కేసీఆర్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్టే | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్టే

Published Wed, Oct 3 2018 1:08 AM

KCR is a surrogate of Narendra Modi, says Tharoor - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీఎస్టీనీ, పెద్దనోట్ల రద్దుని సమర్థించిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనీ, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా అనేక సందర్భాల్లో ఆయన బీజేపీకి మద్దతిచ్చారని కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ సభ్యుడు, ఆలిండియా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ శశిథరూర్‌ అన్నారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తులను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హోదాల్లో కూర్చోబెట్టడంలో టీఆర్‌ఎస్‌ పాత్ర ఉంది. కేంద్రంపై అవిశ్వాస సమయంలోనూ బీజేపీకి కేసీఆర్‌ దన్నుగా నిలిచారు. కేంద్రం తీసుకున్న అన్ని ప్రజావ్యతిరేక ఆర్థిక విధానాలనూ ఆయన సమర్థించారు.

ఢిల్లీలో ఉన్న హిందూత్వ పార్టీకి, ఇక్కడి లౌకిక ముసుగులో ఉన్న పార్టీకి మధ్య లోపాయికారీ ఒప్పందాలున్నాయి. అందుకే టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్టే ’అని శశిథరూర్‌ ఆరోపించారు. రెండురోజుల హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆలిండియా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ దక్షిణ, ఉత్తర భారత కోఆర్డినేటర్లు జె.గీతారెడ్డి, సల్మాన్‌సోజ్, తెలంగాణ చీఫ్‌ దాసోజు శ్రావణ్, ఆలిండియా చీఫ్‌ ఆపరేషనల్‌ ఆఫీసర్‌ ఆలం జవేరిలతో కలిసి ఆయన మాట్లాడారు. మోదీ, కేసీఆర్‌లను ఎన్నుకున్నందుకు జాతి ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకుందని, నాలుగేళ్లలో విధ్వంసకర పాలన సాగిందని అన్నారు.

గోరక్ష పేరుతో పెద్దఎత్తున మైనార్టీలు, దళితులపై దాడులు చేశారని అన్నారు. చేసిన తప్పును ఓటు ద్వారా సరిదిద్దుకునే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉందని, ఈ నాలుగేళ్లలో దేశం ఎదుర్కొన్న అనేక సవాళ్లను ప్రజలు గమనించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని థరూర్‌ కోరారు. పెద్దనోట్ల రద్దును ప్రతి అంతర్జాతీయ ఆర్థిక నిపుణుడు తప్పుపట్టాడని, ఈ చర్య ద్వారా దేశ స్థూల జాతీయోత్పత్తి కూడా తగ్గిపోయిందన్నారు. తాము అమలుచేయ తలపెట్టిన జీఎస్టీని పూర్తిగా సన్నద్ధం కాకుండానే అమలు చేశారని అన్నారు. పెట్రోలు పోయించుకునే ప్రజల జేబుల్లో చేయి పెట్టిమరీ లీటర్‌కు రూ.20 చొప్పున ఢిల్లీ తీసుకెళుతున్నాడని ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.390 ఉంటే ఇప్పుడు రూ.840 అయిందని గుర్తుచేశారు.

అంతర్జాతీయ వేదికలను పలుచన చేస్తున్నారు
విదేశాలకు వెళ్లి భారతదేశంలోని వ్యక్తులను అవమానపర్చడం ప్రధాని మోదీకి అలవాటయిందని, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ కూడా అదే ఒరవడిలో అంతర్జాతీయ వేదికలను పలుచన చేస్తున్నారని శశిథరూర్‌ విమర్శించారు. అంతర్జాతీయ వేదికలను మోదీ ప్రచారానికి ఉపయోగించుకుంటారా అని ఆయన నిలదీశారు. రాఫెల్‌ కుంభకోణం గురించి విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ అసలు ఈ కుంభకోణంపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలేవని ప్రశ్నించారు.

రాఫెల్‌ కుంభకోణాన్ని బోఫోర్స్‌తో పోల్చడం తగదని అన్నారు. బోఫోర్స్‌పై జాతీయ మీడియా అనేక కథనాలను ప్రచురించి, ప్రసారం చేసిందని, దానికన్నా ఎన్నో రెట్లు పెద్దదైన రాఫెల్‌ కుంభకోణంపై కనీసం దృష్టిసారించడం లేదని ఆరోపించారు. తాము సూచించిన విధంగా సంయుక్త పార్లమెంటరీ కమిషన్‌ (జేపీసీ) ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేయడం ద్వారా రాఫెల్‌ కుంభకోణంలోని అసలు వాస్తవాలను వెలుగులోనికి తేవాలని థరూర్‌ డిమాండ్‌ చేశారు. ఏఐపీసీ ఉత్తర భారత కోఆర్డినేటర్‌ సల్మాన్‌ సోజ్‌ మాట్లాడుతూ కేసీఆర్, ఒవైసీ, మోదీలు స్నేహితులేనని వ్యాఖ్యానించారు.

ప్రొఫెషనల్స్‌ ప్రేక్షక పాత్ర వహించొద్దు: ఉత్తమ్‌
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెషనల్స్‌ని రాజకీయాలవైపు ఆకర్షితులను చేసేందుకుగాను రాహుల్‌గాంధీ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసి శశిథరూర్‌ను చైర్మన్‌గా నియమించారని చెప్పారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చోటా మోదీ అయిన కేసీఆర్‌లు నియంతపాలన సాగిస్తున్నారని, వీరి అవినీతి పాలనను అంతమొందించే చారిత్రక సందర్భంలో ప్రొఫెషనల్స్‌ ప్రేక్షక పాత్ర వహించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement