గృహ నిర్బంధంపై మరింత ఫోకస్‌ | Telangana Government Still Focusing On House Quarantine In Telangana | Sakshi
Sakshi News home page

గృహ నిర్బంధంపై మరింత ఫోకస్‌

Mar 30 2020 2:54 AM | Updated on Mar 30 2020 3:17 AM

Telangana Government Still Focusing On House Quarantine In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కేసుల సంఖ్య పెరగడం, ఒక పాజిటివ్‌ వ్యక్తి మృతి చెందడం, ఇప్పటికే కరోనా వైరస్‌ రెండో దశ నుంచి మూడో దశలోకి ప్రవేశించే పరిస్థితులు నెలకొనడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. విదేశీ ప్రయాణాలు చేసి వచ్చినవారు, వారితో కాంటాక్ట్‌ అయినవారు గృహనిర్బంధంలో (హోం క్వారం టైన్‌) ఉన్నారు. వారికి మరిన్ని జాగ్రత్తలు చెబుతూ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. హోం క్వారంటైన్‌లో పాటించాల్సిన అంశాలపై ప్రత్యేక బులెటిన్‌ను ఆదివారం విడుదల చేసింది. కరోనా లక్షణాలున్న వారిని, ఇతరుల నుంచి వేరుచేయడం దీని ప్రధాన ఉద్దేశం. తద్వారా ఇతరులకు ఆ లక్షణాలు సంక్రమించకుండా నిరోధించడమే లక్ష్యం.

హోం క్వారంటైన్‌లో ఎవరుండాలి? 
► ఇతర దేశాల నుండి వచ్చిన ప్రయాణికులంతా ఉండాలి. వారికి కరోనా లక్షణాలున్నా లేకపోయినా ఉండాలి. 
► కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో కలిసిమెలిసి తిరిగిన వారు, తద్వారా ఏవైనా లక్షణాలు వృద్ధి చెందితే వారు కూడా హోం క్వారంటైన్‌లో ఉండాలి. 
► హోం క్వారంటైన్‌లో ఉండే వ్యక్తి ముంజేతిపై జిల్లా అధికారులు తప్పకుండా ముద్ర వేయాలి. 
► ప్రత్యేక టాయిలెట్‌ ఉన్న గది క్వారంటైన్‌ వ్యక్తులకు కేటాయించాలి. ఆ గదికి మంచి వెంటిలేషన్‌ ఉండాలి. క్వారంటైన్‌ కాలంలో కేటాయించిన గది నుండి బయటికి వెళ్లకూడదు. 
► మరొక కుటుంబ సభ్యుడు ఒకే గదిలో ఉండాల్సి వస్తే.. ఇద్దరి మధ్య కనీసం మీటర్‌ దూరం ఉండాలి. 
► వృద్ధులు, గర్భిణిలు, పిల్లలుసహా ఇంట్లో ఎవరికైనా మధుమేహం, క్షయ, గుండె జబ్బులు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులుంటే వారంతా క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలి. 
► సామాజిక, మతపరమైన సమావేశాలకు హాజరుకాకూడదు. ఉదాహరణకు వివాహాలు, సంతాపాలు మొదలైనవి. 
► ప్రజారోగ్య చర్యలను తప్పక పాటించాలి. కనీసం 20 సెకన్లపాటు సబ్బు లేదా ఆల్కహాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్‌తో చేతిని బాగా కడగాలి. 
► అందుబాటులో ఉంటే కాగితపు తువ్వాళ్లను వాడాలి. లేకుంటే గుడ్డ తువ్వాళ్లను వాడాలి. తడి తువ్వాళ్లు వాడరాదు. 
► ఆ వ్యక్తి వాడే వస్తువులను డిటర్జెంట్‌తో పూర్తిగా కడగాలి. అతను వాడే వస్తువులను ఇతర వ్యక్తులు తాకకూడదు.
► అన్ని సమయాలలో కూడా క్వారంటైన్‌ వ్యక్తి శస్త్రచికిత్సల సందర్భంగా ఉపయోగించే మాస్క్‌ను ధరించాలి. మాస్క్‌ను ప్రతి 6–8 గంటలకు మార్చాలి. ఆపై పారేయాలి. 
► ఉపయోగించిన మాస్క్‌లను, ఇతర పారవేసే వస్తువులను దహనం చేయాలి. లేదా లోతైన గోతిలో పాతిపెట్టాలి.  
► క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి లక్షణాలు కనిపిస్తే (దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది) వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. లేదా 104కు కాల్‌ చేయాలి. 
► క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి సేవలు అందించే సహాయకుడు మాత్రమే అన్నీ చూసుకోవాలి. సందర్శకులను ఇంటి లోపలకు అనుమతించకూడదు.
► గదిలోని మంచం, దాని చుట్టుపక్కల ఫ్రేములు, ఇతర ఫర్నిచర్‌ వంటివి తరచుగా తాకినట్లయితే వాటిని కడగాలి.
► టాయిలెట్‌ను రోజూ ఒకసారి శుభ్రం చేసి క్రిమిసంహారకం చేయాలి.
► క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి దగ్గరి స్నేహితులు కూడా 14 రోజులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లాలి. ప్రధాన వ్యక్తికి లక్షణాలుండి వైద్య పరీక్షలకు శాంపిళ్లను పంపితే అదనంగా మరో 14 రోజులు ఆసుపత్రిలో ఉండాలి. 
► పొరుగువారితో క్వారంటైన్‌ వ్యక్తి కలిసి తిరిగితే వారిని కూడా క్వారంటైన్‌లోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని సంబంధిత అధికారికి తెలియజేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement