అలుపెరుగని ప్రజా న్యాయవాది కంఠంనేని

అలుపెరుగని ప్రజా న్యాయవాది కంఠంనేని


‘జ్ఞానమనే పుస్తకంలో మొదటి అధ్యాయం నిజాయితీ’ అని ఒక సూక్తి. నిజాయితీ అనే జ్ఞానాన్ని జీవిత కాలమంతా ప్రదర్శించిన అరుదైన మాన వీయ వ్యక్తిత్వం కలవారు కంఠంనేని రవీంద్రరావు గారు. ఆయన 11.1.2015 ఆదివారం నాడు తన 79వ ఏట, తుదిశ్వాస విడిచారు. వారికి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్) ఉద్యమ నివాళులర్పిస్తోంది. 1975, మే 31న  నిర్మా ణ రూపం పొందిన నాటి నుండీ ఓపీడీఆర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, కృష్ణాజిల్లా శాఖకు బాధ్యు లుగా 20 ఏళ్లపాటు ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమంలో రవీంద్రరావు కృషి సల్పారు.

 

 14.3.1935న మోపిదేవి గ్రామంలో జన్మిం చిన కంఠంనేని, 1952లో అవనిగడ్డలో హైస్కూలు విద్యను పూర్తిచేసుకొని, బందరు హిందూ కళాశా లలో డిగ్రీని, విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాల యంలో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించారు. విద్యార్థి ఉద్యమ (స్టూడెంట్ ఫెడరేషన్) కార్యకలా పాల్లో  పాల్గొన్నారు. 1962లో అవనిగడ్డలో న్యాయ వాద వృత్తిని చేపట్టిన నాటి నుండీ పీడిత ప్రజల న్యాయవాదిగా ఆయన నిలిచారు.

 

 తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వేంకటేశ్వర రావు లాంటి ప్రముఖ విప్లవ కమ్యూనిస్టులపై, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కుట్రకేసును బనాయించినప్పుడూ, శ్రీకాకుళ గిరిజన, రైతాంగ ఉద్యమంపై ఒకవైపు క్రూర అణచివేతలకు మరొక వైపు బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడి నప్పుడూ, పోలీసుల చట్ట వ్యతిరేక అణచివేత విధానాలను అన్యాయాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలలో రవీం ద్రరావు పోరాడారు. ‘పార్వతీపురం కుట్రకేసు సహాయనిధి’కి విరాళాలు సేకరించి తోడ్పాటునందించారు. సాధారణ ప్రజలపై రోజు వారీగా సాగే అనేక రకాల చట్టవ్యతిరేక నిర్బం ధాలను న్యాయస్థానాలలో ప్రశ్నిస్తూ న్యాయం కోసం బాధితుల పక్షాన నిలిచారు.

 

 శ్రీకాకుళం గిరిజనోద్యమాన్ని అణచటానికి జరిపిన ‘బూటకపు ఎదురు కాల్పుల‘పై ఓపీడీఆర్ నియమించిన అఖిలభారత స్థాయి వాస్తవ సేకరణ కమిటీకి 1977-78లలో సహకరించి వారి నివేదిక వెలువడ్డానికి కృషి చేశారు.  1977 నవంబర్ 19న దివిసీమలో సంభవించిన భయంకర ఉప్పెన సందర్భంగా అనేకానేక ఈతిబాధ లకు గురైన ఆ ప్రాంత ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన రాష్ర్ట ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపు తూ, ఏర్పడిన ‘దివి తాలూకు తుపా ను బాధితుల సహాయ కేంద్రం’కు సమన్వయకర్తగా రవీంద్రరావుగారే వ్యవహరించారు.

 

 ఏనాడో 1926లో బ్రిటిష్ పాల కులు దక్షిణ చిరువోల్లంకలోని వడుగువారిపాలెం గ్రామస్థులకు లీజుకిచ్చిన 45 ఎకరాల భూమిని 1959లో చల్లపల్లి జమీందారు స్వాధీనపరుచు కుంటే 1978లో తిరిగి ఆక్రమించుకుని సాగు చేసు కోవటానికై సాగించిన పోరాటానికి, నైతిక చట్టబద్ధ మద్దతును సహకారాన్నీ అందించారు. కృష్ణా జిల్లా ఓపీడీఆర్‌లో ప్రముఖ సీనియర్ నేతలతో కలిసి పలు హక్కుల అణచివేత సంఘటనలపై, మమే కమై రవీంద్రరావు కృషి చేశారు. తన పార్థివ దేహం కూడా వైజ్ఞానిక అవసరాలకు, సామాజిక ప్రయోజ నాలకు తోడ్పడాలనే ఆయన సంకల్పం స్పూర్తి దాయకం. న్యాయవాద వృత్తిలో నిజాయితీని నిల బెట్టుకుంటూ, నైపుణ్య బలంతో రాణించటం కత్తి మీద సాములాంటిది. ఈ విషయంలో ‘జెంటిల్మన్ ఆఫ్ ది బెజవాడ బార్’గా రవీంద్రరావు ప్రశంసలు అందుకోవటం, ఆయన నిశ్శబ్ద ప్రజాతంత్ర జీవితా నికి కొసమెరుపులాంటిది.

 

 విద్యార్థి దశ నుంచీ అధ్యయన శీలి అయిన రవీంద్రరావు మార్క్సిస్టు తాత్త్విక, సిద్ధాంత, రాజ కీయ గ్రంథాలనే కాక ఉత్తమ సాహిత్యాన్ని కూడా నిరంతరాయంగా అధ్యయనం చేశారు. ఊసుపోని కబుర్లకూ, పనికిరాని కాలక్షేపానికీ ఆయన దూరం గా ఉన్నారు. స్నేహితులకు ప్రేమను, జూనియర్లకు జ్ఞానాన్ని పంచారు. న్యాయవాద వృత్తి, ఔన్నత్యా న్నీ  కాపాడారు. నిబద్ధ ప్రజాతంత్రవాదిగా చివరి వరకు జీవించిన, ఓపీడీఆర్ వ్యవస్థాపక సభ్యులు, నాయకులు అయిన కంఠంనేని రవీంద్రరావుకి ఇవే మా ఉద్యమ జోహార్లు.

 (నేడు విజయవాడ అమ్మ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు కంఠంనేని రవీంద్రరావు సంస్మరణ)

 - కె.ఏసు  రాష్ట్ర అధ్యక్షులు

 ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్),  విజయవాడ

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top