ఢిల్లీ అగ్ని ప్రమాదం: ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో గాయపడ్డ అగ్నిమాపక సిబ్బంది

Published Thu, Jan 2 2020 3:59 PM

One Fireman Dead In Peeragarhi Factory Fire In Delhi - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరిగిన అగ్ని ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే మంటలను ఆర్పివేసే సమయంలో 13 మంది అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. గురువారం ఉదయం పీరాగర్హిలోని బ్యాటరీ ఫ్యాక్టరీ భవనంలో ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ గోడలు కూలిపోయాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు 35 ఫైర్‌ ఇంజన్లతో సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రమాదాలను అదుపు చేసే సమయంలో మరోసారి పేలుళ్లు సంభవించడంతో భవనం కుప్పకూలిపోయింది. దీంతో అక్కడే మంటలను ఆర్పుతున్న 13 మంది అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.

ఈ ప్రమాదంలో అగ్నిమాపక దళానికి చెందిన ఓ వ్యక్తి మరణించగా మిగతావాళ్లు గాయాలతో బయటపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ‘బాధాకర విషయం. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాను. అగ్నిమాపక సిబ్బంది తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 13 మంది అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డార’ని ఆయన ట్వీట్‌ చేశారు. అనంతరం మరో ట్వీట్‌లో ఒక వ్యక్తి మరణించారని ధృవీకరించారు. ఇక ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ, హోం మంత్రి సత్యేందర్‌ జైన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సంఘటనా స్థలంలో సుమారు 9 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

చదవండి: ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం

Advertisement
Advertisement