
మోదీతో కరచాలనం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (ఫైల్ ఫొటో)
నేపాల్ భూకంపం విలయంలో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను కాపాడినందుకుగానూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు.. భారత ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు.
నేపాల్ భూకంపం విలయంలో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను కాపాడినందుకుగానూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు.. భారత ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. నేపాల్ పర్యటనలో ఉన్న దాదాపు 200 మంది ఇజ్రాయెలీలను కాపాడటమేగాక, ఆ దేశ సహాయక విమానాలకు ల్యాండింగ్ అనుమతి ఇచ్చినందుకు నెతన్యాహు ఫోన్లో ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పారని, ఈ విషయంలో మోదీ అంచిన సహకారం ఎన్నటికీ మర్చిపోలేమని వ్యాఖ్యానించినట్లు శుక్రవారం ఒక అధికారిక ప్రకటన వెలువడింది.
నేపాల్ నుంచి హెలికాప్టర్ల ద్వారా భారత్కు తరలించిన అనంతరం 200 మంది ఇజ్రాయెలీలు తమ సొంత దేశానికి వెళ్లారు. అయితే ఇంకా కొద్దిమంది నేపాల్ లోనే చిక్కుకుపోయారని తెలిసింది. మోదీని ఇజ్రాయెల్ పర్యటనకు ఆహ్వానించాలనుకుంటున్నట్లు ప్రస్తుతం ఆ దేశంలో పర్యటిస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో అక్కడి అధికారులు అన్నట్లు సమాచారం.