రైతుల ఆందోళన ఉధృతం

Farmers Protest Divitipalle IT Corridor Mahabubnagar - Sakshi

మద్దతు తెలిపిన సీపీఎం నాయకులు 

రైతులను హెచ్చరించిన తహసీల్దార్‌ 

సాక్షి, మహబూబ్‌నగర్‌ : దివిటిపల్లి ఐటీ కారిడార్‌ భూ నిర్వాసితుల ఆందోళన జఠిలమవుతోంది. భూ నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో వారు తమ ఆందోళనను మూడోరోజు కూడా కొనసాగించారు. నష్టపరిహారం కోసం కారిడార్‌ కోసం సేకరించిన స్థలంలో ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు గురువారం అర్బన్‌ మండల తహసీల్దార్‌ వెంకటేశం ఐటీ అధికారులతో కలిసి వచ్చి చర్చలు జరిపారు. కారిడార్‌ కోసం సేకరించిన భూమిలో ఐటీ టవర్‌ నిర్మాణానికి అడ్డు తెలుపకూడదని, త్వరలోనే నష్టపరిహారం చెల్లిస్తామని తహసీల్దార్‌ పేర్కొన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పరిహారం చెల్లింపు ఆలస్యమైందని, వాటిని సరిచేసి పరిహారం చెల్లింపు సాధ్యమైనంత త్వరగా చేస్తామని హామీ ఇచ్చారు.

పరిహారం చెల్లిస్తేనే ఐటీ టవర్‌ నిర్మించడానికి అంగీకరిస్తామని, లేకుంటే అడ్డుకుంటామని రైతులు తేల్చిచెప్పారు. టవర్‌ నిర్మాణం పనులు కొనసాగనివ్వాలని, ఒకవేళ అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా తహసీల్దార్‌ హెచ్చరించారు.  పెద్ద రైతులకు మాత్రం పరిహారం చెల్లించి ఎకరా, అర ఎకరం భూములు గల తమకు నష్టపరిహారం చెల్లించే విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నారని రైతులు ప్రశ్నించారు. రైతులకు సీపీఎం పార్టీ మద్దతు తెలిపింది. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రాములు, పట్టణ కార్యదర్శి చంద్రకాంత్, సభ్యులు ఆదివిష్ణు, తిరుమలయ్యలు వెన్నుదన్నుగా నిలిచి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ తరుణంలో తహసీల్దార్‌ వెంకటేశం రైతులతో జరిపిన చర్చలు దాదాపు విఫలమయ్యాయి. చర్చలు విఫలం కావడంతో నాల్గో రోజు రైతుల ఆందోళన కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని 556, 607 సర్వేనంబర్ల రైతులకు నష్టపరిహారం త్వరగా చెల్లిస్తే సమస్య మరింత త్వరగా పరిష్కారమై ఐటీ టవర్‌ నిర్మాణం చురుకుగా కొనసాగే అవకాశం ఉంది.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top