సూర్యుడు తెడ్డేస్తాడు.. వాయుదేవుడూ ఓ చెయ్యేస్తాడు! | france engineers design solar aeroplane | Sakshi
Sakshi News home page

సూర్యుడు తెడ్డేస్తాడు.. వాయుదేవుడూ ఓ చెయ్యేస్తాడు!

Sep 21 2016 3:24 AM | Updated on Sep 4 2017 2:16 PM

సూర్యుడు తెడ్డేస్తాడు.. వాయుదేవుడూ ఓ చెయ్యేస్తాడు!

సూర్యుడు తెడ్డేస్తాడు.. వాయుదేవుడూ ఓ చెయ్యేస్తాడు!

ఈ మధ్య ఓ బుల్లి విమానం... భూమిని చుట్టేసింది. ఇందులో గొప్పేమీ లేదుగానీ... దాని పొడవాటి రెక్కల నిండా సోలార్ ప్యానెల్స్ ఉండటంతో సౌరశక్తితో భూమిని చుట్టేసిన విమానంగా ‘సోలార్ ఇంపల్స్’ రికార్డు సృష్టించింది.

ఈ మధ్య ఓ బుల్లి విమానం... భూమిని చుట్టేసింది. ఇందులో గొప్పేమీ లేదుగానీ... దాని పొడవాటి రెక్కల నిండా సోలార్ ప్యానెల్స్ ఉండటంతో సౌరశక్తితో భూమిని చుట్టేసిన విమానంగా ‘సోలార్ ఇంపల్స్’ రికార్డు సృష్టించింది. ఇదంతా ఇప్పుడెందుకు అంటే పక్కనున్న ఫొటోలు చూడండి. సోలార్ ఇంపల్స్ గాల్లో చేసిన ఫీట్‌ను సముద్రంపై రిపీట్ చేసేందుకు సిద్ధమవుతున్న పడవ ఇది. పేరు ‘ఎనర్జీ అబ్జర్వర్’. అయితే ఈ రెండింటి మధ్య ఇంకో స్పష్టమైన తేడా ఏమిటంటే.. విమానం కేవలం సూర్యుడిపై మాత్రమే ఆధారపడింది. పడవ మాత్రం సౌరశక్తితోపాటు, సముద్రాలపై వీచే బలమైన గాలులను, నీటిని విడగొట్టడం ద్వారా పుట్టే హైడ్రోజన్‌ను కూడా ఇంధనంగా వాడుకోనుంది. ఫ్రాన్స్‌కు చెందిన రెండు కంపెనీలు దీన్ని ప్రపంచయాత్రకు సిద్ధం చేస్తున్నాయి. 
 
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలుపెట్టి దాదాపు ఆరేళ్ల సమయంలో ఇది సముద్రపు అలలపై భూమిని చుట్టేయనుంది. మొత్తం 30 మీటర్ల పొడవు, 12.80 మీటర్ల వెడల్పు ఉండే ఈ పడవపై దాదాపు 130 చదరపు మీటర్ల వైశాల్యంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు ఈ పడవలో రెండు వర్టికల్ యాక్సిస్ (నిట్టనిలువుగా తిరిగేవి) విండ్ టర్బయిన్లు, నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్‌లుగా విడగొట్టేందుకు అవసరమైన ఎలక్ట్రాలసిస్ పరికరాలు ఉంటాయి. హైడ్రోజన్‌ను ఫ్యుయెల్‌సెల్స్‌లోకి పంపి విద్యుత్తును ఉత్పత్తి చేసి బ్యాటరీల్లో నిక్షిప్తం చేస్తారు. 
 
సోలార్ ప్యానెల్స్, టర్బయిన్ల ద్వారా వచ్చే విద్యుత్తు కూడా దీనికి చేరి పడవ ముందుకు దూసుకెళుతుందన్నమాట. ఎండ, గాలి లేనప్పుడు హైడ్రోజన్‌తో ఉత్పత్తయిన విద్యుత్తును వాడుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాలు, 101 నౌకాశ్రయాలను చుట్టేస్తుంది ఈ ఎనర్జీ అబ్జర్వర్. దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్రాన్స్‌లో నిర్మాణమవుతున్న ‘ఎనర్జీ అబ్జర్వర్’ ద్వారా నేర్చుకున్న విషయాలు సంప్రదాయేతర ఇంధన వనరుల సుస్థిర, సమర్థ వాడకానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement