ఇచ్చంపల్లికే మొగ్గు !

Central Government Preferred To Icchampally Reservoir To Drift Krishna- Godavari Water To Kaveri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా గోదావరి నుంచి కృష్ణా జలాలను కావేరీకి తరలించే క్రమంలో ఇచ్చంపల్లి నుంచే నీటి తరలింపునకు కేంద్రం మొగ్గుచూపుతోంది. ఇప్పటికే కేంద్ర జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన అకినేపల్లి ప్రతిపాదనను, జనంపేట నుంచి పైప్‌లైన్‌ ద్వారా నీటి తరలింపు ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించడంతో ఇచ్చంపల్లి నుంచి నీటిని నాగార్జునసాగర్‌కు తరలించే ప్రతిపాదనకు పదును పెడుతోంది. అనుసంధాన ప్రక్రియపై ఈ నెల 21న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇచ్చంపల్లి నుంచి నీటి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చిన ఎన్‌డబ్ల్యూడీఏ.. దీనిపై తెలంగాణ అభిప్రాయాలు కోరింది.

నిజానికి ఎన్‌డబ్ల్యూడీఏ మొదట 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరీకి తరలించాలని మొదట ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలపడంతో జనంపేట ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భూసేకరణ తగ్గించేలా పైప్‌లైన్‌ ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. అయితే పైప్‌లైన్‌ ద్వారా నీటిని తరలిస్తే వ్యయం ఏకంగా రూ.90 వేల కోట్ల మేర ఉంటోంది. కాల్వల ద్వారా అయితే రూ.60 వేల కోట్ల వరకే వ్యయం ఉంటోంది. అయినా ఈ ప్రతిపాదనతో పెద్దగా ఉపయోగం లేకపోవడంతో తెలంగాణ తిరస్కరించింది. దీంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది.

ఇచ్చంపల్లి (గోదావరి)– నాగార్జునసాగర్‌ (కృష్ణా) ప్రాజెక్టులను అనుసంధానించాలని, దీనికి మూసీ రిజర్వాయర్‌ను వినియోగించుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి తెలంగాణ సానుకూలంగా ఉంది. ఈ అనుసంధానం ద్వారా ఎస్సారెస్పీ–2లోని కాకతీయ కాల్వల ఆయకట్టు, ఎస్‌ఎల్‌బీసీ ఆయకట్టు, డిండి ఆయకట్టుకు కలిపి మొత్తం 9 లక్షల హెక్టార్లు (25 లక్షల ఎకరాలు) ఆయకట్టుకు నీరు అందించొచ్చని కేంద్రం చెబుతోంది. దీనికి రూ.73 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. దీనిపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణను కోరింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి నీటిని కృష్ణాకు తరలించే అంశమై చర్చలు జరుగుతున్న దృష్ట్యా, దీనిపై ఓ స్పష్టత వచ్చాక కేంద్రం చేస్తున్న ప్రతిపాదనపై స్పష్టత ఇస్తామని తెలంగాణ తెలిపింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top