను అసలు ఓనర్‌కు తెలియకుండా అక్రమంగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రమేష్ బంధువులు తమ సంస్థకు చెందిన వాహనాలను రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని ఆర్కే ఇన్ఫ్రా, ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ రవికల్యాణ్‌రెడ్డి ఆరోపించారు. ట్రాన్స్ఫర్ పత్రాల్లో సంతకాలు తమవి కాదన్నారు. రమేష్ ఒత్తిడివల్లే వాహనాలను ట్రాన్స్ఫర్ చేసినట్లు అధికారులు చెబుతున్నారని తెలిపారు.
రవికల్యాణ్‌రెడ్డి శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. 2008లో తాను కొన్న 35 వాహనాలను రిత్విక్ ప్రాజెక్ట్స్ వారు చింతకుంట జయప్రకాశ్‌నాయుడు పేరుతో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారని తెలిపారు. ఇందులో కొన్ని ఆర్సీలను కూడా అప్పుడే తీసుకున్నారని చెప్పారు. ట్రాన్స్ఫర్ అయిన వాహనాలన్నీ తమ వద్దే ఉన్నాయన్నారు. ఈ ట్రాన్స్ఫర్ విషయం తమకు ఈనెల 2న తెలిసిందని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. రమేష్ ఒత్తిడి వల్లే ఇలా చేశానని ఆర్టీవో చెబుతున్నారన్నారు. ఈ విషయమై ఆర్టీవో కూడా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారని తెలిపారు.
అధికారంలోకి వస్తే ఆస్తులు లాక్కుంటారేమో..!
సీఎం రమేష్ బంధువులు టీడీపీ అధికారంలోకి వస్తే అందరి ఆస్తులు లాక్కుంటారేమోనని రవికల్యాణ్‌రెడ్డి ఆందోళ వ్యక్తంచేశారు. వాహనాల అక్రమ ట్రాన్స్ఫర్ విషయాన్ని సరైన సమయంలో తెలుసుకోగలిగామని చెప్పారు. వెంటనే రవాణాశాఖకు, డీటీసీ, ఆర్టీవోలకు చెప్పి వాహనాలు ట్రాన్స్ఫర్ కాకుండా ఆపగలిగామని, లేదంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తాము, రమేష్ బంధువులు అలహాబాద్ ఎన్‌టీపీఎల్‌లో జాయింట్ వెంచర్ నిర్వహించే వారమని, వారి దగ్గరి నుంచి డబ్బు రావాల్సి ఉంటే ఆ వివాదం కోర్టులో నడుస్తోందని చెప్పారు. తమ యంత్రాలను స్వాధీనం చేసుకునేందుకే ఈ ప్రయత్నం చేశారని వివరించారు.