అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన బాలిక

Surat Fire Accident Class 10 Girl Saved in Massive Fire Says Did Not Panic - Sakshi

గాంధీనగర్‌ : సూరత్‌ కోచింగ్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో దాదాపు 20 మంది విద్యార్థులు మృతి చెందిన సంఘటన గురించి తెలిసిందే. ప్రాణాలు కాపాడుకునేందుకు విద్యార్థులు భవనం పై నుంచి దూకడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు అధికారులు. ఈ ప్రమాదంలో ఉర్మి హర్‌సుఖ్‌భాయ్‌ వెకారి అనే విద్యార్థిని సురక్షితంగా బయటడటమే కాక మరో స్టూడెంట్‌ని కూడా కాపాడింది.

ఈ క్రమంలో ప్రమాదం జరిగిన తీరు.. తాను బయటపడిన వివరాలు చెప్పుకొచ్చింది ఉర్మి. ‘పది రోజుల క్రితమే డ్రాయింగ్‌ క్లాసెస్‌ కోసమని నేను ఈ కోచింగ్‌ సెంటర్‌లో జాయిన్‌ అయ్యాను. ఇక్కడ దాదాపు 20 - 30 మంది దాక విద్యార్థులు డ్రాయింగ్‌ నేర్చుకోవడానికి వచ్చేవారు. భార్గవ్‌ సార్‌ మాకు పాఠాలు చెప్పేవారు. నిన్న ప్రమాదం జరిగినప్పుడు మా క్లాస్‌ రూంలో ఉన్నట్టుండి పొగ వ్యాపించింది. ఎవరైన పేపర్లు కాలుస్తున్నారేమో.. అనుకున్నాం. కానీ తర్వాత అగ్నిప్రమాదం సంభవించిందని తెలియడంతో.. విద్యార్థులు భయంతో పరుగులు తీస్తూ.. కిందకు దూకడం ప్రాంరంభించారు’ అని తెలిపింది.

అయితే ‘విద్యార్థులంతా పరిగెత్తుతుంటే.. నేను, నా స్నేహితురాలు మాత్రం భయపడకుండా అలానే ప్రశాంతంగా కూర్చున్నాం. క్షేమంగా బయటపడేందుకు మార్గం ఉందేమోనని చుట్టూ గమనించడం ప్రారంభించాము. ఇంతలో మా సార్‌ కిటికి పక్కన ఉన్న రెయిలింగ్‌ పట్టుకుని కిందకు దిగడం ప్రారంభించాడు. మేం కూడా ఆయన లానే రెయిలింగ్‌ పట్టుకుని కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నాం’ అని తెలిపింది. కోచింగ్‌ సెంటర్‌లో ఫైన్‌ ఆర్ట్స్‌ క్లాసులు నిర్వహిస్తున్నారని ఉర్మి తెలిపింది. నాటా లాంటి పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వడం కోసం విద్యార్థులు ఇక్కడ కోచింగ్‌ తీసుకుంటున్నారన్నది.

అంతేకాక బిల్డింగ్‌ పై నుంచి కిందకు దూకిన చిన్నారి.. అదే కోచింగ్‌ సెంటర్‌లో పని చేసే ఓ టీచర్‌ బిడ్డగా గుర్తించింది ఉర్మి. ‘టీచర్‌ తన పిల్లలను ఎప్పుడు కోచింగ్‌ సెంటర్‌కు తీసుకు వచ్చేవారు కాదు. కానీ దురదృష్టవశాత్తు నిన్న తీసుకు వచ్చారు. పాపం అగ్ని ప్రమాదం అని వినగానే ఆ చిన్నారి వెనక ముందు ఆలోచించకుండా కిందకు దూకేసింద’ని తెలిపింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై సర్థనా పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశామన్నారు. అయితే దీనిలో ఎవరి పేరు చేర్చలేదన్నారు. లోతుగా దర్యాప్తు జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

కాగా ఈ ఘటనపై స్పందించిన గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనపై లోతుగా విచారణ జరపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సంఘటనపై స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురయినట్లు తెలిపారు. (చదవండి : ఘోర అగ్నిప్రమాదం; 15 మంది విద్యార్థులు మృతి!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top