తన పంటకు ధర నిర్ణయించుకునే హక్కు రైతుకుంది!

తన పంటకు ధర నిర్ణయించుకునే హక్కు రైతుకుంది! - Sakshi


ఐటీ, తదితర వృత్తి నిపుణుల శిబిరంలో పాలేకర్  స్పష్టీకరణ

 

 ప్రకృతి ఆహారం వట్టి ఆహారం మాత్రమే కాదని.. అది ఔషధమని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్ పాలేకర్ అన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఇతర వృత్తి నిపుణులకు ఇటీవల హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చిన ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తన ఉత్పత్తులకు ధర నిర్ణయించుకునే హక్కు రైతుకు ఉన్నదన్నారు.

 

  పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించే ఆహారోత్పత్తులను రైతులు మార్కెట్ కన్నా అధిక ధరలకు అమ్మటం ఎంతవరకు సమంజసం?

 ప్రకృతి వ్యవసాయదారులు పండించి మీకు అందించేది మామూలు ఆహారం కాదు.. అది ఔషధం! తాను పండించిన పంటకు తానే ధరను నిర్ణయించుకునే హక్కు రైతులకు ఉంది. ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు. మార్కెట్‌లో ఏ వస్తువు ధరనైనా ఉత్పత్తిదారుడే నిర్ణయించి అమ్ముతాడు. వాళ్లు చెప్పిన ధరకు కొనడంలో లేని అభ్యంతరం రైతు దగ్గరకొచ్చేటప్పటికి ఎందుకో నాకు అర్థం కావటం లేదు. అసలు రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులను (మార్కెట్ హెచ్చుతగ్గులతో నిమిత్తం లేకుండా) ముందుగా నిర్ణయించిన ధరకే రైతులు నేరుగా వినియోగదారులకు విక్రయించుకోవడం మంచిది. ఇందుకోసం రైతుల బృందాలు, వినియోగదారుల బృందాలను ఏర్పాటు చేసుకోవాలి.



  గోబర్ గ్యాస్ స్లర్రీని ద్రవ జీవామృతం తయారీలో వాడొచ్చా?

 ద్రవ జీవామృతం తయారీలో భాగంగా పులియబెట్టే ప్రక్రియ కోసం, భూమిలో జీవనద్రవ్యం (హ్యూమస్)ను పెంపొందించడం కోసం మనకు ఏరోబిక్ బ్యాక్టీరియా అవసరం. ఈ బ్యాక్టీరియాకు ఆక్సిజన్ అవసరమవుతుంది. గోబర్ గ్యాస్ స్లర్రీలో ఏరోబిక్ బ్యాక్టీరియా ఉండదు. ఎనరోబిక్ బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ద్రవ జీవామృతం తయారీకి స్లర్రీ పనికిరాదు. కానీ, గోబర్ గ్యాస్ స్లర్రీని ఘన జీవామృతం నంబర్ 2 తయారీకి వాడుకోవచ్చు. దీనికి గాను.. స్లర్రీని ఆరుబయట ఎండబెట్టి, ఎండిన స్లర్రీని పొడిగా మార్చి వాడుకోవచ్చు. స్లర్రీ పొడి 50 కేజీలు, 40 కేజీల దేశీ ఆవు పేడతో పాటు, కిలో బెల్లం, కిలో పప్పుల (శనగపప్పు పొడి, మినప్పప్పుపొడి.. ఏదైనా పప్పుల) పొడిని వేసి కలిపి కుప్పగా చేయాలి. 48 గంటల తర్వాత ఆ మిశ్రమాన్ని ఆరుబయట ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత ఈ ఘన జీవామృతాన్ని నిల్వ చేసుకొని ఎకరంలో పంటలకు వాడుకోవచ్చు.



  పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరించి అధిక సాంద్రతలో పంటలను సాగు చేయవచ్చా?

 నిస్సందేహంగా చేయొచ్చు. అధిక సాంద్రతలో విజయవంతంగా సాగు చేస్తున్న అనేక పంటల నమూనాలు మన ముందున్నాయి.



   ముడి బియ్యం లేదా సింగిల్ పాలిష్ బియ్యం మిల్లు పట్టించిన తర్వాత నిల్వ చేసేటప్పుడు పురుగు పట్టకుండా బోరిక్ పౌడర్ కలపవచ్చా?

వద్దు.. వద్దు.. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఆహార ధాన్యాల్లో బోరిక్ పౌడర్ కలపడం మంచిది కాదు. ఆహార ధాన్యాలకు తగు మాత్రంగా ఆముదం కలిపి ఎండబెట్టాలి. ఆ తర్వాత వేపాకులు వేసి గన్నీ బాగ్స్‌లో వీటిని నిల్వచేయాలి.



  దానిమ్మలో మునగను అంతర పంటగా సాగు చేయొచ్చా?

 దానిమ్మ తోటలో మునగను నిస్సందేహంగా సాగు చేయొచ్చు. రెండు దానిమ్మ మొక్కల మధ్య మునగ మొక్క నాటుకోవాలి. మిరప, అల్లం, పసుపు, శనగతోపాటు కూరగాయ పంటలను సైతం దానిమ్మ తోటలో అంతర పంటలుగా సాగు చేయవచ్చు. ఈ పద్ధతిలో చక్కని దిగుబడులిస్తున్న దానిమ్మ తోటలు మహారాష్ట్రలో ఉన్నాయి. మీరు వచ్చి చూడండి.



  టై గార్డెన్‌లో తరచూ మట్టిని మార్చుతున్నాం.. ఇది సరైనదేనా?

 మేడపైన మడులు, కుండీల్లో మట్టిని మార్చనక్కర్లేదు. కొత్త పంటలు వేసినప్పుడు ఆ మట్టిలోనే కొద్ది మొత్తంలో ఘన జీవామృతాన్ని కలిపి అదే మట్టిని తిరిగి వాడుకోవచ్చు.         

- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top