శుభాలను ప్రసాదించే ఈద్‌

శుభాలను ప్రసాదించే ఈద్‌


రమజాన్‌ – సత్కార్య సౌరభాలు పరిమళించే వరాల వసంతం. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి, జీవనసాఫల్యానికి కావలసిన సమస్త విషయాలు దీనితో ముడివడి ఉన్నాయి.ఎందుకంటే ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్‌ గ్రంథం అవతరించింది. ఇది యావత్తు మానవాళికీ ఆదర్శ ప్రబోధిని. కారుణ్య సంజీవిని. మార్గప్రదాయిని.



రమజాన్‌ సందర్భంగా ఈ మాసంలో సత్కార్యాలు బాగా ఊపందుకుంటాయి. దుష్కార్యాలు గణనీయంగా తగ్గిపోతాయి. సమాజ  వాతావరణంలో చక్కటి, ఆహ్లాదకరమైన మార్పు కనిపిస్తుంది. తరాలీ నమాజులు కూడా ఈ మాసంలోనే ఆచరించబడతాయి. అదనపు పుణ్యం సంపాదించుకోడానికి ఇదొక సువర్ణావకాశం.‘ఫిత్రా ఆదేశాలు కూడా ఈ మాసంలోనే అవతరించాయి. వీటివల్ల సమాజంలోని పేదసాదలకు ఊరట లభిస్తుంది. దాదాపుగా అత్యధిక సంఖ్యాకులు జకాత్‌ కూడా ఈ మాసంలోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదవారి ఆర్థిక అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది.



ఇంతేకాదు ఈ మాసంలో అనుసంధానమై ఉన్న విషయాలు అనేకం ఉన్నాయి. దైవం ఈ పవిత్రమాసాన్ని బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాడు. మానవుల ఇహ, పర ప్రయోజనాలకు, సాఫల్యానికి ఉపకరించే అనేక అవకాశాలున్నా సద్వినియోగం చేసుకోడానికి శక్తివంచనలేని కృషిచేయాలి. అలుపెరుగని ప్రయత్నం ఆరంభించాలి. నిజానికి రోజా వ్రతమన్నది కేవలం ముహమ్మద్‌ ప్రవక్త(సం) వారి అనుచర సముదాయానికి మాత్రమే పరిమితమైన ఆరాధన కాదు. ఇది సార్వకాలిక, సార్వజనీన ఆరాధన. దీనికి చాలా ఘనమైన ప్రాచీన, సామాజిక నేపథ్యముంది. అనాదిగా ఇది అన్ని కాలాల్లో, అన్ని సమాజాల్లో చలామణిలో ఉన్నట్లు దైవగ్రంథం ద్వారా మనకు తెలుస్తోంది.



ఒక వ్యక్తిదైవం కోసం, దైవ ప్రసన్నత కోసం, దైవాదేశాలకనుగుణంగా, దైవ ప్రవక్త సాంప్రదాయ విధానం ప్రకారం పాటించినట్లయితే, తప్పకుండా అతనిలో ఈ సుగుణాలు జనించి తీరవలసిందే. నిజానికి నమాజ్, రోజా, జకాత్, హజ్‌ లాంటి ఆరాధనల ద్వారా మనిషి సంపూర్ణ మానవతావాదిగా, మానవ రూపంలోని దైవదూత గుణసంపన్నుyì గా పరివర్తన చెందాలన్నది అసలు ఉద్దేశ్యం. అందుకే దైవం సృష్టిలో ఏ జీవరాశికీ ఇవ్వనటువంటి ప్రత్యేకత, బుద్ధికుశలత, విచక్షణాజ్ఞానం ఒక్క మానవుడికే ప్రసాదించాడు. కాని మానవుడు తన స్థాయిని గుర్తించక, దైవ ప్రసాదితమైన బుద్ధీజ్ఞానాలను, శక్తియుక్తులను దుర్వినియోగ పరుస్తూ, ఇచ్ఛానుసార జీవితం గడుపుతూ, కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. దైవాదేశాలను విస్మరించి ఇష్టానుసార జీవితం గడుపుతున్నప్పటికీ ఇహలోక జీవితం సుఖవంతంగా, నిరాటంకగా సాగిపోతోందంటే, ఇక ఏం చేసినా చెల్లిపోతుందని కాదు. ఏదో ఒకనాడు వీటన్నిటికీ ఫలితం అనుభవించవలసి ఉంటుంది. ఇహలోకంలో కాకపోయినా పరలోకంలోనైనా దైవానికి సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. అందుకని మనిషి తన స్థాయిని గుర్తించాలి.



మానవసహజ బలహీనత వల్ల జరిగిన తప్పును తెలుసుకోవాలి. పశ్చాత్తాపంతో దైవం వైపునకు మరలి సత్కార్యాల్లో లీనమై పోవాలి. దైవభీతితో హృదయం కంపించి పోవాలి. ఈ విధంగా దైవానికి దగ్గర కావడానికి, సత్కార్యాల్లో ఇతోధికంగా పాలు పంచుకోడానికి పవిత్ర రమజాన్‌కు మించిన అవకాశం మరొకటి లేదు. అత్యంత భక్తి శ్రద్ధలతో రోజాలు పాటించి పరమప్రభువు నుండి నేరుగా ప్రతిఫలం అందుకోవడానికి ప్రయత్నించాలి. మనసా, వాచా, కర్మణా ఉపవాసాలు పాటించే వారిని సత్కార్యాల  ప్రతిరూపం అనవచ్చు. త్రికరణ శుద్ధితో వ్రతం పాటించే వారి అంతర్గంతోపాటు, బాహ్య శరీరంలోకూడా పవిత్రాత్మ నిత్యం జాగృతమై ఉంటుంది.



అనుక్షణంవారు అప్రమత్తంగా ఉంటూ అన్ని రకాల దోషాలనుండి పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మానవ సహజ బలహీనత వల్ల ఏదో ఒక పొరపాటు దొర్లిపోతూనే ఉంటుంది. ఇలాంటి చిన్నా చితకా పొరపాట్ల నుండి ఉపవాసాన్ని దోషరహితంగా, లోపరహితంగా తీర్చిదిద్దడానికిముహమ్మద్‌ ప్రవక్త (సం) ఒక దానాన్ని ఉపదేశించారు. ఈప్రత్యేక దానాన్ని షరి అత్‌ పరిభాషలో ‘సద్‌ ఖా ఫిత్ర్‌’అంటారు. ఎంతపేదవారైనప్పటికీ ఫిత్రా జకాత్‌ల రూపంలో అందే ఆర్థిక సహాయంతో పండుగ సంబరాల్లో ఆనందంతో పాల్గొనగలుగుతారు.



పవిత్ర ఖురాన్‌ మార్గదర్శకంలో, ప్రవక్త మహనీయుని ఉపదేశాలనకనుగుణంగా మనం మన జీవితాలను సమీక్షించుకుంటే, సంస్కరణ ఎక్కడ అవసరమో గుర్తించే వీలు కలుగుతుంది. తద్వారా ఆచరణకు మార్గం సుగమం అవుతుంది. ఈ విధమైనటువంటి స్వీయ సమీక్షకు, సింహావలోకనానికి రమజాన్‌ కంటే మంచి తరుణం మరొకటి ఉండబోదు. దైవం అందరికీ రమజాన్‌ శుభాలను సమృద్ధిగా పొందే భాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం.  



సమాజంలో ప్రతి ఒక్కరూ ఆనందంతో,

సుఖసంతోషాలతోజీవనం గడుపుతూ, పరలోకంలో దైవ ప్రసన్నతకు పాత్రులు కావాలన్నది ఇస్లాం ఆశయం. అందుకే జకాత్, ఫిత్రా సద్‌ఖఖైరాత్‌ అంటూ రకరకాల దాన ధర్మాలను ప్రోత్సహిస్తూ, సమాజంలో పేదరిక నిర్మూలనకు నిర్దిష్టమైన కార్యాచరణను ప్రతిపాదించింది.



– ఎం.డి. ఉస్మాన్‌ఖాన్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top