రాజకీయ అండతో పెద్దలే.. గద్దలై!     

Compensation Of Farmers For Industrial Lands In Ranga Reddy - Sakshi

అక్రమార్కుల చేతికి దాదాపు రూ.4 కోట్ల పరిహారం 

సర్పంచ్, మరికొందరిపై  పోలీసులకు బాధితుల ఫిర్యాదు 

26 రోజులుగా సాగుతున్న ‘చందనవెల్లి’ నిర్వాసితుల ఆందోళన

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  షాబాద్‌ మండలం చందనవెల్లి పారిశ్రామికవాడలో భూములు కోల్పోయిన రైతులకు అందాల్సిన పరిహారాన్ని రాజకీయ పెద్దలే గద్దలుగా భోంచేశారు. 170 మంది రైతులకు రూ.60.20 కోట్ల పరిహారం అందజేయగా.. ఇందులో సుమారు రూ.4 కోట్ల వరకు అనర్హుల పేర్లతో మెక్కేశారు. ఇప్పటికే 15 మంది రూ.2.6 కోట్లు అక్రమంగా నొక్కినట్లు యంత్రాంగం గుర్తించి వివరణ కోసం నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఇదిగాక మరో రూ.2 కోట్ల వరకు పక్కదారి పట్టినట్లు సమాచారం.

ఈ మొత్తంలో ఎవరెవరికి.. ఎంత దక్కిందనేది విచారణలో తేలనుంది. స్థానిక సర్పంచ్‌ కొలాన్‌ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అతని సన్నిహితులు, మాజీ సర్పంచ్‌లు జట్టుగా ఏర్పడి కొల్లగొట్టినట్లు విచారణలో వెల్లడవుతున్నట్లు సమాచారం. మరణించిన మాజీ సైనికుడి పేరు మీద ఉన్న ఐదెకరాల భూమిని సర్పంచ్‌ సోదరుడు కొలాన్‌ సుధాకర్‌రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తద్వారా రూ.45 లక్షల పరిహారాన్ని కాజేశారని ప్రచారం జరుగుతోంది. సైనికులకు ప్రభుత్వం పంపిణీ చేసిన పదేళ్ల తర్వాత సదరు భూమిని విక్రయించుకునే వీలుంది. అయితే ఇందుకు తప్పనిసరిగా యంత్రాంగం జారీచేసిన నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఉండాలి.

ఎన్‌ఓసీ లేకుండానే ఎలా కొనుగోలు చేశారన్నది, రిజిస్ట్రేషన్‌ ఎలా జరిగిందన్న అంశంపై యంత్రాంగం విచారణ జరుపుతోంది. అంతేగాక అసలు భూమి లేకున్నా చాలా మంది పేర్లు డిక్లరేషన్‌ జాబితాలో చేర్చి పరిహారం పొందారు. కాగా, తమకు న్యాయం జరిగేంతవరకు దీక్షను కొనసాగిస్తామని బాధితులు స్పష్టం చేస్తున్నారు. బాధితుల రిలే నిరాహార దీక్ష శనివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. శిబిరంలో అర్ధనగ్న ప్రదర్శన చేయడంతోపాటు నోటికి నల్లరిబ్బన్‌ ధరించి మౌనప్రదర్శన చేశారు.

పోలీసులకు బాధితుల ఫిర్యాదు.. 
షాబాద్‌ (చేవెళ్ల): చందనవెళ్లి భూముల పరిహారంలో అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై బాధిత రైతులు షాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను బెదిరించి పరిహారాన్ని దౌర్జన్యంగా తీసుకున్నారని వివరించారు. చందనవెల్లి ప్రస్తుత సర్పంచ్‌ కొలాన్‌ ప్రభాకర్‌రెడ్డి, కొలన్‌ సుధాకర్‌రెడ్డి, శ్రీలత, బషీర్, వెంకటయ్యలపై సీఐ నర్సయ్యకు బాధిత రైతులు ఎం.సత్యనారాయణ, ఎం.రాజు, జరినాబేగం, ఎ.సత్తమ్మ, అజహర్‌ ఫిర్యాదు చేశారు. తమ భూములకు సంబంధించిన నష్టపరిహారాన్ని తమకు తెలియకుండా సర్పంచ్‌ కుటుంబీకులు పొందారని తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తమకు న్యాయం చేయాలని గత 26 రోజులుగా రిలే నిరహార దీక్ష చేపడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు.

బాధితులకు తెలియకుండానే వారి చెక్కులను మద్యవర్తులు మార్చుకుని తమ ఖాతాల్లో వేసుకున్నట్లు చెప్పారు. తనకు వచ్చిన రూ.12లక్షలను మాజీ సర్పంచ్‌ కుమారుడు వెంకటయ్య తన ఖాతాలో వేసుకుని డబ్బులు ఇవ్వనని బెదిరించాడని జరినాబేగం ఫిర్యాదులో పేర్కొంది. చందనవెల్లి భూముల పరిహారంలో జరిగిన అక్రమాలపై సరైన విచారణ జరిపించి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న సీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. కలెక్టర్, తన పైఅధికారు దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top