లక్ష్యం రూ. లక్ష కోట్లు! | Irrigation Project A huge budget target as Rs. Lakh crore | Sakshi
Sakshi News home page

లక్ష్యం రూ. లక్ష కోట్లు!

Aug 31 2015 1:33 AM | Updated on Sep 3 2017 8:25 AM

లక్ష్యం రూ. లక్ష కోట్లు!

లక్ష్యం రూ. లక్ష కోట్లు!

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, కొత్తగా చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు ఒక్కో ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆర్థిక లక్ష్యాలు ఎలా ఉండనున్నాయో వెల్లడైంది.

సాగునీటి ప్రాజెక్టుల బడ్జెట్ అవసరాలు రూ.1,03,051 కోట్లు
ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం
2018-19కి రూ. 55,931 కోట్లు అవసరం
తర్వాతి మూడేళ్లలో రూ.47,120 కోట్లు కావాలి
2021-2022కి పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత-చేవెళ్ల పూర్తి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, కొత్తగా చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు ఒక్కో ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆర్థిక లక్ష్యాలు ఎలా ఉండనున్నాయో వెల్లడైంది.

ప్రాధాన్యతా క్రమంలో ఏయే ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేసేది, వాటికి అవసరమైన నిధులు ఏ రీతిన ఖర్చు చేయనున్నది ప్రభుత్వం ఇటీవల ప్రపంచ బ్యాంకు ముందు పెట్టిన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల పూర్తికి రూ. 1.03 లక్షల కోట్లు అవసరమని నివేదికలో తెలిపిన ప్రభుత్వం... తమ ప్రభుత్వ ఐదేళ్ల గడువు ముగిసేనాటికి (అంటే 2018-19 ఆర్థికసంవత్సరం నాటికి) సుమారు రూ. 55,931 కోట్లు అవసరమని, మిగతా రూ. 47,120 కోట్లు తర్వాతి మూడేళ్లకు వెచ్చించాల్సి ఉంటుందని వివరించింది. ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు రుణాలు మంజూరు చేయాలని ప్రపంచ బ్యాంకుకు అర్జీ పెట్టుకుంది.
 
ప్రభుత్వ గడువు ముగిసే నాటికి ‘పాలమూరు’ పూర్తి మూడో వంతే...
రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో 12 భారీ, 13 మధ్యతరహా ప్రాజెక్టులతోపాటు కొత్తగా చేపడుతున్న పాలమరు-రంగారెడ్డి, నక్కలగండి, మార్పులతో చేపట్టనున్న ప్రాణహిత-చేవెళ్ల, నాగార్జునసాగర్, నిజాంసాగర్ ఆధునీకరణ, మిషన్ కాకతీయ, ఇతర పథకాలకు కలిపి మొత్తంగా రూ.1,03,051 కోట్ల అవసరాలు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో నిర్మాణంలో ఉన్న 25 ప్రాజెక్టులకు రూ. 9,849 కోట్ల అవసరం ఉంటుందని అంచనా వేయగా.. కొత్త ప్రాజెక్టులకే రూ. 93,202 కోట్లు అవసరమని లెక్కకట్టింది.

ఇందులో ప్రధానంగా పాల మూరు ఎత్తిపోతలకు రూ. 35,200 కోట్లు, ప్రాణహిత-చేవెళ్లకు రూ. 35,000 కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 10,430 కోట్లు అవసరమని అంచనా వేసింది. ఇందులో పాలమూరు, ప్రాణహిత-చేవెళ్ల పథకాలను 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ప్రపంచ బ్యాంకుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం వివరించింది.

ఇందులో ప్రస్తుత ప్రభుత్వ ఐదేళ్ల గడువు ముగిసే 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి పాలమూరుకు రూ.13,400 కోట్లు, తర్వాతి మూడేళ్లలో 2021-22 నాటికి మరో రూ. 21,800 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అంటే ఆ సమయానికి పాలమూరులో మూడోవంతు పనులే పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రాణహిత-చేవెళ్లలో సైతం ఆ గడువు ముగిసేనాటికి రూ. 17 వేల కోట్లు, ఆ తర్వాత మిగతా రూ. 18 వేల కోట్ల పనులు జరిగే అవకాశం ఉంది. నక్కలగండిని మాత్రం 85% పనులు పూర్తి చేసేలా నిధుల కేటాయింపులను నివేదికలో ప్రభుత్వం చూపింది.సాగుకు మున్ముందు భారీ బడ్జెట్!
సాగునీటిపారుదల రంగానికి మున్ముందు భారీ బడ్జెట్లు ఉండనున్నట్లు ప్రభుత్వ నివేదికను బట్టి తెలుస్తోంది. ఇప్పటివరకు పెట్టిన 2 బడ్జెట్లలో ఒకసారి రూ. 6,500 కోట్లు, రెండోసారి రూ. 8,675 కోట్లు కేటాయించగా 2016-17 నుంచి 17-18, 18-19 బడ్జెట్‌లకు వరుసగా రూ. 13,931 కోట్లు, రూ. 17,674 కోట్లు, రూ. 15,651 కోట్లు ఉండనున్నట్లు తెలిపింది. ఇక మిషన్ కాకతీయకు 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తంగా రూ.8 వేల కోట్ల మేర ఖర్చు చేయనుం డగా బడ్జెట్‌లో ఏటా రూ. రెండువేల కోట్ల వరకు కేటాయింపులు ఉండనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement