పెంపుడు కుక్కలపై 50 లక్షల కోట్ల ఖర్చు!

How Much Americans Spend on Their Dogs - Sakshi

న్యూఢిల్లీ : పెంపుడు కుక్కల విలువెంత? అని తెలివైన వారిని అడిగితే ఏమంటారు? వెలలేని అంత లేదా అమూల్యం అంటారు! మార్కెట్లో వాటి కొనుగోలు రేట్లడిగితే అందరు కాకపోయినా కొందరైతే చెబుతారు. వాటి జీవితం విలువను డబ్బుల్లో అంచనా వేస్తే ఎంత ? అప్పుడు వాటి కొన్న రేటునే కాకుండా వాటి ఆహారానికి, మందులకు ఎంత ఖర్చు పెడుతున్నారు? అవి ఎంత కాలం జీవిస్తున్నాయి? అన్న అంశాల ఆధారంగా వాటి జీవితాల విలువను ఆర్థికంగా అంచనా వేయవచ్చు. అయితే ఈ విలువ దేశాలనుబట్టి, ప్రాంతాలనుబట్టి మారిపోయే అవకాశం ఉంది.
 
పెంపుడు కుక్కలకు అధిక ప్రాధాన్యమిస్తోన్న అమెరికాలో వాటిపై ఎటా 70 బిలియన్‌ డాలర్లు (దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు పెడుతున్నారు. అదే అమెరికన్లు పిజ్జాలపై ఏటా 32 బిలియన్‌ డాలర్లు (దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు), చట్టబద్ధంగా దొరికే గంజాయి కోసం వారు ఏడు బిలియన్‌ డాలర్లు (దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు) చేస్తున్నారు. పెంపుడు కుక్కల కోసం ఖర్చు చేస్తున్న మొత్తంలో ఎప్పటికప్పుడు పెంపుడు కుక్కలకు యాంటి వైరస్‌ ఇంజెక్షన్ల ఇవ్వడానికి వెటర్నరీ డాక్టర్లకు మొత్తం 20 బిలియన్‌ డాలర్లు (14.5 లక్షల కోట్ల రూపాయలు), ఇతర మందుల కోసం 16 లక్షల డాలర్లు (11.5 లక్షల కోట్ల రూపాయలు), వాటి ఆహారం కోసం 32 బిలియన్‌ డాలర్లు (దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేస్తున్నారు.

పెంపుడు కుక్కల యజమానుల ఇంటింటి తిరగడంతోపాటు, వెటర్నరీ డాక్టర్లను సంప్రతించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ అంచనాలను రూపొందించారు. వీటి ఆధారంగా సరాసరి ఓ పెంపుడు కుక్క జీవితం విలువను పదివేల డాలర్లు (దాదాపు 7.25 లక్షల రూపాయలు)గా నిర్ధారించారు. ఏటా అమెరికాలో రోడ్డు ప్రమాదాల కారణంగా పది లక్షల పెంపుడు కుక్కలు మరణిస్తున్నాయి. పెంపుడు కుక్కల కోసం వాటి యజమానులు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినప్పుడు అతి తక్కువగా నష్ట పరిహారం అభిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్‌లో ప్రస్తుతం పెంపుడు కుక్కల ధర ఎంత ఉందో అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే నష్ట పరిహారం చెల్లిస్తున్నారని, వాటి మందులకు, ఆహారానికి అవుతున్న ఖర్చును పరిగణలోకి తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక యజమానులతో పెంపుడు కుక్కలకున్న అనుబంధాన్ని, ఆత్మీయతను ఎలా వెలగడతారని వారు ప్రశ్నించారు.

పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్శిటీలోని పబ్లిక్‌ పాలసీ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సైమన్‌ ఎఫ్‌ హీడర్, ఓక్లహామ యూనివర్శిటీలోని పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ డెవెన్‌ కార్ల్‌సన్, అదే యూనివర్శిటీ రీసర్చ్‌ విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్‌ జో రిప్‌బెర్గర్‌లు సంయుక్త ఈ అధ్యయనం చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top