ఈనెల 17లోగా 6 కీలక తీర్పులు!

CJI Ranjan Gogoi has 10 days and 6 judgments to deliver - Sakshi

17న సీజేఐ జస్టిస్‌ గొగోయ్‌ పదవీ విరమణ

అయోధ్య, రఫేల్, శబరిమల తదితర ముఖ్య కేసులు

న్యూఢిల్లీ: ముస్లిం మహిళల స్వేచ్ఛను హరించి వేస్తోన్న ట్రిపుల్‌ తలాక్‌ రద్దు మొదలుకొని సామాజిక అసమానతలు వేళ్లూనుకొన్న అనేక అంశాల్లో చారిత్రక, సంచలన తీర్పులిచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఈనెల 17న పదవీ విరమణ చేయబోతున్నారు. అయితే ఆయన పదవీ విరమణకు మిగిలి ఉన్న ఈ పది రోజుల్లో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అత్యంత కీలకమైన తీర్పులిచ్చే అవకాశముంది. అందులో యావత్‌ భారత దేశం కొన్ని దశాబ్దాలుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న రామజన్మభూమి–బాబ్రీ మసీదు కేసు కీలకమైనది. దీంతోపాటు రాజకీయపరమైన, రక్షణకు సంబంధించిన, ఆర్థికపరమైన కేసుల్లో ధర్మాసనం తీర్పులను ఆవిష్కరించబోతోంది.  

రామజన్మభూమి–బాబ్రీ మసీదు
దశాబ్దాలుగా దేశంలో ఎన్నో భావోద్వేగాలకు కారణమైన, ఎన్నెన్నో ఉద్రిక్తతలకు దారితీసిన, మరెన్నో వివాదాలకు తెరలేపిన రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదం ప్రధానమైనది. 70 ఏళ్ళుగా ఉన్న ఈ కేసులో జస్టిస్‌ గొగోయ్‌ సారథ్యంలోని బెంచ్‌ ఈ కీలక తీర్పుని వెలువరించనుంది. 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ హిందు, ముస్లిం వర్గాలు దాఖలు అప్పీలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు 40 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు వినింది.

శబరిమలలోకి మహిళల ప్రవేశం
వయోపరిమితులకు అతీతంగా మహిళలందరినీ శబరిమల ఆలయంలోకి అనుమతించే అంశంలో రివ్యూ పిటిషన్‌పై తుదితీర్పును సైతం చీఫ్‌ జస్టిస్‌ గొగోయ్‌ రిజర్వులో ఉంచారు. కేరళలోని శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018 నాటి  తీర్పును జస్టిస్‌ గొగోయ్‌ సారథ్యంలోని ధర్మాసనం కొనసాగిస్తుందా? లేదా అన్నది ఈ వారంలో తేలనుంది.   

రఫేల్‌ ఒప్పందం...
రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై  దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై తీర్పుని సుప్రీంకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. 36 యుద్దవిమానాల అవినీతి ఒప్పందానికి సంబంధించి పిటిషనర్లు గత ఏడాది అక్టోబర్‌లో దాఖలు చేసిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో సీబీఐ ఎందుకు విఫలమైందనేది ఈ కేసు విచారణ సందర్భంగా తలెత్తిన ప్రధాన వివాదాంశం. డిసెంబర్‌ 14, 2018లో ఈ ఒప్పందాన్ని సమర్థిçస్తూ తీర్పునివ్వడానికి ప్రభుత్వం కోర్టుని తప్పుదోవ పట్టించడమే కారణమని రివ్యూ పిటిషన్‌ ఆరోపించింది.  

చౌకీదార్‌ చోర్‌హై వివాదం
మే 10న సీజేఐ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై బీజేపీ నాయకురాలు మీనాక్షి లేఖీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ కేసులో చౌకీదార్‌ చోర్‌హై అనే పదబంధాన్ని తప్పుగా ఆపాదించినందుకు కోర్టుకి రాహుల్‌ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ కేసులో తుది తీర్పు ఇదే వారంలో వచ్చే అవకాశముంది.

ఆర్థిక చట్టం రాజ్యాంగ బద్దత
2017 ఆర్థిక చట్టం యొక్క రాజ్యాంగబద్దమైన ప్రామాణికతను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌పై అంతిమ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో పెట్టింది. ఈ వివాదంపై సైతం గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పుని ఇదే వారంలో ఇచ్చే అవకాశముంది.  

ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం పరిధిలోకి వస్తుందా లేదా అన్న అంశంపై దాఖలైన పిటిషన్‌పై ఏప్రిల్‌ 4న వాదనల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది. సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్‌ 2(హెచ్‌) ప్రకారం చీఫ్‌ జస్టిస్‌ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010, జనవరిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top