కాంగ్రెస్‌ హయాంలోనే పేదలకు న్యాయం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ హయాంలోనే పేదలకు న్యాయం

Published Sat, Oct 28 2017 5:47 PM

congress govt justice to poor families - Sakshi

మణికొండ: ఇళ్లు లేని పేదవారందరికీ ఇందిరమ్మ ఇంటి స్థలాలతో పాటు రాజీవ్‌గృహకల్పతో గూడును కల్పించిన ఘనత అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజేశేఖర్‌రెడ్డి ఘనతేనని మాజీ హోంమంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం గండిపేట మండల పరిధిలోని కోకాపేట సెజ్‌లో ఏర్పాటు చేసిన పోరు ఆగదు బహిరంగ సభకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని శివారు గ్రామాలలో భూములిచ్చే అవకాశం లేకపోయినా ప్రత్యేక జీవోను తెచ్చి ప్రతి గ్రామంలో పది ఎకరాలకన్నా ఎక్కువే పేదలకు ఇళ్ల పట్టాల రూపంలో ఇవ్వటంతో వారి జీవితాలే మారిపోయాయని ఆమె పేర్కొన్నారు. 

చరిత్రలో ఎక్కడా లేని విధంగా కోకాపేట సెజ్‌లో భూములు కోల్పొయిన వారికి మూడు తరాలకు మూడు 250 గజాల చొప్పున ప్లాట్లు కేటాయించి వారిని కోటీశ్వరులను చేశామన్నారు. అప్పట్లో కోకాపేటలో సర్వేనెంబర్‌ 239, 240లలో పట్టాలు ఇచ్చిన భూమి కోర్టు వివాదంలో ఉండటంతో కోకాపేట, ఖానాపూర్‌ గ్రామస్తులకు స్థలాలను చూపలేకపోయామని.. ప్రస్తుత ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరి అన్ని పనులను సాదిస్తామన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు రాజేంద్రనగర్‌ నియోజకవర్గానికి, గండిపేట మండలానికి చేసిందేమిటో ప్రజలకు చెప్పాలని ఆమె పేర్కొన్నారు.

 వారు టీఆర్‌ఎస్‌లో చేరిన విధంగానే.. రెండు గ్రామాల ఇందిరమ్మ లబ్ధిదారులందరికీ టీఆర్‌ఎస్‌ కండువాలు వైసైనా గతంలో కేటాయించిన 20 ఎకరాలలో ఇంటి స్థలాలను చూపితే తమకు అభ్యంతరం లేదని ఆమె స్పష్టం చేశారు. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని.. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని ఆమె ప్రశ్నించారు.  

జిల్లాపై ముఖ్యమంత్రికి చిన్నచూపు... 
రంగారెడ్డి జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు చిన్నచూపు ఉందని దాంతో జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని మాజీ హోంమంత్రి సబితారెడ్డి ఆరోపించారు. మూడు సంవత్సరాల పాలనలో ఆయన జిల్లాకు చేసిందేమీ లేదని.. జిల్లా భూములు అమ్ముకుని తనకు నచ్చిన జిల్లాల్లో ఖర్చు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కోకాపేట సర్పంచ్‌ ఆర్‌. మంజులయాదగిరి, ఎంపీటీసీ సభ్యురాలు ఆండాలు ఆంజనేయులు, మండల పార్టీ అధ్యక్షుడు క్యాతం అశోక్‌యాదవ్, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పి.కృష్ణారెడ్డి, పీఏïసీఎస్‌ చైర్మన్‌ భిక్షపతి, నాయకులు నవాజ్‌ముంతాజ్, కె.నరేందర్, సహదేవ్‌గౌడ్, జి.నగేశ్‌యాదవ్, ఖాజ, యాలాల నరేశ్, దుర్గేశ్‌యాదవ్, సురేశ్‌బాబు, విజయ్‌బాబు, వేణుగౌడ్, రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement