అగమ్యగోచరంగా విద్యావలంటీర్ల పరిస్థితి

Vidya Volunteers Regularisation Problems In Medak - Sakshi

పాఠశాలలకు రెగ్యులర్‌ ఉపాధ్యాయులు

ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభం 

ప్రైవేటు స్కూళ్లలో చేరేందుకూ కష్టమే..

ఆందోళన వ్యక్తం చేస్తున్న వీవీలు

పాఠశాలలు  144 

విద్యార్థులు 30 వేలకు పైగా

వీవీలు 780

కొత్తగా చేరే టీచర్లు 89

ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తు న్న విద్యావలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నూతనంగా విధుల్లో చేరుతున్న ఉపాధ్యాయుల రాకతో వీవీలకు సంకటంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న వీవీల పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా తయారైంది. ప్రభుత్వం నిర్వహించిన టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్టీ) అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లోకి  రెగ్యులర్‌ ఉపాధ్యాయులు వస్తున్నారు.  దీంతో ఇప్పటివరకు పని చేసిన వీవీలు వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల గడిచిపోవడంతో ప్రైవేటు పాఠశాలల్లో చేరే పరిస్థితి కూడా లేదు. దీంతో అయోమయంలో వీవీలు పడ్డారు

సాక్షి, మెదక్‌:  మెదక్‌ జిల్లాలో 144 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారుగా 30వేల మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యా బోధనకై గతేడాది 780మంది వీవీలను తీసుకున్నారు. మెదక్‌ జిల్లాలో 89మంది ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. 89మంది విధుల్లో చేరారు. అయితే వీరి స్థానంలో పని చేస్తున్న వీవీలను ఇంటికి పంపనున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అనుగుణంగా విద్యా వలంటీర్లను నియమించారు. మరో వైపు టీఆర్‌టీ అభ్యర్థులకు వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్తులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం వెంటనే టీఆర్‌టీ నియామకాలను చేపట్టింది. ఆ స్థానంలో ఉన్న విద్యా వలంటీర్లను వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఎన్నో ఆశలతో విధుల్లో చేరిన విద్యా వలంటర్లను తొలగించడం అనివార్యం కావడంతో వీవీలు అయోమయంలో పడ్డారు.

ప్రైవేటులోనూ కష్టమే..
టీఆర్‌టీ అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇవ్వటంలో ఆలస్యం అవుతుందని గతేడాది విధులు నిర్వహించిన వీవీలను విధుల్లోకి తీసుకోవాలని పాఠశాలల పునఃప్రారంభానికి ముందే వారు ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఈ ఎడాది పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యా వలంటీర్లను విధుల్లోకి చేర్చుకున్నారు. పాఠశాలల ప్రారంభంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యా వలంటీర్లంతా చురుగ్గా పాల్గొని గ్రామాల్లోని విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించారు. అంతా బాగానే ఉందని సంతోషంతో వీవీలు విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్‌ ఉపాధ్యాయులను భర్తీ చేయడంతో వీరి తొలగింపు అనివార్యమైంది. దీంతో వీవీలు ఆందోళన చెందుతున్నారు. విధుల్లో చేరి నెల కాకముందే తప్పుకోవాల్సి వస్తుండడంతో వారంతా ఆందోళనలో పడ్డారు. ఇటు ప్రైవేటు పాఠశాలల్లోను చేరే అవకాశం లేక పోవడంతో ఏం చేసేది అని చింతిస్తున్నారు. ఈ విషయమై డీఈఓ రవికాంత్‌రావ్‌ను వివరణ కొరగా వీవీలను తొలగిస్తామని సమాధానమిచ్చారు.

యథావిధిగా కొనసాగించాలి
మధ్యలో మమ్మల్ని తొలగిస్తే మేం ఏం కావాలి. వీవీ నమ్ముకొని ప్రైవేటు ఉద్యోగాలు వదులుకున్నాం. రెగ్యూలర్‌ ఉపాధ్యాయులు రాగానే మమ్మల్ని తొలగించడం సరైన పద్ధతి కాదు. ఈ ఏడాది కచ్చితంగా అవకాశం ఇవ్వాలి. వేరే ప్రాంతాల్లో సర్దుబాటు చేసి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఉపాధిని కోల్పోతాం. కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా మారుతది.                      – నర్సింలు, వీవీల సంఘం మండల అధ్యక్షుడు, టేక్మాల్‌  

యథావిధిగా కొనసాగించాలి
మధ్యలో మమ్మల్ని తొలగిస్తే మేం ఏం కావాలి. వీవీ నమ్ముకొని ప్రైవేటు ఉద్యోగాలు వదులుకున్నాం. రెగ్యూలర్‌ ఉపాధ్యాయులు రాగానే మమ్మల్ని తొలగించడం సరైన పద్ధతి కాదు. ఈ ఏడాది కచ్చితంగా అవకాశం ఇవ్వాలి. వేరే ప్రాంతాల్లో సర్దుబాటు చేసి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఉపాధిని కోల్పోతాం. కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా మారుతది.                  – నర్సింలు, వీవీల సంఘం మండల అధ్యక్షుడు, టేక్మాల్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top