ట్విస్ట్‌ : ఆ లేఖ ఏంటో కూడా తెలియదు!

Former Army And Air Force Chief Twist On Letter To President Over leaders Using Military Name Poll - Sakshi

న్యూఢిల్లీ : భారత సాయుధ బలగాల త్యాగాలను రాజకీయం చేస్తున్నారంటూ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుకు చెందిన 150 మందికి పైగా రిటైర్డ్ ఆఫీసర్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాసినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ‘ఫ్రమ్‌ గ్రూప్‌ ఆఫ్‌ వెటరన్స్‌ టు అవర్‌ సుప్రీం కమాండర్‌’ పేరిట పలువురు మాజీ అధికారులు త్రివిధ దళాధిపతికి రాసిన లేఖ పలు చానళ్లలో దర్శనమిచ్చింది. అయితే తమకు ఎటువంటి లేఖ అందలేదని ఇప్పటికే రాష్ట్రపతి భవన్‌ వర్గాలు వెల్లడించగా.. కొంతమంది మాజీ అధికారులు కూడా ఈ విషయాన్ని ఖండించారు. రాష్ట్రపతికి రాసినట్లుగా రాసిన ఈ లేఖపై తొలి సంతకం చేసినట్లుగా భావిస్తున్న ఆర్మీ మాజీ చీఫ్‌ సునీత్‌ ఫ్రాన్సిస్‌ రోడ్రిగస్, ఎయిర్‌ఫోర్స్‌ మాజీ చీఫ్‌ ఎన్సీ సూరి వివరణ ఇచ్చారు.

ఈ విషయం గురించి సునీత్‌ ఫ్రాన్సిస్‌ రోడ్రిగస్ మాట్లాడుతూ...‘ అసలు ఆ లేఖ ఏంటో కూడా తెలియదు. నా జీవిత కాలమంతా రాజకీయాలకు దూరంగా ఉన్నా. 42 ఏళ్ల పాటు సైనికుడిగా ఉన్న నేను భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నించాను. కానీ ఇలాంటి నకిలీ వార్తలు సృష్టించడానికి వ్యక్తులు ఎక్కడి నుంచి పుట్టుకువస్తారో అర్థం కావడం లేదు. నేను సంతకం చేయలేదు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక ఎన్సీ సూరి కూడా ఈ లేఖను ఖండిస్తూ.. ‘ ఇది అడ్మిరల్‌ రామ్‌దాస్‌ లెటర్‌ కానేకాదు. మేజర్‌ చౌదరి లేఖ రాసినట్లుగా వాట్సాప్‌, ఇమెయిల్స్‌ వస్తున్నాయి. నా అనుమతి లేకుండా నా పేరు ఎలా ఉపయోగిస్తారు. దీంతో నేను అంగీకరించడం లేదు’ అని వివరణ ఇచ్చారు.

కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారత సైన్యాన్ని ‘మోదీ సేన’ గా అభివర్ణిస్తూ ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రధాని మోదీ ఈనెల 9న మహారాష్ట్రలోని లాతూర్‌లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు బాలాకోట్‌లో వైమానిక దాడులు జరిపిన వారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సైనికుల బలిదానాలను రాజకీయ పార్టీలు, నాయకులు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ..మాజీ అధికారులు లేఖ రాసినట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top