ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు

ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు - Sakshi


చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్సార్‌సీపీ నేత తమ్మినేని

 

 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు  ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం దురదృష్టకరమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం మండిపడ్డారు. విభజన చట్టాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వాటిని ముఖ్యమంత్రి ఎందుకు అడగలేక పోతున్నారని, తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎందుకు తాకట్టు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆడియో సహితంగా దొరికి పోయిన చంద్రబాబు ఆ కేసు నుంచి బయట పడటానికే రాష్ట్రం ప్రయోజనాల గురించి గట్టిగా అడగలేక పోతున్నారని సీతారాం వివరించారు.  రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకోవడానికి చంద్రబాబు కేంద్రంపై పోరాడలేక పోతున్నారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు, బీజేపీని కలుపుకొని అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, తద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని సూచించారు.   శ్వేతపత్రం ప్రకటించండి

 ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారని బాబును తమ్మినేని ప్రశ్నించారు. ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లారో, ఎన్ని నిధులు సాధించారో ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రూ. 2,000 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం తీసుకుంటే.. ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకుని రూ. 900 కోట్లే, అది కూడా యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇస్తేనే విడుదల చేయండి అని ఆదేశించిందంటే కేంద్రం చంద్రబాబును అసలు నమ్మడం లేదనేది స్పష్టం అవుతోందన్నారు.   అసెంబ్లీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తూలనాడే అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర నుంచి టీడీపీలో చేరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని, అపుడు జగన్ మగత నం ఏమిటో చూపిస్తారని, తన సవాలును స్వీకరించాలని సీతారాం డిమాండ్ చేశారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top