తగ్గనున్న ఎరువుల ధరలు!

The Central Govt. Has Announced To Reduce The Complex Fertilizers Price Except Urea - Sakshi

ఖరీఫ్‌లో రైతన్నలకు కాస్త లబ్ధి

జిల్లాలో తగ్గిన భారం రూ.2.47 కోట్లు

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

ఇంకా ఆదేశాలు రాలేదంటున్నసహకార సంఘాల చైర్మన్లు

సాక్షి, మెదక్‌జోన్‌: అన్నదాతలకు కరువులో కాస్త ఊరట లభించినట్లైంది. ఎరువుల ధరలను కంపెనీల యాజమాన్యాలు తగ్గించటంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. యూరియా తప్ప మిగతా కాంప్లెక్స్‌ ఎరువులను తగ్గిస్తునట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వరుస కరువుకాటకాలతో పంటల సాగు అంతంత మాత్రమే సాగుతుండటంతో ఎరువులకు గిరాకీ తగ్గింది. ఈ తరుణంలోనే ఎరువుల కంపెనీల యజమానులు రసాయన ఎరువుల ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మెదక్‌ జిల్లాలో రైతాంగానికి రూ.2.47 కోట్ల భారం తగ్గనుంది.              

ఈ ఏడాది జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు సాధారణ సాగు 83, 373 హెక్టార్లు అంచన వేశారు. దీని కోసం 3,900 మెంట్రిక్‌ టన్నుల డీఏపీ ఎరువులు అవసరం ఉన్నాయి. ప్రస్తుతం 50 కిలోల బస్తా డీఏపీ ధర రూ.1,400 కాగా బస్తాకు రూ.100 చొప్పున తగ్గించి రూ.1,300 అమ్మాలని నిర్ణయం జరిగింది.

దీంతో ఒక్క డీఏపీ ఎరువులపైన రైతులపై రూ.78 లక్షలు భారం తగ్గనుంది. అలాగే 20–20–0–13 కాంప్లెక్స్‌ ఎరువులు 13 వేల మెట్రిక్‌ టన్నులు జిల్లా రైతాంగానికి అవసరం ఉండగా ఈ బస్తా ధర పాతది రూ.1,065 ఉండగా దానిని బస్తాకు రూ.65 తగ్గించి రూ.1,000కి విక్రయించనున్నారు. దీంతో రూ.1.47 కోట్లు తగ్గింది. డీఏపీ, కాంప్లెక్స్‌ రెండింటికీ కలిపి తగ్గిన ఎరువుల ధరలతో జిల్లా రైతాంగానికి రూ.2.47 కోట్ల భారం తగ్గింది.

ప్రస్తుతం ఎరువుల గోడౌన్లలో స్టాక్‌ ఎరువులు ఉన్నప్పటికీ తగ్గిన ధరలకే రైతులకు ఎరువులను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా ప్రస్తుతం పాత ధరలు మాత్రమే ఎంఆర్‌పీ రూపంలో ఉన్నప్పటికీ కొత్త ధరలకు ఎరువులను రైతులకు అందించాలని పేర్కొంది. తగ్గించిన ధరలతో త్వరలో ఎంఆర్‌పీ ముద్రణతో త్వరలో మార్కెట్‌కు రానునట్లు ఓ జిల్లా అధికారి పేర్కొన్నారు. 

అందని ఆదేశాలు
ఎరువుల యజమాన్యాలు ధరలను తగ్గించినట్లు ప్రకటించాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభసూచకమని పేర్కొన్నప్పటికీ తగ్గించిన ధరలతోనే రైతులకు ఎరువుల బస్తాలను విక్రయించాలని తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని పలువురు సహకార సంఘాల చైర్మన్లు పేర్కొంటున్నారు. ఎరువుల ధరలు తగ్గినట్లు తాము పేపర్లో చూడటం తప్పా అధికారికంగా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను తగ్గించటం మంచి పరిణామమే అయినప్పటికీ పాత స్టాక్‌ ఎంత ఉంది అనే లెక్కలను సైతం సరిచూసుకోకుండా ఎరువుల ధరలు తగ్గించి తమకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వక పోవటంతో ఇబ్బందులు తప్పటంలేదని పలువురు సహకార సంఘాల చైర్మన్లు పేర్కొంటున్నా రు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పం దించి తమకు వెంటనే తగ్గిన ధరల పట్టికను తమ కు అధికారికంగా అందించాలని కోరుతున్నారు.

సంతోషంగా ఉంది
మందు సంచుల ధరలను ప్రభుత్వం తగ్గించటం సంతోషంగా ఉంది. నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. 15 మందు సంచులు అవసరం ఉన్నాయి. రేట్లు తగ్గించటంతో నాకు రూ.1500 తగ్గాయి. కానీ తగ్గించిన ధరలకే మందు సంచులను అమ్మేలా చూడాలి.
– రైతు నర్సింలు జంగరాయి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top