ఆర్థికమంత్రి వ్యాఖ్యలు : నెటిజనుల దుమారం

BoycottMillennials Trends After FM Comment - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఆటో మొబైల్ రంగం రోజు రోజుకు సంక్షోభంలోకి జారుకోవడంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కొత్త వాదన తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆటోరంగం మందగమనానికి యువత ఒక కారణమని, ఈ రోజుల్లో యువత ఓలా, ఉబెర్ లాంటి క్యాబ్స్‌ ను ఆశ్రయిస్తున్నారని, సొంతకార్లవైపు మొగ్గు చూపడం లేదని, ఈఎంఐ భారం మోసేందుకు ఇష్టపడటం లేదని, మిలీనియల్స్(యువత) క్యాబ్స్‌లపై ఆసక్తి చూపడంతో ఆటోమొబైల్ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోందన్నారు. దీంతో సోషల్ మీడియాలో సేఇట్‌ సీతారామన్‌తాయి లైక్‌, బాయ్‌కాట్ మిలీనియల్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లు దుమారం రేపుతున్నాయి.  

ఆర్థికమంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. యువతకు పానీ పూరీ ఇష్టం...అందుకే బీహెచ్‌ఈఎల్‌ 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందంటూ బాయ్‌కాట్ మిలీనియల్స్ ట్రెండ్స్ హల్‌ చల్‌ చేస్తున్నాయి. అంతేకాదు నిజమే..సొంత వాహనం ఉంటే డబ్బుల దండగ. డబ్బుని మిగిలించుకోవాలి కదా అనే కమెంట్స్‌ చేస్తున్నారు. పనిలో పనిగా కొత్త మోటారు సవరణ చట్టంపై కూడా సెటైర్లు పేలుతున్నాయి.  డ్రైవింగ్ టెన్షన్స్,  నిబంధనల ఉల్లంఘనల చలాన్లు,  పార్కింగ్ ఇబ్బందులు ఉండవు. అందుకే వాహనాలు కొనుగోలు చేయటం లేదంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం విశేషం.  

నిరుద్యోగులు ఉద్యోగం చేసేందుకు ఇష్టపడకపోవడం వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. డాలర్‌ను ప్రిఫర్ చేయడం వల్లే రూపాయి విలువ పడిపోతోంది. ‘రోడ్లు బాగా లేవు అందుకే లారీల విక్రయాలు పడిపోయాయి. అంతేకదా మంత్రి గారు’. ప్రతీదానికి యువతనెందుకు ఆడిపోసుకుంటారు...ఇలా ఒకటి కాదు రెండుకాదు, సీతారామన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో  అప్రతిహతంగా పంచ్ లు పేలుతున్నాయి..

కాగా  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 100 రోజుల పాలనముగింపు సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆటో రంగం మందగించడం వెనుక ఒక ప్రధాన అంశం మిలీనియల్స్ మనస్తత్వం మారడమే అని పేర్కొన్నారు. బీఎస్6 ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ రుసుము అంశాలతోపాటు యువత ఎక్కువగా క్యాబ్, మెట్రో రైళ్లపై ఆధారపడుతుండటం కూడా ఆటోమొబైల్ రంగంలో మందగమనానికి కారణమని  వ్యాఖ్యానించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు,లారీల విక్రయాలు ఇటీవల రికార్డు స్థాయిలో క్షీణించిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆటోమొబైల్ రంగంలో ఈ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

మరోవైపు మారుతీ సుజుకీ, అశోక్ లేలాండ్ లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తమ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడంతో తమ ఫ్లాంట్లను తాత్కాలికంగా మూసివేశాయి. అశోక్‌ లేలాండ్‌ అయిదు ప్లాంట్లలో 16 రోజుల పాటు  తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి  విషయం తెలిసిందే.

చదవండి : పెట్టుబడులపై టాస్క్‌ఫోర్స్‌ దృష్టి..

దారుణంగా పడిపోయిన అమ్మకాలు : మరింత సంక్షోభం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top