‘సమాజం’పై నిశిత దృష్టి

‘సమాజం’పై నిశిత దృష్టి


* వర్తమాన అంశాలకు ప్రాధాన్యమివ్వాలి

* ఉద్యమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు..

* సామాజిక శాస్త్రంలో ఇవన్నీ కీలకమే

* టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ చింతా గణేశ్

* గ్రూప్స్‌పై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ  


 

సాక్షి, హైదరాబాద్: ‘‘భారతీయ సమాజం, చారిత్రక నేపథ్యం, సామాజిక అసమానతలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఫలాలు, వాటిని పొందుతున్న వర్గాలు, అందుకు నోచుకోని సమాజం... సోషియాలజీలో ఇవన్నీ ప్రధానాంశాలే. సామాజిక మార్పులు, సమస్యలు, ప్రభుత్వ చర్యలన్నింటిపైనా అవగాహన ఉండాల్సిందే. భారతీయ సమాజ నిర్మాణం, కుటుంబ వ్యవస్థ, మతం, కుల వ్యవస్థల నిర్మాణాలతో పాటు వెట్టిచాకిరీ, బాల కార్మిక వ్యవస్థ వంటి సామాజిక సమస్యలు, చిన్న రాష్ట్రాల డిమాండ్లు తదితరాలూ పోటీ పరీక్షల్లో కీలకమే. గ్రూప్-1, 2, 3తో పాటు ఇతర పోటీ పరీక్షల జనరల్ స్టడీస్‌లోనూ వీటిపై ప్రశ్నలుంటాయి. గ్రూపు-1 అభ్యర్థులు లోతైన అధ్యయనం చేయాలి. విశ్లేషించాలి. వివరించాలి. సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలి. ఇతర పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే వారు మాత్రం సమాచారం తెలుసుకుంటే చాలు. మొత్తంమీద ఏ పోటీ పరీక్షకైనా సోషియాలజీపై అవగాహన తప్పనిసరి’’ అని టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం సోషియాలజీ ప్రొఫెసర్ చింతా గణేశ్ పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు చదవాల్సిన కోణం తదితరాలపై

 ‘సాక్షి’కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు...

 

 సోషియాలజీపై గ్రూప్స్ అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రధానంగా భారతీయ సమాజానికి సంబంధించిన ఈ సబ్జెక్టులో ముఖ్యంగా ఐదు అంశాలున్నాయి.

 1. భారతీయ సమాజం

 2. సోషల్ ఎక్స్‌క్లూజన్, వల్నరబుల్ గ్రూప్స్

 3. దేశంలో సామాజిక సమస్యలు

 4. తెలంగాణలో సామాజిక సమస్యలు

 5. భారత్, తెలంగాణల్లో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు

 

 1. భారతీయ సమాజం

 భారతీయ సమాజ లక్షణాలు, నిర్మితి సమస్యలుంటాయి. ప్రధానంగా సమాజ లక్షణాలు, సంస్కృతులు, జాతులు, మతాలు, జాతుల వర్గీకరణ ఉంటాయి.

 లక్షణాలు: మన దేశం ఒకే విధమైన లక్షణాలున్న సమాజం కాదు. ఏ మతం లక్షణాలు దానివే. హిందూ, బౌద్ధ, ముస్లిం మతాల లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి గనుక వాటి ప్రధాన లక్షణాలేమిటో తెలుసుకోవాలి.

 నిర్మితిలో ముఖ్య భాగాలు: కుల వ్యవస్థ, దాని లక్షణాలేమిటి? కుల వ్యవస్థలో మార్పులు, వాటికి దోహదం చేసే కారణాలేమిటన్నది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. కుల వ్యవస్థలోని సాంప్రదాయక లక్షణాల్లో మార్పులు ఎందుకొస్తున్నాయో చదువుకోవాలి.

 

 సమాజంలో కుటుంబ, వివాహ వ్యవస్థలు: కుటుంబం అంటే ఏమిటి, భారతీయ సమాజంలో వీటినెలా నిర్వచించారు, వాటి లక్షణాలు, వర్గీకరణలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కుటుంబ వ్యవస్థలో రెండు రకాల వర్గీకరణ ఉంది. ఎ. ఉమ్మడి కుటుంబం, బి. ప్రాథమిక కుటుంబ వ్యవస్థ. వాటి లక్షణాలను అర్థం చేసుకోవాలి. కుటుంబ, వివాహ వ్యవస్థల్లో ఏయే మార్పులొస్తున్నాయో చూసుకోవాలి. భారతీయ వ్యవస్థలో గ్రామీణ, నగర, గిరిజన.. ఈ 3 రకాల సమాజాలు, వాటి ప్రధాన లక్షణాలు తెలుసుకోవాలి.

 

 2. సోషల్ ఎక్స్‌క్లూజన్, వల్నరబుల్ గ్రూప్స్

 భారత సమాజంలో కొన్ని వర్గాలను సమాజానికి దూరంగా ఉంచారు. చారిత్రకంగా కొన్నింటిని జనజీవన స్రవంతిలోకి రాకుండా అడ్డుకున్నారు. వాటికి అభివృద్ధి ఫలాలందలేదు. ఉదాహరణకు నిమ్న కులాలు. సోషల్ ఎక్స్‌క్ల్లూజన్ (సామాజిక వైషమ్యత) అంటే ఇదే. మనుషులుగా సమాజంలో బతుకుతున్నా ఇతర ఉన్నత వర్గాలకున్న ప్రయోజనాలు వారికందలేదు. ఈ సామాజిక అసమానతలకు, సోషల్ ఎక్స్‌క్లూజన్‌కు మధ్య తేడాలు తెలుసుకోవాలి. బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలు సామాజిక అసమానతలకు గురయ్యారు. వారి ప్రధాన సమస్యలు, వాటినెలా అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందన్న అంశాలపై అవగాహన ఉండాలి. వృద్ధులు, వికలాంగులు సహా ఆయా వర్గాల సమస్యలు ప్రధానంగా ఏమిటన్నది అర్థం చేసుకోవాలి.

 

 3. సామాజిక సమస్యలు

 పేదరికం, నిరుద్యోగం, బాలకార్మిక వ్యవస్థ, ప్రాంతీయ తత్వం, కుల తత్వం, మత తత్వం, సంఘర్షణలు, అవినీతి తదితర సామాజిక సమస్యలపై అవగాహన పెంచుకోవాలి.

 వీటిని ఎలా చదవాలంటే: ప్రతి సమస్యకూ కారణాలను తెలుసుకోవాలి. పేదరికాన్నే తీసుకుంటే.. పేదరికమంటే ఏమిటి?  కారణాలేమిటి? పర్యవసానాలేమిటి? ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతోంది? దానికి సంబంధించిన ఏమైనా సూచనలు ఉన్నాయా? ఈ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఏ సమస్యకైనా నోట్స్ తయారు చేసుకోవాలి. ఉదాహరణకు హింస అంటే ఏంటి? ఎవరిపై జరుగుతోంది. ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతోంది. చట్టాలు చేసిందా? పరిష్కారానికి సూచనలేమిటి? ఈ అంశాలపై దృష్టి పెట్టాలి. సమస్యల్లో  కొన్ని ప్రత్యేక వర్గాలకు సంబంధించినవి, కొన్ని సామాన్యమైనవి ఉంటాయి. జనాభా, నగరీకరణ, పునరావాసం వంటివి సామాన్యమైన సమస్యలు. ఉదాహరణకు నగరీకరణ దాని లాభనష్టాలు, ఉత్పన్నమయ్యే సమస్యలు, పరిష్కార మార్గాలేమిటి లాంటివి చదువుకోవాలి.

 

 4. తెలంగాణలో సామాజిక సమస్యలు

 ఇందులో ప్రధానంగా వెట్టిచాకిరీ, దేవదాసి, జోగినీ వ్యవస్థల వంటివి వస్తాయి. వెట్టిచాకిరీ స్వాతంత్య్రానికి ముందు బాగా ఉన్న సమస్య. తెలంగాణ సాయుధ పోరాటానికి (1946-51) ఇదీ కారణమే. కాబట్టి సమస్యల చారిత్రక నేపథ్యం తెలుసుకోవాలి.

 

 జోగినీ: ఈ వ్యవస్థ దేవాలయాలకు అనుబంధంగా ఏర్పడ్డా, క్రమక్రమంగా ఈ ముసుగులో మహిళలను ఎక్స్‌ప్లాయిట్ చేయడం మొదలైంది. ప్రస్తుతం జోగినీ, దేవదాసి వ్యవస్థలు తగ్గినా, వాటి చారిత్రక నేపథ్యం, ఎందుకొచ్చాయి, ఎలా కొనసాగాయన్నవి తెలుసుకోవాలి.

 

 బాల కార్మిక వ్యవస్థ: ఈ దేశవ్యాప్త సమస్య ప్రత్యేకించి తెలంగాణలో ఎక్కువగా ఎందుకుందో తెలుసుకోవాలి. చారిత్రకంగా తెలంగాణలో భూమి ప్రధాన జీవనాధారం. కాని భూమి ప్రాబల్య కులాల చేతుల్లోనే (భూస్వాముల) చేతుల్లోనే ఉంది. నిమ్న కులాలకు భూమి లేదు. బీసీ, దళిత కులాలు వారు భూమి లేని వ్యవసాయ కార్మికులుగా మారిపోయారు. ఆ కుటుంబాలనుంచి వచ్చిన పిల్లలు బాల కార్మికులుగా మారిపోయారు. ఆ వ్యవస్థ  పరిష్కారానికి ఏమైనా మార్గాలున్నాయా? ప్రభుత్వాలేం చేస్తున్నాయి, ఏమైనా చట్టాలు ఉన్నాయా? వాటి అమలు పరిస్థితి ఏంటన్నది తెలిసి ఉండాలి.

 ఫ్లోరోసిస్ సమస్య: నల్లగొండ జిల్లాలో ఇది ప్రధాన సమస్య. ఆర్థి క సమస్యగా మారింది. కాబట్టి ఫ్లోరోసిస్ అంటే ఏంటి? దా నివల్ల సమస్యలు, పరిష్కార మార్గాలేమిటన్నది తెలుసుకోవాలి.

 

 వలసలు: తెలంగాణలో వలసలకు కారణాలు, వాటి ప్రత్యేకతలు తెలుసుకోవాలి. మహబూబ్‌నగర్ నుంచి భవన నిర్మాణ రంగ కార్మికులు, కరీంనగర్ నుంచి చేనేత కార్మికులు వలస వెళతారు. తెలంగాణ జిల్లాల్లో వలసలకు వృత్తి పరమైన ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని విశ్లేషించగలగాలి.

 

 ఆత్మహత్యలు: తెలంగాణలో రైతులు, చేనేత కార్మికుల సమస్య లు ప్రధానం. వాటివల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వారి సామాజిక, ఆర్థిక వెనుకబాటుకు కారణాలు, ప్రభుత్వం ఏం చేస్తోంది, వాటి పర్యవసానాలు ఏమిటన్నది తెలుసుకోవాలి.

 

 సామాజిక ఉద్యమాలు: ఇది మరో ప్రధానాంశం. తెలంగాణ సామాజిక ఉద్యమాల్లో రైతు ఉద్యమాలు, గిరిజన, వెనుకబడిన వర్గాల,  దళిత, పర్యావరణ, మహిళా, ప్రాంతీయ ఉద్యమాలున్నాయి. ముఖ్యంగా చిన్న రాష్ట్రాల డిమాండ్ వచ్చిన ప్రాంతీయ ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలున్నాయి. అవి ఏ కారణాల వల్ల ఏర్పడుతున్నాయన్నది తెలుసుకోవాలి. దళిత ఉద్యమాన్ని సంస్కరణ, ప్రత్యామ్నాయ ఉద్యమమని 2 రకాలుగా చెప్పారు. ఇలా అనేక ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాలపై అవగాహన ఉండాలి. వాటిలోని అంశాలు తెలుసుకోవాలి. ప్రాంతీయ ఉద్యమాల్లో చిన్న రాష్ట్రాలు ప్రధానాంశం.తమిళనాడులో ఆత్మగౌరవోద్యమం, సత్యశోధకోద్యమం వంటివి తెలుసుకోవాలి. ఆ ఉద్యమాలు లేవనెత్తిన అంశాలు, వాటికి కారణాలు, సాధించిన విజయాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు జార్ఖండ్ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం. వీటివల్ల కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

 

 5. ప్రభుత్వ విధానాలు, సంక్షేమ ప్రథకాలు

 ఇందులో ఎ. ప్రభుత్వ విధానాలు, బి. ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలు. సి. సంక్షేమ పథకాలు. వీటిపై చాలా ఫోకస్ పెట్టాలి.

 

 ఎ. ప్రభుత్వ విధానాలు: రెండు రకాలు. అవి 1.బలహీనవర్గాలకు సంబంధించినవి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బాలలు, మహిళలకు సంబంధించిన  జాతీయ విధానాలున్నాయి.  వాటి లక్ష్యాలను తెలుసుకోవాలి. మొత్తం పాలసీ చదవాల్సిన అవసరం లేదు. ఆ విధానంలో లక్ష్యాలు, వ్యూహం, ఏయే అంశాలపై దానిని ప్రతిపాదించారో తెలుసుకోవాలి. 2. భారతీయ సమాజానికి ఉపయోగపడేవి. ఉదాహరణకు విద్యా విధానం, జనాభా విధానం, పర్యావరణ విధానం.

 

 బి. చట్టాలు: బలహీన వర్గాలకు సంబంధించి ఏమైనా చట్టాలు ఉన్నాయా? వాటి ప్రయోజనాలేమిటి? ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, 1950ల్లో వచ్చిన అంటరానితనం నిరోధక చట్టం, మానవ హక్కుల పరిరక్షణ చట్టం వంటివాటిపై అవగాహన తెచ్చుకోవాలి. మహిళలు, బాల కార్మిక చట్టాలపై సమగ్ర అవగాహన అవసరం.

 

 సి. సంక్షేమ పథకాలు:  ఇందులో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమైంది. ఉదాహరణకు కేంద్రం తెచ్చిన భారత్ నిర్మాణ్, జేఎన్ ఎన్‌యూఆర్‌ఎం, ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఎస్‌జీఎస్‌వై, ఐసీడీఎస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ పథకం, భారత్ నిర్మాణ్, ప్రధాన మంత్రి జన్‌పథ్ యోజన, మేకిన్ ఇండియా, భేటీ బచావో వంటి వాటిపై అవగాహ న ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విధానాలు, పథకాలు తెచ్చాయి. తెలంగాణలో టీఎస్ ఐపాస్, భూపంపిణీ, డబుల్ బెడ్‌రూం వంటి పథకాలొచ్చాయి. వాటిపై అవగాహన పెంచుకోవాలి.

 

 ఇలా చదవాలి...

 గ్రూపు-1లో ఎక్కువ అంశాలు, గ్రూపు-2 కొన్ని అంశాలు పొందుపరిచారు. గ్రూపు-1లో లోతైన అధ్యయనం అవసరం. వివరణాత్మక, విశ్లేషణాత్మకంగా ఉండాలి. ఉదాహరణకు ఒక అంశాన్ని తీసుకుంటే ఆ సమస్య ఎందుకు వచ్చింది. కారణాలు ఏంటి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. సమస్య పరిష్కారానికి సూచనలేమిటన్నది విశ్లేషించాలి.

 గ్రూపు-2లో సమాచారం మాత్రమే అవసరం. విశ్లేషణ అక్కర్లేదు. అవసరమైన సమాచారంపైనే ఫోకస్ చేయాలి.

 గ్రూపు-2లో పేదరికం తీసుకుంటే పేదరికమని దేనినంటారు. ప్రధాన కారణాలేమిటి. పర్యవసానాలేమిటి? నిర్మూలనకు పథకాలేమిటి? గ్రూపు ఏ-1 విషయానికొస్తే... పేదరికం ఎందుకుంది. సమగ్ర కారణాలు ఏంటి? నిర్మూలన కోసం ఏయే పథకాలు తెచ్చారు. అవి పని చేస్తున్నాయా లేదా? వాటి వల్ల వచ్చిన మార్పులు ఏంటి? ఒకవేళ ఎఫెక్టివ్‌గా లేకపోతే కారణాలేమిటి. దేశంలో నిర్మూలన లకు ఇంకా ఏం చర్యలు చేట్టాలన్నది విశ్లేషించాలి.

 గ్రూపు-3లోనూ గ్రూపు-2 తరహాలో చదువాలి.  విషయం ఒకటే అయినా గ్రూపు-1, గ్రూపు-2లో చదివే విధానం ముఖ్యం.

 

 ఏ పుస్తకాలు చదవాలంటే

 తెలుగు అకాడమీ ముద్రించిన సమాజ శాస్త్రం, భారతీయ సమాజం, ఇండియా ఇయర్ బుక్, ఎకనామిక్ సర్వే రిపోర్టు చదవాలి. రెగ్యులర్‌గా న్యూస్‌పేపర్లు చదవాలి. వివిధ అంశాలపై గతంలో వచ్చిన ఆర్టికల్స్ చదవాలి. ఇంగ్లిష్‌లో ఇండియన్ సోషల్ సిస్టం, సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాలు చదవాలి. గ్రూప్స్ మాత్రమే కాకుండా ఇతర పోటీ పరీక్షల జనరల్‌స్టడీస్‌లోనూ వీటి గురించి అడుగుతారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top