రక్తస్రావానికి అడ్డుకట్ట.. వైద్యుల అద్భుత శోధన

new treatment to prevent bleeding in certain patients with hemophilia - Sakshi

అమెరికా, బ్రిటన్‌ వైద్యుల ఘనత

జీన్‌ థెరపీ ద్వారా వ్యాధిగ్రస్థులకు చికిత్స

హీమోఫీలియా బాధితులకు ఊరట

తెలుగు రాష్ట్రాల్లో 20 వేల మంది బాధితులు

ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల్లో ఫాక్టార్‌ ఇంజక్షన్ల కొరత

సాక్షి, అమరావతి: హీమోఫీలియా (నిరంతర రక్తస్రావం) వ్యాధికి అద్భుత చికిత్స ఆవిష్కృతమైంది. చిన్న గాయమైనా చాలు నిరంతర రక్తస్రావంతో బాధపడే రోగులకు తీపివార్త ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఈ జబ్బుతో బాధపడుతున్న లక్షలాది మంది బాధితులకు ఈ పరిశోధన ధైర్యాన్నిచ్చింది. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ హిమటాలజీ, యూనివర్శిటీ ఆఫ్‌ పిట్స్‌బర్గ్, రాయల్‌ కాలేజీ ఆఫ్‌ లండన్, ఫిలడెల్ఫియా చిల్డ్రన్‌ హాస్పిట్‌ వైద్యులు డా.లిండ్సే జార్జ్, కార్నెల్‌ మెడికల్‌ కాలేజీ వైద్యులు డా.రొనాల్డ్‌ జి క్రిస్టల్‌ తదితర వైద్య బృందాలు కొన్నేళ్లుగా జరిపిన అద్భుత పరిశోధన ఫలితాలే ఇవి అని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై నిరంతరంగా జరిగిన పరిశోధనలు సత్ఫలితాలనివ్వడమే కాదు, వైద్యపరిశోధనలకు బైబిల్‌గా చెప్పుకునే ‘న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’ పరిశోధనా పత్రాల్లోనూ ఈ చికిత్స ఫలితాలు ప్రచురితమయ్యాయి.

జీన్‌ థెరపీతో చికిత్స...
హీమోఫీలియా వ్యాధి ఉన్న వారికి చిన్న గాయమైనా రక్తస్రావం ఆగదు. ఈ వ్యాధి బాధితులు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. పళ్లు తోముకునేటప్పుడు బ్రష్‌ వల్ల చిన్న గాటు ఏర్పడినా గంటల తరబడి రక్తం కారుతూనే ఉంటుంది. రక్తం గడ్డకట్టే అవకాశం ఉండదు. వీరిలో ఫాక్టార్‌–8, ఫాక్టార్‌–9 అనే ప్రొటీన్ల లోపం కారణంగా ఇలా నిరంతర రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఇప్పటివరకూ ఫాక్టార్‌8, ఫాక్టార్‌ 9 ఇంజక్షన్లతో బాధితులు చికిత్స తీసుకునే వారు. ఈ ఇంజక్షన్‌ ధర ఒక్కొక్కటి రూ.30 వేల నుంచి రూ.40వేల వరకూ ఉంటుంది. ఇది కూడా తాత్కాలిక చికిత్సే. దీనికి అమెరికా, బ్రిటన్‌కు చెందిన వైద్యులు జీన్‌ థెరపీ పేరుతో శాశ్వత పరిష్కారాన్ని కనుగొ న్నారు. హీమోఫీలియా రెండు రకాలుగా ఉంటుంది. హీమోఫీలి యా ఎ, హీమోఫీలియా బి అనేవి. చికిత్సలో భాగంగా ఆరోగ్యవంతుడి నుంచి ఫాక్టార్‌ 9 ప్రొటీన్‌ కణాలను తీసుకుని ఒక వైరస్‌ (మనిషికి హానిచేయని–మోడిఫై చేసిన ఎడెనా అసోసియేటెడ్‌ వైరల్‌) నుంచి వ్యాధిగ్రస్థుడి కాలేయంలోని కణాల్లోకి ఎక్కిస్తారు. వాస్తవానికి ఫాక్టార్‌ 9 ప్రొటీన్‌లను కాలేయంలోని కణాలే ఉత్పత్తి చేస్తాయి. కృత్రిమంగా వైరస్‌ ద్వారా ఎక్కించిన ఈ కణాలు కాలేయంలోని కణాలను ప్రేరేపించి రక్తం గడ్డకట్టే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తాయి. పలువురు రోగులకు ఈ పరీక్షలు చేసిన అనంతరం ఫలితాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరిశోధనలో వారం నుంచి 6 నెలల వరకూ ఈ కణాల ఉత్పత్తి, పనితీరు పరీక్షించగా ఆశించిన రీతిలో పనిచేస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. త్వరలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని, తక్కువ వ్యయంతో శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాధితులు భారీగానే...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సుమారు 20 వేల మందికి పైగానే హీమోఫీలియా బాధితులు ఉన్నట్టు తేలింది. వీళ్లందరూ ప్రస్తుతం ఫాక్టార్‌ ఇం జక్షన్లతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఖరీదైన ఇంజక్షన్లు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఒక్కోసారి వీటికి కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వాలు కూడా హీమోఫీలియా బాధితుల ఇంజక్షన్ల కొనుగోలుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జన్యుపరమైన కారణాలు లేదా వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధికి అయ్యే వ్యయాన్ని ప్రభుత్వాలు తీవ్ర భారంగా పరిగణిస్తుండటంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఒక్కోసారి ప్రభుత్వాస్పత్రుల్లో ఇంజక్షన్లు లేకపోవడంతో బయట మెడికల్‌ స్టోర్లలో కొనుగోలు చేసి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

రాయల్‌ డిసీజ్‌గా గుర్తింపు...
ఈ జబ్బు రాయల్‌ డిసీజ్‌గా గుర్తింపు పొందింది. ఎందుకంటే ఇంగ్లండ్, జర్మనీ, రష్యా, స్పెయిన్‌ వంటి దేశాల్లో రాచరిక వ్యవస్థ ఉండేది. రాచరిక వంశస్థులనే ఎక్కువగా పెళ్లాడేవారు. దీంతో వారసత్వంగా ఈ జబ్బు వచ్చేది. 1837–1901 మధ్య కాలంలో ఉన్న ఇంగ్లండ్‌ రాణి క్వీన్‌ విక్టోరియాకు ఈ జబ్బు వచ్చింది. రాచరిక వ్యవస్థలో ఎక్కువమందికి వచ్చేది. అందుకే దీన్ని ‘రాయల్‌ డిసీజ్‌’గా వైద్యులు చెప్పుకుంటారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top