వాస్తవ ఫలితాలు వచ్చే వరకూ ఎదురు చూస్తాం : విపక్షాలు

Opposition Leaders Reaction Over Exit Polls Predictions - Sakshi

న్యూఢిల్లీ : పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలు ఉండగా 542 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వెల్లూరులో ఈసీ ఎన్నికలు రద్దు చేసింది. ఎన్నికల్లో ప్రజానాడి ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి పార్టీలతో పాటు జనాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో బీజేపీ కూటమి దాదాపుగా 300 సీట్లు గెలుచుకుంటుందని.. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ 127 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని సూచించాయి. ఈ రెండు కూటముల్లో లేని ప్రాంతీయ పార్టీలు 115 స్థానాలను కైవసం చేసుకునే పరిస్థితి కనుబడుతోందని సర్వే ఫలితాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఎగ్జిట్‌ పోల్స్‌ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఎగ్జిట్ పోల్స్‌ను నేను నమ్మను: మమతా బెనర్జీ
‘ఎగ్జిట్ పోల్స్ గాసిప్‌ను నేను నమ్మను. ఈ గాసిప్‌ ద్వారా జనాల దృష్టి మరల్చి.. వేలాది ఈవీఎంల్లో అవకతవకలకు పాల్పడటం, వాటిని మార్చడమే లక్ష్యం. ఇలాంటి సమయంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమవ్వాలని, దృఢంగా కావాలని నేను కోరుతున్నాను. ఈ యుద్ధంలో మనందరం కలిసి పోరాడాలి’ అని మమత ట్వీట్ చేశారు.

ప్రారంభం నుంచి జరుగుతుంది ఇదే : రాహుల్‌
కాంగ్రెస్ పార్టీ  చీఫ్ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ఈవీఎం‌లతో పాటు, ఎన్నికల షెడ్యూల్‌ను కూడ ప్రభావితం  చేశారని  విమర్శలు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌ వెలువడడానికి కొన్ని క్షణాల ముందే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్ బాండ్‌ , ఈవీఎం‌లతో పాటు ఎన్నికల షెడ్యూల్‌ను కూడా మోదీ ప్రభావితం చేశారని  రాహుల్ విమర్శించారు. నమో టీవీ, ఆర్మీని కూడ మోదీ తనకు అనుకూలంగా ఉపయోగించుకొన్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కేదార్‌నాథ్‌లో పూజలు అంటూ మోదీ డ్రామాలు ఆడుతున్నారు. ఈసి కూడా మోదీకి పూర్తిగా లొంగిపోయింది అంటూ రాహుల్ విమర్శలు చేశారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రజల నాడి పట్టలేదు : చంద్రబాబు
‘ప్రజల నాడి తెలుసుకోవడంలో ఎగ్జిట్‌ పోల్స్‌ విఫలమయ్యాయి. వాస్తవాలకు విరుద్ధంగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఉన్నాయి. గతంలోనూ తప్పులు ఇచ్చాయి. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడడంలో ఎలాంటి అనుమానం లేదు. కేంద్రంలో బీజేపీయేతర పార్టీలు ఎక్కువ సీట్లు సాధిస్తాయనే నమ్మకం ఉంది’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ అన్ని తప్పే : శశి థరూర్‌
‘ఎగ్జిట్‌ పోల్స్‌ అన్ని తప్పేనని నా నమ్మకం. గత వారం ఆస్ట్రేలియాలో 56 వేర్వేరు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు తప్పని రుజువైంది. మన దేశంలో జనాలు ప్రభుత్వాలకు భయపడి.. తాము ఏ పార్టీకి ఓటు వేశామో చెప్పరు. వాస్తవ ఫలితాల కోసం 23 వరకూ ఎదురు చూస్తాం’ అని శశి థరూర్‌ ట్వీట్‌ చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ చనిపోతే మంచిది : యోగేంద్ర యాదవ్‌
ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల పట్ల రాజకీయ పరిశీలకుడు యోగేంద్ర యాదవ్‌ స్పందించారు. ‘ఒక వేళ ఈ ఎన్నికల్లో గనక కాంగ్రెస్‌ పార్టీ బీజేపీని నిలవరించలేకపోతే.. భారతదేశ చరిత్రలో ఆ పార్టీకి సానుకూల పాత్ర లేదని స్పష్టమవుతోంది. అప్పుడిక కాంగ్రెస్‌ పార్టీ చనిపోతే మంచిది’ అంటూ ట్వీట్‌ చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top