
వంట గ్యాస్ వినియోగదారుల్లో కొందరికి సబ్సిడీ సొమ్ము అందని ద్రాక్షగానే మిగిలింది. అన్ని వివరాలు సమర్పించినా సబ్సిడీ సొమ్ము మాత్రం ఖాతాల్లో జమ కావడం లేదు. ఏజెన్సీల్లోనూ సరైన సమాధానం రావడం లేదు. సబ్సిడీ సొమ్ము అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో 2.27 లక్షల కుటుంబాలు ఉండంగా 1,90,742 కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందరికీ గ్యాస్ సిలిం డర్లు సరఫరా చేయడానికిగాను జిల్లాలో 20 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. గతంలో సబ్సిడీపోను మిగ తా సొమ్ము చెల్లించి సిలిండర్ తీసుకునే అవకాశం ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం గ్యాస్ సబ్సిడీని వినియోగదారుడి ఖాతాలో జమ చేసే విధానాన్ని తీసుకువచ్చింది.
అప్పటి నుంచి వినియోగదారులు సిలిండర్ పూర్తి ధర చెల్లిస్తున్నా రు. అనంతరం సబ్సిడీ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అయితే ఏడాది కాలంగా చాలామంది వినియోగదారుల ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ సొమ్ము జమ కావడం లేదు. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీల చు ట్టూ తిరుగుతున్నారు.
వినియోగదారునికి రావాల్సిన సబ్సిడీ సొ మ్మును వేరే ఖాతాలకు మళ్లిస్తున్నారన్న ఆరోపణ లు వచ్చాయి. అయితే సబ్సిడీ విషయంలో తమ కేం సంబంధం లేదని, అదంతా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతుందని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 703 ఉండగా.. సబ్సిడీ రూ. 213.50 రావా ల్సి ఉంది. అంటే వినియోగదారునికి సిలిండర్ రూ. 489.50కే అందుతుందన్నమాట.
అయితే చాలామంది వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ ఖాతాలకు చేరడం లేదు. గ్యాస్ వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోనే సబ్సిడీ జమ అవుతుందని ఏజెన్సీల నిర్వాహకులు స్పష్టం చేస్తుండగా.. చాలా మంది వినియోగదారులు తమ ఖాతాల్లో జమ కావడం లేదని ఆరోపిస్తున్నారు. సరాసరిన ఒక్కో వినియోగదారులు ఆరునుంచి ఏడు సిలిండర్లను వినియోగించినా.. ఏడాదికి రూ. 1,500 వరకు నష్టపోతున్నాడు.
ఆపై అదనపు వసూళ్లు...
గ్యాస్ సిలిండర్‌పై రావాల్సిన సబ్సిడీ సొమ్ము అందకపోగా.. గ్యాస్ సిలిండర్ డోర్‌డెలివరీ చేసిన వారు సిలిండర్ వెంట రవాణా చార్జీ అంటూ రూ. 20 నుంచి రూ. 50 వరకు వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి డబ్బులు గుంజుతున్నారు. నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్లను వినియోగదారుడి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపైనే ఉంటుంది. కానీ చాలా ఏజెన్సీల నిర్వాహకులు డెలివరీ బాయ్‌ల ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
వాళ్లు చెప్పినన్ని డబ్బులు ఇవ్వకుంటే సిలిండర్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగదారులు డెలివరీ బాయ్స్ అడిగినంత చెల్లిస్తున్నారు. గ్యాస్ సబ్సిడీ వినియోగదారుల ఖాతాలకు చేరే విషయంలోనే కాక, రవాణా చార్జీల పేరుతో అక్రమంగా వసూలు చేస్తున్న వ్యవహారంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
సబ్సిడీ సొమ్ము ఎటుపోతోంది?
గ్యాస్ సబ్సిడీ సొమ్ము ఏమవుతోంది, ఎవరి ఖాతాలో చేరుతుందన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది. అప్పట్లో ఓ సెల్యూలర్ కంపెనీ తన వినియోగదారులకు తెలియకుండానే బ్యాంకు అకౌంట్లు తెరిపించి, సబ్సిడీ సొమ్మును ఆ ఖాతాల్లోకి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఏజెన్సీ నిర్వాహకులను సంప్రదిస్తే ఆధార్ కార్డు అనుసంధానం అయిన తరువాత వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోకే సబ్సిడీ సొమ్ము చేరుతుందంటున్నారు. వినియోగదారుడు కొత్తగా ఏదైనా బ్యాంకులో ఖాతా తెరిస్తే.. ఆ ఖాతాలో సబ్సిడీ సొమ్ము చేరే అవకాశం ఉంటుందంటున్నారు.
ఆధార్ అను సంధానం పూర్తయినా తమ ఖాతాల్లో డబ్బులు చేరడం లేదని వినియోగదారులంటున్నారు. సబ్సిడీ ఎటుపోతుందో తెలియక.. చెప్పేవారూ లేక అయోమయానికి గురవుతున్నారు.గ్యాస్ కంపెనీలే చూసుకుంటాయి..
ప్రతి గ్యాస్ వినియోగదారుడికి లెక్క ప్రకారం సబ్సిడీ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ కావాల్సిందే.. అయితే సబ్సిడీ సొమ్ము విషయం మా పరిధిలోకి రాదు. గ్యాస్ సబ్సిడీ అనేది అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ ప్రక్రియను గ్యాస్ ఏజెన్సీలు, గ్యాస్ కంపెనీలే చూస్తాయి. అయినా ఒకసారి పరిశీలిస్తాం.
– రమేశ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి