సీపీఐకి కొత్తరక్తం ఎక్కించాలి | Atul Kumar Anjan Comments On CPI | Sakshi
Sakshi News home page

సీపీఐకి కొత్తరక్తం ఎక్కించాలి

Jul 13 2019 7:25 AM | Updated on Jul 13 2019 7:25 AM

Atul Kumar Anjan Comments On CPI - Sakshi

అతుల్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌ : గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వీలైనంత మేరకు పార్టీకి కొత్తరక్తాన్ని ఎక్కించేందుకు యువతకు ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ నిర్ణయించింది. అన్నిస్థాయిల్లో నాయకులు, కార్యకర్తలు అలసత్వాన్ని వీడి చురుకుగా పనిచేసేలా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని తీర్మానించింది. పార్టీ కార్యకలాపాలు, సమస్యలపై పోరాటాల్లో ముందుండే వారికి వివిధస్థాయిల్లో నాయకత్వ బాధ్యతలను అప్పగించి, చురుకుగా వ్యవహరించకుండా, స్తబ్ధంగా ఉన్న నేతలు, కార్యకర్తల స్థాయిని కుదించాలని నిర్ణయించింది. అసెంబ్లీ, గ్రామపంచాయతీ, లోక్‌సభ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో నిరాశాజనకమైన ఫలితాలు మూటకట్టుకోవడంతోపాటు సంస్థాగతంగా పార్టీ బలహీనపడడం, ఇతరత్రా లోపాల గురించి సమీక్షించింది. శుక్రవారం ఇక్కడ మఖ్దూంభవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్రకార్యవర్గభేటీకి జాతీయపార్టీ పరిశీలకుడిగా అతుల్‌కుమార్‌ అంజాన్‌ హాజరయ్యారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వివిధ రాష్ట్రాల్లో గెలిచిన తీరు, కార్యకర్తలను నడిపిన పద్దతిని గమనించాలని, పార్టీ పనివిధానాన్ని నాయకులు,కార్యకర్తలు మార్చుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించుకుని ముందుకు సాగాలని అంజాన్‌ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో రాజకీయపరిణామాలు, టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య సాగుతున్న రాజకీయాలు, సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టుల సందర్శన తదితర అంశాలపై రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నివేదిక సమర్పించారు. పోడు రైతుల సమస్యలు, భూరికార్డుల ప్రక్షాళనలో చోటుచేసుకున్న తప్పులు, లోటుపాట్లను సవరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 22న అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట ధర్నా నిర్వహించాలని రాష్ట్రకార్యవర్గంలో నిర్ణయించారు.

పార్టీ నిర్మాణ మహాసభలు
పార్టీని గ్రామ శాఖలు మొదలుకుని మండల, జిల్లా, రాష్ట్ర కౌన్సిల్, కార్యవర్గం వరకు సంస్థాగతంగా బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర నాయకత్వం నిర్మాణ మహాసభలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో గ్రామ పార్టీల నిర్మాణ మహాసభలు జరుగుతున్నాయి. ఆగస్టులో మండలాలు, సెప్టెంబర్‌ కల్లా జిల్లా నిర్మాణ మహాసభలు పూర్తిచేయాలని నిర్ణయించింది. అక్టోబర్‌లో ఇతరత్రా ఏర్పాట్లను పూర్తిచేసుకుని నవంబర్‌ 24, 25, 26 తేదీల్లో మంచిర్యాలలో రాష్ట్ర నిర్మాణ మహాసభలను నిర్వహించాలని కార్యవర్గభేటీలో తీర్మానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement