మరో ఐదురోజులు వర్షాలు | Sakshi
Sakshi News home page

మరో ఐదురోజులు వర్షాలు

Published Fri, Nov 2 2018 12:06 PM

Heavy Rains In Tamil Nadu - Sakshi

రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు గురువారం ప్రవేశించడమే తరువాయి దాని ప్రభావంతో వర్షాలు జోరందుకుంటున్నాయి. మరో ఐదురోజులపాటు వర్షాలు పడుతాయని చెన్నైలోని వాతావరణశాఖ  తెలియజేసింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: బంగాళాఖాతం, కన్యాకుమారి సముద్రంలో లూపాన్, తిత్లీ తుపానుల వచ్చిన కారణంగా అక్టోబరు 20వ తేదీన ప్రవేశించాల్సిన ఈశాన్య రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. ఆలస్యమైతేనేం సత్తా చూపిస్తామని అన్నట్లుగా బుధవారం రాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ప్రారంభమైనాయి. చెన్నై ఎగ్మూరు, అడయారు, సైదాపేట, నుంగంబాక్కం, పట్టినంబాక్కం, తరమని తదితర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. దీంతో పరిసరాల్లోని పూండి, చోళవరం, పుళల్, చెంబరబాక్కం జలాశయాల్లో  నీటి మట్టం ఓ మోస్తరుగా పెరిగింది. మరో ఐదురోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈశాన్య రుతపవనాల వల్ల జన, ఆస్తి నష్టం జరగకుండా 30,759 మందితో సహాయక బృందాలను సిద్ధం చేసినట్లు ప్రకృతి విపత్తుల రెవెన్యూమంత్రి ఆర్‌బీ ఉదయకుమార్‌ గురువారం తెలిపారు. ఈశాన్య రుతుపవనాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగానే 662 మండలాల్లో సహాయక బృందాలు నిరంతర నిఘాతో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ బృందాల్లో 21,597 మంది పురుషులు, 9,162 మంది స్త్రీలు లెక్కన 30,759 మంది ఉన్నారని అన్నారు.

గుడిసె కూలి ఒకరి మృతి
చెన్నైలో కురుస్తున్న వర్షాల కారణంగా తిరువత్తియూరులో ఒక పూరిగుడిసె కూలడంతో రమేష్‌ (34) అనే యువకుడు మృతిచెందాడు. బుధవారం రాత్రి వర్షం కురుస్తుండగా తన పెంపుడు కుక్కతో కలిసి గుడిసెలో నిద్రించాడు. అర్ధరాత్రి దాటిన తరువాత గుడిసె కూలిపోగా శిథిలాల కింద చిక్కుకుని అతడు, కుక్క కూడా ప్రాణాలు విడిచారు. గురువారం తెల్లారిన తరువాత ఆవైపుగా వెళ్లిన స్థానికులు గుడిసె శిథిలాలు తొలగించి చూడగా దుర్ఘటన బయటపడింది.

ఈరోడ్‌లో కుండపోత
ఈరోడ్‌ జిల్లాలో బుధవారం రాత్రంతా వర్షం కుండపోతగా కుమ్మరించింది. రోడ్లు,లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గోపిచెట్టిపాళయం, నంబియూర్, నాగర్‌పాళయం, సెమ్మాండం పాళయం వంటి ప్రాంతాల్లో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో గోపిచెట్టి పాళయంలో ప్రవహిస్తున్న మురికి నీటి కాలువ కీరిపల్లం ఉప్పొంగి మొడచ్చూర్, సామినాథపురం, వండిపేట్టై, మేట్టువళవు, నంజాగౌండం పాళయం వంటి ప్రాంతాలలోని 200లకు పైగా ఇళ్లలోకి మురికి నీరు చొరబడింది. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతాలకు చేరుకుని ప్రజలను సురక్షితంగా తరలించి ఒక పాఠశాలలో బస కల్పించి, వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించారు.

అపార్ట్‌మెంట్‌లు కట్టిస్తాం : సెంగోట్టయ్యన్‌
వర్ష బాధిత ప్రాంతాలను విద్యాశాఖ మంత్రి సెంగోట్టయ్యన్‌ గురువారం పరిశీలించారు. తర్వాత అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కీలిపల్లం మురికి కాలువను ఆనుకుని నివాసముంటున్న వారందరికీ అపార్ట్‌మెంట్‌ భవనాలను నిర్మించి ఇస్తామన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా పాఠశాలలో బసచేసి ఉన్న వరద బాధితులకు ఆహారం, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. పేరుకుపోయిన నీటిని వెంటనే తొలగించి, పారిశుద్ధ్య పనులు వేగవంతం చేసినట్టు తెలిపారు. అదే విధంగా అంటు రోగాలు ప్రగలకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

Advertisement
Advertisement