మన సమైక్యతే కరోనాకు కొరడా!

ABK Prasad Writes Guest Column About Actions Taking On CoronaVirus  - Sakshi

రెండో మాట 

‘భారత్‌లో వైరస్‌ వ్యాధుల నివారణకు అవసరమైన పరీక్షా పరికరాలు, పద్ధతులు ఇప్పటికీ లేకపోవడం విచారించదగ్గ విషయం. మన దేశ జనాభాలో ప్రతి పది లక్షలమందిలో కేవలం పదిశాతం మందినే పరీక్షించగల్గుతున్నాం. థాయ్‌లాండ్‌లో ప్రతి పది లక్షలమందిలో 120 మందికి ఈ పరీక్షలు జరుగుతాయి. అలాగే వియత్నాంలో పది లక్షలమందిలో 40 మందికి పరీక్షలు నిర్వహిస్తారు. మన దేశంలో పరీక్షలు అవసరమైన సందర్భాల్లో మాత్రమే పరిమితమైన పరీక్షా పరికరాలను వాడకానికి ఉంచామన్నది సమాధానం.

అలాంటి అవసరం నేడు కరోనా లాంటి మహమ్మారి వ్యాధుల నివారణ సందర్భంగా ఉందా లేదా ? ఇంతకన్నా జరూరైన అవసరం ఏముంటుంది? ఉన్న పరిమిత పరీక్షా పరికరాలు నేటి ఉపద్రవానికి సరిపడా లేవు. అనేక దేశాలు ఈ రోజు ఈ కొరతలో ఉన్నాయి. అందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ గెబ్రియాసస్‌ ఇబ్బడిముబ్బడిగా ఈ టెస్టింగ్‌ పరికరాల అవసరాన్ని నొక్కి చెబుతూ ‘నీవు ఎదుర్కోదలిచిన మంటల్ని కళ్లు మూసుకుని ఎదుర్కోలేవుసుమా’ అని హెచ్చరించాల్సి వచ్చింది’
– రోగ నిర్ధారణ శాస్త్ర అధ్యయన కేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌
రమణన్‌ లక్ష్మీనారాయణన్, హెల్త్‌కేర్‌ (19.03.20)

నేడు ప్రపంచవ్యాపితంగా కరోనా వ్యాధి సోకిన వారి సంఖ్య మూడు లక్షలకు చేరుకుని మన దేశంతో సహా 160 దేశాలలో ఆత్యయిక పరిస్థితులు(లాక్‌డౌన్స్‌) ప్రకటించుకోవలసిన దుస్థితి దాపురించింది. కాగా, ఈ వ్యాధి పుట్టి పెరిగిన చైనాలో విదేశీ యాత్రికుల ద్వారా సోకినా కరోనా మహమ్మారి కాస్తా 3,270 మంది చైనీయుల్ని మింగేసిన తరువాత అక్కడి ప్రభుత్వం సత్వర జాగ్రత్తలు తీసుకుంది. సరికొత్త ‘ప్లాస్మా’ ఇంజెక్షన్స్‌ ప్రయోగించి, ఇప్పుడు కరోనా పూర్తి అదుపులోకి వచ్చినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో మేల్కొని టెస్టింగ్‌ పరికరాల తీవ్ర కొరత మధ్యనే వీలైనంత వేగంగా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటున్నాయి. 

విదేశాల నుంచి వచ్చినవారిలో అన్ని వయసులవారినీ క్వారంటైన్‌ చేసి పరీక్షల అనంతరం గానీ పంపించడం లేదు. ఇదే సందర్భంగా మనం మన క్షమించరాని అశ్రద్ధవల్ల, అవసరాల పేరిట కలగజేస్తున్న చేటువల్ల వాతావరణం ఎలా నాశనమవుతున్నదో ప్రపంచ శాస్త్రవేత్తలు, వాతావరణ పరిశోధకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మన కళ్లముందే జరుగుతున్న వినాశనాన్ని, మానవాళికి జరుగుతున్న ముప్పునూ కాళ్లూ చేతులూ కాలేదాకా మనం గ్రహించలేదు. సరిగదా శాస్త్రీయ పరిజ్ఞానానికి, అఖండ విజయాలకు దోహదం చేసిన, చేస్తున్న సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలయిన ఐన్‌స్టీన్, స్టీఫెన్‌ హాకింగ్‌లాంటివారిని న్యూనత పరిచి, ఎగతాళి చేస్తున్నారు. విజ్ఞాన శాస్త్ర విజయాలను మూఢవిశ్వాసాలతో అవమానపరుస్తున్నారు. ఇలాంటి పాలకులు ఎక్కడున్నా నిరసించవలసిందే. ప్రతిఘటించవలసిందే!

మానవాళికి అతిభయంకరమైన విపత్తు
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, విజ్ఞాన  శాస్త్ర పరిశోధకులు పదే పదే చేస్తున్న హెచ్చరికను మనం విస్మరించరాదు. ‘ప్రపంచంలో భూమిని ఢీకొన్న ఉల్కాపాతం(యాస్టరాయిడ్‌), అణ్వస్త్ర యుద్ధానికి మధ్యకాలంలో మానవ జాతి వినాశనానికి దోహదం చేసిన విపత్కర పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. మానవాళి ఎదుర్కొన్న విపత్తుల్లోకెల్లా భయంకర వ్యాధి క్రిమి(వైరస్‌) వ్యాప్తి. ఈ విషయమై అనేక సమావేశాలు జరిపి సర్వసన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వాలను హెచ్చరించామ’ని బాధ్యతగల వైరస్‌ శాస్త్రవేత్తలు చెప్పిన సంగతి మరిచిపోరాదు! అంతేగాదు. శత్రువుకి భయపడి ఎదుర్కోలేమని, ‘సార్స్‌’, ‘కరోనా’ లాంటి తక్షణం చిత్తగించలేని కరోనా వ్యాధుల సందర్భంగా ప్రజ లంతా, మానవాళి యావత్తూ సామూహికంగా సోదరత్వం, ఆత్మీయ సంఘీభావంతో ఒకరికొకరు తోడుగా, నీడగా నిలబడాల్సిన అవసరం మరింతగా ఉందని గ్రహించాం.

బహుశా అందుకనే ‘కరోనా’ మహమ్మారిని చైనా ఎదుర్కొని పరిష్కరించుకున్న తీరుతెన్నుల గురించి అధ్యయనం చేసేందుకు యూరప్, అమెరికాల నుంచి వైద్య నిపుణులు కొందరిని చైనాకు పంపించినట్టు వార్తాసంస్థల తాజా భోగట్టా! అయితే ఇక్కడ గమనించాల్సిన కీలకమైన అంశం–పటిష్టమైన వ్యవస్థాగత నిర్మాణం గురించి. పోరాటాలద్వారా, విప్లవోద్యమాల ద్వారా గడించి సాధించుకున్న స్వాతంత్య్రానికి, ఇతర సాత్వికోద్యమాల ద్వారా సాధించుకున్న స్వాతంత్య్ర వ్యవస్థలకూ మధ్య ప్రజలను చైతన్యపరచడంలో తేడా ఉండకపోదు. ఈ సందర్భంగా ఒక మిత్రుడు పంపిన ఆత్మీయ లేఖను పాఠకుల సౌకర్యార్థం ఇక్కడ యథాతథంగా అందిస్తున్నాను.

సూక్ష్మజీవితో ప్రపంచయుద్ధం
‘‘ఒక సూక్ష్మ జీవి కంటికి కనబడదు. దాన్ని చూసిన వాళ్లెవరూ లేరు. అయినా న్యూయార్క్‌లోని ఒక వెయిటర్, బెంగళూరులోని కూలీ, తెలంగాణలోని మొక్కజొన్న రైతు, కువైట్‌లోని క్షవరశాల వర్కర్‌ –ఆ సూక్ష్మ జీవితో యుద్ధం చేస్తున్నారు. నిశ్శబ్దంగా అన్నీ కుప్పకూలిపోతున్నాయి. ఎక్కడో చైనాలో వచ్చింది, మనకేం కాదులే అనుకున్నాం. చైనా వాళ్లు ఏం చేసినా ఓవర్‌ యాక్షన్‌ అనుకున్నాం. తమ దేశానికే గోడ కట్టేసుకున్న మొండివాళ్లనుకున్నాం. కానీ వైరస్‌ను కూడా అంతే మొండిగా తరిమేశారు. అది ప్రపంచంమీదికి వచ్చిపడింది. ఇదేదో చిన్న విషయం అనుకున్నాం. కానీ ఇటలీ ఒక పెద్ద యుద్ధమే చేస్తోంది. ఎంత పెద్ద యుద్ధమంటే, 80 ఏళ్లు పైబడినవాళ్లు చచ్చినా ఫర్వాలేదనుకునే యుద్ధం అది! ఇప్పుడు ప్రపంచంలోని అన్ని రాజకీయాలు పక్కకెళ్లిపోయాయి. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ఎవరికీ ఆలోచన లేదు. సిరియా సంక్షోభం పైన వార్తలు లేవు. ఇరాన్‌ రాజకీయాలు మానేసి ప్రజల్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది. జిహాద్‌ అని అరిచేవాళ్లు కూడా ఈ కొత్త(కరోనా) శత్రువుకి భయపడుతున్నారు. పాకిస్తాన్‌కి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. తాలిబాన్లు కూడా చర్చల గురించి మాట్లాడ్డం లేదు. ప్రపంచయుద్ధాలప్పుడు కూడా ఇంత సంక్షోభం లేదు. దేశాలని దాటితే ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్టుగా ఎవరి గూట్లోకి వాళ్లు వేరుపడి(ఐసోలేషన్‌ లోకి) వెళ్లిపోవడం ఎప్పుడూ జరగలేదు. పార్కుల్లో మనుషులు లేరు. ఆలయాలు ఖాళీ, సినిమాహాళ్లు లేవు. మనుషులందరినీ కలిపే సంబరాలు, ఉత్సవాలు లేనేలేవు. తిరుమలలో క్యూలైన్లు లేవు. 

ఇక ఎక్కడో ఉందిలే అనుకుంటే అది కాస్తా(కరోనా) మన వూరికి కూడా వచ్చేసింది. అమెరికాలో జాక్సన్‌విల్లీలో 20 కేసులు నమోదయ్యాయి. ఆ ఊరికీ, నాకూ ఏ సంబంధం లేదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు. విన్నప్పట్నుంచీ టెన్షన్‌. ఇది నా ఒక్కడి బాధ కాదు, ప్రపంచమంతటి బాధ. న్యూయార్క్‌లో ఆంక్షలు పెడితే నూజివీడులోని వందలాదిమంది తల్లిదండ్రులు నిద్రపోరు. కాలిఫోర్నియాలో కరోనా వస్తే కరీంనగర్‌లోని ఒక తల్లి దుఃఖిస్తుంది. ప్రపంచం చిన్నపోయిందని సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడేం జరిగినా దుఃఖించాల్సిందే. ఈ విషపుగాలి మనుషుల్ని ఆర్థికంగా నరికేయడం ప్రారంభించింది.

కోళ్ల రైతు దివాలా దశలో ఉన్నాడు. ఇప్పుడు తోలుతీసిన కోడి మాంసం కిలో 60 రూపాయలకే హైదరాబాద్‌లో అమ్మేస్తున్నారు. కొనేవారు లేరు. దీనిమీద ఆధారపడిన లక్షలాదిమంది బతుకులు ధ్వంసమైపోతున్నాయి. కరోనా వైరస్‌ ఒకర్నుంచి ఇంకొకరికి అంటుకుంటున్నట్టు ఆర్థిక మాంద్యం కూడా అంటువ్యాధే! ఇక కోళ్ల దాణాకి డిమాండ్‌ లేకపోవడంతో మొక్కజొన్న రైతూ కష్టాల్లో ఉన్నాడు. షూటింగ్‌లు ఆగిపోయేసరికి దేశవ్యాప్తంగా లక్షలాదిమంది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. రోడ్డుమీద మనుషులు లేకపోయేసరికి ఆటోడ్రైవరు పెళ్లాం, పిల్లలూ పస్తులుంటున్నారు. కిరాయి కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయిస్తారు. కిస్తు కట్టకపోతే ఆటో లాక్కుంటారు. ఆకలి ఆత్మహత్యల్ని పెంచుతుంది. నేరస్తుల్ని చేస్తుంది. వ్యాపారాలు లేకపోతే జీఎస్టీ ఆదాయం రాదు. డబ్బులు లేకపోతే ప్రభుత్వాలు సరిగ్గా నడవవు. ఆ భారాన్ని ఉద్యోగులు మోయాలి.

చీమను, ఉడతను కూడా బతకనిద్దాం!
కరోనా వల్ల ప్రధానంగా దెబ్బతినే కీలక రంగం మీడియా. అసలే అంతంతమాత్రంగా ఉన్న మీడియాకి యాడ్‌ రెవెన్యూ తగ్గిపోతుంది. అరకొర జీతాలకి బదులు పూర్తిగా ఇవ్వడం మానేస్తారు. బెంగళూరులో పనులు దొరక్క వేలమంది రాయలసీమ వలస కూలీలు తిరిగి పల్లెలు చేరుకుంటున్నారు. కరోనా ప్రభావం ఇంకొద్ది రోజులు కొనసాగినా హైదరాబాద్‌లో ఉన్న వేలాదిమంది ఒరిస్సా, యూపీ కార్మికులు ఇళ్లకు వెళ్లిపోతారు. ఈ విధ్వంసం సూక్ష్మంగా జరిగిపోతూ ఉంది. ఆయుధాలతో అందరినీ వణికించే అమెరికా కూడా కరోనాకి వణికిపోతూ ఉంది. ఎందుకంటే అది సూక్ష్మజీవి. ఎంత పెద్ద వాళ్లైనా దానికి లెక్కలేదు. ట్రంపు కూడా రోజుకి పదిసార్లు చేతులు కడుక్కొని ముఖం దగ్గరికి చేతులు రాకుండా చూసుకుంటున్నాడు.

గూడు ఎక్కడ కట్టుకోవాలో తెలీక పిచ్చిదానిలా తిరిగే ఒక పిచ్చుకకి కూడా ఈ భూమ్మీద బతికే హక్కుంది. దానికి రియల్‌ ఎస్టేట్‌ తెలియకపోవచ్చు. మనం రోడ్ల కోసం చెట్లు నరుకుతున్నప్పుడు వేలాది పక్షి పిల్లలు గొంతు ఎండేలా ఏడ్చి, చచ్చిపోయి ఉంటాయి. ఒక చీమని లేదా ఉడతని కూడా దాని బతుకు దాన్ని బతకనివ్వాలి. లేకపోతే మనల్ని బతకనివ్వని జీవులు భూమ్మీద పుడతాయి సుమా! అందుకే ప్రకృతిని బతకనివ్వండి, అది మనల్ని బ్రతకనిస్తుంది. తప్పెట్లు, తాళాలు అప్పుడు వాయించుకుందాం, అదీ సామూహిక ఆనందం.


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
ఈమెయిల్‌ : abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top