చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం దక్షిణ రైల్వేపైనా పడింది. దీంతో రైల్వే ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే ఆర్టీసీ, తమిళనాడు ప్రభుత్వ బస్సులకు నిరవధిక బ్రేక్ పడింది.
ఆంధ్ర - చెన్నై మధ్య 20 రైళ్లు రద్దు
Published Tue, Oct 8 2013 4:49 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం దక్షిణ రైల్వేపైనా పడింది. దీంతో రైల్వే ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే ఆర్టీసీ, తమిళనాడు ప్రభుత్వ బస్సులకు నిరవధిక బ్రేక్ పడింది. ఉద్యమకారులు రైళ్లపై దృష్టి పెట్టకపోవడంతో ప్రయాణికులు ఇన్నాళ్లూ రైలు మార్గాన్నే ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. కేంద్ర మంత్రి వర్గం తెలంగాణ విభజన నిర్ణయాన్ని ప్రకటించడంతో ఉద్యమం ఉద్ధృతమైంది. రైళ్లను కూడా స్తంభింపజేయాలని సమైక్యవాదులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో విద్యుత్ పరిశ్రమ స్తంభించడంతో నేరుగా రైల్‌రోకోకు పాల్పడే అవసరం లేకుండా పోయింది. విద్యుత్ సరఫరాలో ఏర్పడిన విఘాతం గృహ, వాణిజ్య, వ్యాపార అవసరాలే కాకుండా రైల్వే విద్యుత్ లైన్‌లపై కూడా ప్రభావం చూపింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎలక్ట్రిక్ ఇంజిన్లు ఉన్న రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కొన్నింటిని డీజిల్ ఇంజిన్ల ద్వారా నడుపుతున్నారు. రైళ్ల రాకపోకల వేళలన్నీ తారుమారయ్యాయి. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు ఏ రైలు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు బయలుదేరుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
ఉద్యమ తీవ్రత, కరెంటు కోతలతో కొన్ని రైళ్లను అప్పటికప్పుడు రద్దు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు చెన్నైకి రావాల్సిన పినాకిని ఎక్స్‌ప్రెస్, సాయంత్రం 4 గంటలకు రావాల్సిని బిట్రగుంట ప్యాసింజర్ రాలేదు. అలాగే చెన్నై నుంచి ఉదయం 7.15 గంటలకు బయలుదేరాల్సిన జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్, 4 గంటలకు బయలుదేరే గూడూరు ప్యాసింజర్ రైళ్లను రద్దుచేశారు. ఈ రైళ్ల కోసం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వేలాది మంది ప్రయాణికులు ప్లాట్‌ఫారాలపై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విచారణ కేంద్రానికి వెళ్లినా ఏమీ చెప్పలేని పరిస్థితిని అధికారులు ఎదుర్కొంటున్నారు.
Advertisement
Advertisement