రామోజీకి సుప్రీంలో చుక్కెదురు

రామోజీకి సుప్రీంలో చుక్కెదురు - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: ‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత సి.హెచ్.రామోజీరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విశాఖపట్నం సీతమ్మధారలో లీజు స్థలంలో కొనసాగుతున్న ‘ఈనాడు’ కార్యాలయం తాలూకు రూ.2.06 కోట్ల అద్దె బకాయిలను చెల్లించడంతో పాటు, నెలకు రూ.17 లక్షల చొప్పున అద్దె చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జనవరి 10 నాటికి అద్దె బకాయిలను జమ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తక్షణం అమలు చేయాల్సిందిగా ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ చంద్రమౌళి కేఆర్ ప్రసాద్, జస్టిస్ పినాకి చంద్రఘోష్‌లతో కూడిన బెంచ్ సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. భవనాన్ని ఖాళీ చేయడానికి రామోజీ రెండు నెలలు గడువు కోరినా అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించిందని స్థల యజమాని తరపు న్యాయవాది రవిప్రసాద్ తెలిపారు.

 

 ఇదీ నేపథ్యం

 

 విశాఖపట్నంలోని సీతమ్మధారలో మంతెన ఆదిత్యవర్మకు చెందిన 2.78 ఎకరాల స్థలాన్ని, అందులోని భవనాలను 33 ఏళ్ల కాలపరిమితికి రామోజీరావు 1974 మార్చి 30న లీజుకు తీసుకున్నారు. 2007 ఏప్రిల్‌తో గడువు ముగిసింది. లీజు పొడిగింపుకు ఆదిత్య వర్మ తిరస్కరించారు. దాంతో రామోజీరావు కోర్టును ఆశ్రయించారు. రూ.10 వేల అద్దె చెల్లిస్తామని, మరో 33 ఏళ్లపాటు లీజు పొడిగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. మరోవైపు లీజు సమయంలో రూ.2,500 అద్దె, కొన్నేళ్ల తరువాత రూ.3,000 చెల్లించాలన్న ఒప్పందం ప్రకారం అద్దె సక్రమంగా చెల్లించకపోవడంతో వర్మ విశాఖలోని అద్దె నియంత్రణ చట్టం ప్రత్యేక కోర్టు (ఆర్‌సీసీ)ను ఆశ్రయించారు.

 

 నెల రోజుల్లో భవనాన్ని ఖాళీ చేసి యజమానికి అప్పగించాలని రామోజీరావును ఆదేశిస్తూ 2012లో ఆ కోర్టు తీర్పు ఇచ్చింది. దానిపై రామోజీరావు అపీలుకు వెళ్లగా విశాఖ కోర్టు స్టే ఇచ్చింది. స్టేను తొలగించాలని కోరుతూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. దిగువ కోర్టు ఇచ్చిన స్టే కొనసాగాలంటే ప్రస్తుత స్థలం విలువపై ఐదు శాతం అద్దెను ప్రతి నెలా చెల్లించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాని ప్రకారం స్థల విలువను రూ.40.365 కోట్లుగా, భవనాల విలువను రూ.90 లక్షలుగా లెక్కించింది. ఆ లెక్కన నెలకు రూ.17 లక్షల చొప్పున అద్దెను ప్రతి నెలా 10వ తేదీ లోపు చెల్లించాలని, రూ.2.06 కోట్ల అద్దె బకాయిలను 2014 జనవరి 10వ తేదీ లోపు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

 

 అప్పుడే రామోజీ ఆ స్థలంలో కొనసాగవచ్చని పేర్కొంటూ న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి 2013 అక్టోబర్‌లో తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రామోజీ జనవరి 3న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. తాను అంత అద్దె చెల్లించలేనని, తనను ఆ స్థలంలో కొనసాగనివ్వాలని, హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు. స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరిస్తూ స్థల యజమానికి నోటీసులు జారీ చేసింది. యజమాని వివరణ ఇస్తూ, హైకోర్టు ఆదేశాల అమలు కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. కేసు సోమవారం విచారణకు వచ్చింది. రామోజీ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం, హైకోర్టు ఆదేశాల అమలుకు ఆదేశించింది. తాజా తీర్పు ప్రకారం రామోజీ ప్రస్తుత భవనంలో కొనసాగాలంటే నెలకు 17 లక్షలు అద్దెతో పాటు రూ.2,06,32,500 బకాయిలను ఫిబ్రవరి 10 లోపు చెల్లించాల్సి ఉంటుంది.

 

 అద్దె ఇలా లెక్కించారు...

 

 విశాఖలోని సీతమ్మధార ప్రాంతంలో ప్రస్తుతం ప్రభుత్వ గణాంకాల ప్రకారం గజం స్థలం విలువ రూ.30 వేలుంది. ఈనాడు కార్యాలయం 2.78 ఎకరాల్లోవుంది. ఆ స్థలం విలువను రూ.40.365 కోట్లుగా, భవనాల విలువను మరో రూ.90 లక్షలుగా, మొత్తం కలిపి రూ.41.265 కోట్లుగా లెక్కించారు. ముంబై వంటి నగరాల్లో వాణిజ్య ప్రాంతాలు అవసరాలను బట్టి ఆస్తి విలువలో 6 శాతాన్ని అద్దెగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సస్ సూపర్ మ్యాక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో సుప్రీం ఇచ్చిన గత తీర్పును ధర్మాసనం ఉటంకించింది. శరవేగంతో అభివృద్ధి చెందుతున్న విశాఖలో భూమి, భవనాల విలువపై 5 శాతం అద్దె చెల్లించాలని పేర్కొంది.

 

 అంతా మోసమే (రాజ)గురూ!

 

 విశాఖ లీగల్, న్యూస్‌లైన్: ప్రతి నిత్యం ఉషోదయంతో పాటే తన పత్రికలో వల్లె వేసే నీతివాక్యాలన్నీ కేవలం ఎదుటివారికి చెప్పేందుకే తప్ప తనకు మాత్రం అవేవీ వర్తించవన్నది రామోజీ ఫిలాసఫీ. విశాఖపట్నంలోని ‘ఈనాడు’ కార్యాలయ స్థలం లీజు వివాదమే ఇందుకు తిరుగులేని ఉదాహరణ. చట్టాలంటే రామోజీకి ఎంత బేఖాతరో, నిబంధనలంటే ఎంత అలుసో... వాటన్నింటినీ ఆయన ఎంత అడ్డంగా తుంగలో తొక్కుతారో ఈ ఉదంతాన్ని చూస్తే తెలుస్తుంది. 1974లో ఆదిత్యవర్మ నుంచి 33 ఏళ్ల లీజుకు తీసుకున్నారు రామోజీ! 1984 లో సీతమ్మధారలో రోడ్డు విస్తరణలో భాగంగా లీజు స్థలంలో కొంత రోడ్డులో కలిసింది. అందుకు పరిహారంగా ప్రభుత్వం ఇచ్చిన సుమారు 800 చదరపు గజాల స్థలాన్ని కూడా రామోజీ దర్జాగా సొంతం చేసుకున్నారు.

 

 అందుకోసం లీజు స్థలాన్ని తన సొంత స్థలంగా పేర్కొంటూ ప్రభుత్వ సంస్థలకు, నగర పాలక సంస్థకు లేఖలిచ్చారు! ఇందుకు అప్పటి కలెక్టర్లు ఎస్.వి.ప్రసాద్, ఎ.వి.రావు కూడా సాయపడ్డారన్న ఆరోపణలున్నాయి. దీనిపై వర్మ క్రిమినల్ కేసు కూడా పెట్టారు. రామోజీ తనే స్థల యజమానినంటూ నగరపాలక సంస్థ, నగరాభివృద్ది సంస్థలకు వ్యక్తిగతంగా దరఖాస్తులు చేసిన ఉదంతంలో ఆ రెండు సంస్థలపై కూడా వర్మ ఫిర్యాదు చేశారు. మాస్టర్‌ప్లాన్‌ను తప్పుగా చూపించిన వుడా అధికారులపై కూడా కేసు పెండింగ్‌లో ఉంది. స్థల యజమాని అనుమతి లేకుండ లీజుదారు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టొద్దు. కానీ లీజు స్థలాన్నే ‘సొంతం’ చేసుకున్న రామోజీ నిబంధనలను తుంగలో తొక్కి ‘ఈనాడు’ కార్యాలయం లో పలు నిర్మాణాలు చేపట్టారు. యజమాని అనుమతి లేకుండ నిర్మించినందున వాటిని కూల్చేయాలంటూ మహానగరపాలక సంస్థ ఇటీవలే నోటీసులు కూడ జారీ చేసింది. రామోజీ అవకతవకలు ఇంతటితో ఆగలేదని, ఈ కేసుకు సంబంధించి కోర్టులకు కూడా పలు తప్పుడు పత్రాలను దాఖలు చేశారని స్థల యజమాని వర్మ తెలిపారు.

 

 స్థలం ఖాళీ చేయనున్న రామోజీ!

 

 సర్వోన్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో విశాఖ సీతమ్మధారలోని ‘ఈనాడు’ కార్యాలయాన్ని తక్షణమే ఖాళీ చేయాలంటూ రామోజీనీ ఆదేశించినట్టు తెలిసింది. ఇందుకోసం సోమవారం రాత్రి భారీ క్రేన్లను, 200 మందికి పైగా పనివాళ్లను కూడా నియమించారు. ‘ఈనాడు’ సిబ్బంది మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. ఈ వివాదానికి సంబంధించి ఆర్‌సీసీ కోర్టులో మంగళవారం వాయిదా ఉంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భవనాన్ని ఖాళీ చేయకపోతే పాత బకాయిల కింద రూ.2.60 కోట్లు, రెండు నెలల అద్దె రూపంలో రూ.34 లక్షలను ఫిబ్రవరి 10 లోపు రామోజీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఆలోపే భవనాన్ని ఖాళీ చేసి బయట పడాలని ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని, సిబ్బందికి ఆ మేరకు ఆదేశాలిచ్చారని తెలిసింది.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top