ఉలికిపాటెందుకు? 

BJP Leader Laxman Fires On TRS - Sakshi

టీఆర్‌ఎస్‌పై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్‌ ధ్వజం 

కాళేశ్వరంపై డీపీఆర్‌ లేకుండానే టెండర్లు పిలవలేదా? 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటే టీఆర్‌ఎస్‌ ఎందుకు ఉలికిపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు మిషన్‌ కాకతీయ అనేకంటే.. కమీషన్‌ కాకతీయ అంటేనే బాగా అర్థమవుతోందని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్రకార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిషన్‌ కాకతీయ పనులను గతంలోనే 50% పనులను చేశారని, గతంలో చేసిన పనులకే బిల్లులు తీసుకున్నారని 2017లో కాగ్‌ వెల్లడించింది వాస్తవం కాదా? అని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. ఇది అధికారంలో ఉన్న వారి 6% కమీషన్ల కోసమేనన్నారు. ఈ అవినీతిని ప్రశ్నించినందుకే టీఆర్‌ఎస్‌ నేతలు జంకుతున్నారన్నారు. కాళేశ్వరంలో అవినీతి లేకపోతే డిటేయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌) లేకుండానే ఎందుకు టెండర్లకు వెళ్లారని లక్ష్మణ్‌ ప్రశ్నించారు.  రాష్ట్రం లంచగొండితనం, అవినీతిలో నంబర్‌వన్‌గా మారిందన్నారు. 2018లో ‘కరప్షన్‌ ఇన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌’అనే సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్న విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు. మున్సిపల్‌ శాఖమంత్రిగా కేటీఆర్‌ స్వయంగా 2% కమీషన్‌ తీసుకొమ్మని చెప్పారంటూ.. సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బహిరంగంగా చెప్పడం వాస్తవం కాదా? అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ నేతలు హెచ్చులకు పోవద్దని, మెక్కిందంతా కక్కించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బాలికల హైజీన్‌లో ప్యాక్‌లకు సంబంధించిన టెండర్లలో అవినీతి జరగడంతో.. కోర్టు టెండర్లు నిలిపివేయడం నిజం కాదా అని అన్నారు.  అవినీతిపై రుజువులు కావాలంటే.. దమ్ముంటే ఒక సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని, అప్పు డు ఆధారాలు బయట పెడతామని లక్ష్మణ్‌ స్పష్టం చేశా రు. ఇకపై నెలకోసారి అమిత్‌షా, కేంద్రమంత్రులు రాష్ట్రానికి వస్తారన్నారు. దీం తో టీఆర్‌ఎస్‌ నిద్రలేనిరాత్రులు గడపాల్సి వస్తుందన్నారు. విమోచన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. 

జీర్ణించుకోలేకపోతున్నారు 
బీజేపీ బహిరంగసభ విజయవంతం కావడం, బీజేపీలోకి చేరికలను చూసి టీఆర్‌ఎస్‌ నాయకులపీఠం కదిలిపోతోందని లక్ష్మణ్‌ అన్నారు. బీజేపీ ఎదుగుదలను అధికారపార్టీ జీర్ణించు కోలేకపోతున్నారన్నారు. విద్యార్థి ఉద్యమాలు చేసి వచ్చిన వ్యక్తి నడ్డాపై కేటీఆర్‌ తన స్థాయిమరచి విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ కుమారునిగా పుట్టకపోతే ఆయన చరిత్ర ఎక్క డని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌లా నడ్డా ప్యారాచూట్‌ నేత కాదని.. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం లేదన్నారు. ఒక ప్రాం తీయ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు.. ఓ జాతీయ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పేరు తెలియలేదంటే రాజకీయాల్లో ఉండాలో? లేదో తేల్చుకోవాలన్నారు. నడ్డా ఎవరో అని మాట్లాడటం అధికార దురహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు.  కల్వకుంట్ల కుటుంబానికి భజనపరులైన కొందరు మంత్రులు కూడా నోటికొచ్చిన ట్లు మాట్లాడుతున్నారని లక్ష్మణ్‌ మండిపడ్డారు.  సమావేశంలో బీజేపీ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, విజయరామారావు, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రాం చందర్‌రావు, సుధాకరశర్మ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top