breaking news
Ramadan Special
-
రంజాన్ స్పెషల్ రెసిపీ.. మటన్ రోగన్ జోష్
కావలసినవి: ►మటన్ – కిలో; పాలు– కప్పు; కుంకుమ పువ్వు– చిటికెడు; నెయ్యి– అర కప్పు; ఇంగువ – అర టీ స్పూన్; జీలకర్ర– టీ స్పూన్; ►దాల్చిన చెక్క – 2 అంగుళాల ముక్క; నల్ల యాలకులు – 5; మిరియాలు – టీ స్పూన్; ►ఎండుమిర్చి– 4; పెరుగు– 150 గ్రా; గోధుమపిండి– టేబుల్ స్పూన్; శొంఠిపొడి – 2 టీ స్పూన్లు; ►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; ధనియాల పొడి– టేబుల్ స్పూన్; ►కశ్మీరీ మిరపపొడి– టేబుల్ స్పూన్; సోంపు పొడి– టేబుల్ స్పూన్; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్. తయారీ: ►మటన్‌ను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ►పాలను వేడి చేసి అందులో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి. ►ప్రెషర్ పాన్‌లో నెయ్యి వేడి చేసి దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, ఇంగువ, జీలకర్ర, ఎండుమిర్చి వేసి సన్న మంట మీద వేయించాలి. అవి వేగిన తరవాత అందులో మటన్ వేసి కలిపి మూత పెట్టి మీడియం మంట మీద ఐదారు నిమిషాల సేపు ఉంచాలి. ఇప్పుడు మూత తీసి అరకప్పు నీటిని పోసి మూత పెట్టి పది– పదిహేను నిమిషాల సేపు ఉడికించాలి. ►మరొక పాత్రలో పెరుగు, గోధుమ పిండి కలిపి అందులో కుంకుమ పువ్వు కలిపిన పాలు, ఉప్పు, సోంపు పొడి, ధనియాల పొడి, కశ్మీరీ మిరప్పొడి, శొంఠిపొడి కలిపి ఈ మొత్తం మిశ్రమాన్ని మటన్ మిశ్రమంలో కలిపి చిక్కదనం చూసుకుని అవసరమైతే మరికొంత నీటిని కలిపి, ప్రెషర్ పాన్ మూత పెట్టి ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ►వేడి, ప్రెషర్ తగ్గిన మూత తీసిన కొత్తిమీర తరుగు చల్లి వెంటనే మూత పెట్టాలి. ఈ మటన్ రోగన్ జోష్ చపాతీ, పుల్కాలతోపాటు అన్నంలోకి కూడా బాగుంటుంది. -
రుచుల పండుగ రంజాన్.. 10 వెరైటీలు మీకోసం!
రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు సుహార్, సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ విందు కానిస్తారు. కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ ఇచ్చి పుచ్చుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఈ ఇఫ్తార్ లో వడ్డించే వంటకాలు అద్భుతమైన రుచులతో ఉంటాయి. వీటిలో 10 వెరైటీల గురించి కలినరీ స్పెషలిస్ట్ పల్టి హరినాథ్ వివరిస్తున్నారు. సాధారణంగా రంజాన్ వేళ ఉపవాసదీక్షను ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, నిమ్మరసంతో ముగిస్తారు. అయితే ఈ పండుగ విందుల్లో ఆరగించే టాప్ 10 వంటకాల్లో... ► హలీమ్ – ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా దర్శనమిచ్చే ఫుడ్ వెరైటీ ఇది. మటన్‌ను పప్పుదినుసులు, గోధుమలు, మసాలాలు, డ్రై ఫ్రూట్స్‌లో నిదానంగా ఉడికించి తయారుచేస్తారు. ఈ ఫుడ్ అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుంది. ► కెబాబ్స్:మటన్ లేదంటే చికెన్ ముక్కలను పెరుగు, మసాలాలలో నానబెట్టి అనంతరం ఫ్రై చేయడం లేదా స్క్రూ చేయడం లేదా బార్బిక్యు చేయడం ద్వారా వీటిని వండుతారు. ► చికెన్ షావార్మా – అత్యంత ప్రాచుర్యం పొందిన మధ్య ప్రాశ్చ్య డిష్ ఇది. సన్నగా కోసిన చికెన్ లేదా మటన్ ముక్కలను బ్రెడ్ లోపల కూరగాయలు, సాస్ కలిపి ఆరగిస్తారు. ► కీమా సమోసా – గోధుమ పిండి, మటన్‌తో తయారుచేసే ఈ సమోసాలు భారతీయ రుచుల సంగమంగా నిలుస్తాయి. ► మటన్ రెసాలా – ఇది పూర్తిగా బెంగాలీ డిష్. బోన్ మటన్ పీస్‌లను పెరుగులో నానబెట్టి , జీడిపప్పు, గసగసాల పేస్ట్‌తో పాటుగా భారతీయ మసాలాలు కూడా కలిపి తయారుచేస్తారు. పరాటా లేదా నాన్‌తో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. ► దమ్ బిర్యానీ – దక్షిణ భారతదేశంలో దీనిని విభిన్న రకాలుగా చేయడం కనిపిస్తుంది. ప్రధానంగా బియ్యం, మటన్ లేదా చికెన్, మసాలాలు నెయ్యి, కుంకుమపువ్వుతో చేస్తారు. కొన్నిసార్లు కూరగాయలు, సోయా ముక్కలు, సీఫుడ్‌తో కూడా ఈ బిర్యానీ చేయడం కనిపిస్తుంది. ► ఫలాఫెల్ –అంతర్జాతీయంగా ఎక్కువ మంది ఇష్టపడే వంటకాలలో ఫలాఫెల్ ఒకటి. బటానీ గింజలు లేదంటే ఫవా బీన్స్ లేదా రెండింటినీ కలిపి తయారుచేసిన బాల్ లేదా పట్టీ ఫలాఫెల్. వీటిని సాధారణంగా హమ్మస్‌తో పాటుగా తహినీ సాస్‌తో కలిపి ఇఫ్తార్ సమయంలో సర్వ్ చేస్తారు. . ► షీర్ ఖుర్మా – మొఘలాయ్ వంటకం ఇది. షీర్ అంటే పాలు, ఖుర్మా అంటే ఖర్జూరం. రెండింటి మేళవింపే ఈ షీర్ఖుర్మా దీని ఆకృతి మాత్రమే కాదు, రుచి కూడా వినూత్నంగా ఉంటుంది. ► అఫ్లాటూన్– ప్రత్యేక తియ్యని వంటకం అఫ్లాటూన్ . స్వచ్ఛమైన నెయ్యి, నట్స్‌తో తయారుచేస్తారు. రంజాన్ వేళ భోజనం ముగించేందుకు అత్యుత్తమ డిష్ ఇది. రూ అఫ్జా – రంజాన్ మాసంలో సాధారణంగా తయారుచేసే షర్బత్ ఇది. దీనిలో వనమూలికలు, పండ్లు, కూరగాయలు, పూలు, వేర్లు కూడా భాగంగా ఉంటాయి. ప్రత్యేకమైన రుచులు, కూలింగ్ ఎఫెక్ట్ దీనిని మిలిగిన పానీయాలకు భిన్నంగా నిలుపుతుంది. ఈ రూ అఫ్జా సిరప్‌ను కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, సేమియాలలో కూడా కలిపి తీసుకోవచ్చు. ఐకమత్యం పెంచే రుచులు... ఇది నిజంగా జష్న్–ఏ–రంజాన్. విభిన్నరకాల అభి‘రుచుల’ను సంతృప్తి పరిచే విధంగా వెరైటీ డిషెస్‌ను రంజాన్ మోసుకొస్తుంది. అందుకు తగ్గట్టే ఏర్పాటయ్యే ఇఫ్తార్ విందులు అందర్నీ ఆకట్టుకుంటాయి. –మితేష్ లోహియా, డైరెక్టర్, సేల్స్–మార్కెటింగ్, గోల్డ్ డ్రాప్ -
ధరల కొలిమిలో హలీం.. తినే ఉత్సాహం, మూడు మాటాష్!
చార్మినార్: రంజాన్ మాసం వచ్చిందంటే చాలు హలీం రుచులు ఉవ్విళ్లూరిస్తాయి. ఇంటిల్లిపాదీ ఆ రసాస్వాదనకు ఫిదా కావాల్సిందే. మరి ఈసారి హలీం తినాలంటే కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంతో పోలిస్తే.. ఈ ఏడాది హలీం ధరలు పెరిగాయి. ఉక్రెయిన్– రష్యా దాడుల నేపథ్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం హలీం ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు హలీం తయారీదారులు. ఇవి వాడతారు? ఇలాచీ, దాల్చినచెక్క, లవంగాలు, సాజీరా, జీలకర్ర, మిరియాలు, గోధుమ రవ్వ, బాస్మతి బియ్యం, ఉప్పు, నిమ్మకాయ, పచ్చి మిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, నెయ్యి, గులాబ్ పువ్వు, పెసరపప్పు, మినుములు, కందిపప్పు, బాదం, వేపుడు ఉల్లిగడ్డ, కాజు తదితర 21 వస్తువులతో హలీంను తయారు చేస్తారు. ఇందులో రిఫైండ్ ఆయిల్, స్వచ్ఛమైన నెయ్యి, గోధుమలు, పొట్టేలు మాంసాన్ని అధిక మోతాదులో వినియోగిస్తారు. వీటి ధరలు పెరగడంతో హలీం ధరలు పెరిగాయని హలీం తయారీదారులు అంటున్నారు. ఇలా పెరిగాయి.. ► ఉక్రెయిన్– రష్యా యుద్ధానికి ముందు రూ.2 వేలు ఉన్న 15 లీటర్ల రిఫైండ్ ఆయిల్ ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది. నెయ్యి, మాంసం ధరలు కూడా పెరగడంతో ఈసారి ప్లేట్ హలీం ధర రూ.20 పెరిగి రూ.240కు చేరింది (పిస్తా హౌస్– 350 గ్రాములు)గా ఉంది. ఇక షాదాబ్ హలీం గతేడాది రూ. 200 ఉండగా.. ప్రస్తుతం రూ.30 పెంచి రూ.230కు (250 గ్రాములు) విక్రయిస్తున్నారు. షాగౌస్ హలీం గతేడాది కన్నా రూ.20 పెంచి రూ.220కి అమ్ముతున్నారు. అంటే ఒక కిలో హలీంకు రూ.80 నుంచి రూ.100 వరకు పెరిగింది. గత రెండేళ్లలో కరోనా ప్రభావం.. 2020తో పాటు 2021లో హలీం అమ్మకాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. దీంతో గణనీయంగా హలీం గిరాకీ తగ్గింది. 2020 లో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ హలీం మేకర్స్ అసోసియేషన్ హలీం తయారీ నిలిపివేసింది. హలీంను నగరంలో ఎక్కడా తయారీ చేయ లేదు. దీంతో రంజాన్ మాసంలో హలీం అందుబాటులోకి రాలేదు. 2021లో హలీం తయారీ జరిగినప్పటికీ.. రాత్రిపూట కర్ఫ్యూ కారణంగా హలీం ప్రియులు నిరాశకు గురయ్యారు. కర్ఫ్యూ కారణంగా హలీం తయారీ దారులు తక్కువ మోతాదులో హలీం తయారు చేశారు. దీంతో హలీం అమ్మకాలు తగ్గిపోవడంతో నష్టాలను భరించాల్సి వచ్చిందని హలీం తయారీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. తగ్గిన గిరాకీ.. పాతబస్తీ హలీంకు ప్రత్యేక స్థానం ఉంది. నగరంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా రంజాన్ మాసంలో పాతబస్తీకి వచ్చి మరీ హలీం తినడం అలవాటు. దీంతో పాత బస్తీలోని హాలీం హోటళ్లన్నీ వినియోగదారులతో కిటకిటలాడతాయి. ప్రస్తుతం హలీం ధరలు పెరగడంతో హలీం తినే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. రెండ్రోజులకోసారే.. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా రోజుకు రెండు ప్లేట్ల హలీం తినేవాడిని. ధరలు పెరగడంతో తినడానికి కాస్త ఆలోచించాల్సివస్తోంది. రెండు రోజులకోసారే తింటున్నా. – షేక్ నదీం, శాలిబండ తినడం మానేశా.. ప్రతి రంజాన్‌లో హలీంను తప్పనిసరిగా తింటాను. ఇప్పుడు రేట్లు పెరగడంతో మానేసిన. కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లు రంజాన్‌లో హలీం తినలేదు. పెరిగిన రేట్లకు తోడు అలవాటు తప్పింది. – ఫహీం, అలీనగర్ -
తింటే.. వదలరంతే.. ఏటా రూ.కోటి వ్యాపారం
సాక్షి, భీమవరం (ప్రకాశంచౌక్): రంజాన్ మాసంలో దర్శనమిచ్చే ప్రత్యేక వంటకం హలీమ్. ఉపావాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా దీనిని ఇష్టపడుతుంటారు. రోజంతా ఉపవాస దీక్షలో ఉన్నవారు హలీమ్ ద్వారా శరీరంలో కొంత మేరకు శక్తిని పొందగలుగుతారు. దీంతో ఏటా రంజాన్ మాసంలో ప్రత్యేకంగా సెంటర్లు ఏర్పాటుచేసి హలీమ్ విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. జిల్లాలో 15 ఏళ్ల నుంచి హలీమ్ విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి తయారీదారులు పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ప్రధానంగా భీమవరం, ఏలూరు కేంద్రాలుగా హలీమ్ అవుట్లెట్లు వెలుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి తయారీదారులను తీసుకువచ్చి ఇక్కడ హలీమ్‌ను తయారు చేయిస్తున్నారు. వారికి నెలకు రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు. హలీమ్ తయారీ శ్రమతో కూడుకున్న పని. సుమారు 6 గంటలపాటు సమయం పడుతుంది. పరిసర ప్రాంతాలకు సరఫరా చికెన్, మటన్ హలీమ్‌లను తయారుచేస్తారు. వీటిని చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడుతుండటంతో హలీమ్ సెంటర్లకు జనం క్యూకడుతున్నారు. దీంతో ఏటేటా జిల్లాలో హలీమ్ విక్రయాలు పెరుగుతున్నాయి. భీమవరం, ఏలూరు కేంద్రాలుగా హలీమ్‌ను తయారుచేసి పరిసర ప్రాంతాలకు సరఫరా చేసి అక్కడ ఏర్పాటుచేసిన అవుట్లెట్లలో విక్రయిస్తున్నారు. భీమవరం కేంద్రంగా నరసాపురం, తణుకు, పాలకొల్లు తదితర ప్రాంతాలకు హలీమ్‌ను సరఫరా చేస్తున్నారు. ఏటా రూ.కోటి: పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఏటా రూ.కోటికి పైగా హలీమ్ వ్యాపారం జరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. నెల రోజులపాటు ఒక్కో హలీమ్ కేంద్రంలో ఐదుగురి నుంచి ఆరుగురు ఉపాధి పొందుతున్నారు. నాకు చాలా ఇష్టం నాకు హలీమ్ అంటే చాలా ఇష్టం. రంజాన్ మాసంలో ఎక్కువ సార్లు తింటాను. ఏటా హలీమ్ కోసం ఎదురుచూస్తుంటా. భీమవరంలో హలీమ్ చాలా బాగుంటుంది. చికెన్, మటన్ హలీమ్ రెండూ కూడా నాకు ఇష్టం. – ఎస్కే.షాజహన్, భీమవరం ఏటా ఏర్పాటు చేస్తున్నాం భీమవరం పెద్ద మసీద్ సెంటర్ వద్ద ఏటా హలీమ్ సెంటర్ ఏర్పాటుచేస్తాం. హలీమ్ తయారీలో చేయి తిరిగిన వారిని హైదరాబాద్ నుంచి తీసుకువస్తాం. భీమవరంలో హలీమ్‌ను చాలా ఇష్టంగా తింటున్నారు. వ్యాపారం బాగుంది. – ఎస్కే బాబు, హలీమ్ సెంటర్ నిర్వాహకులు, భీమవరం -
పవిత్ర రమజాన్: జిబ్రీల్ దుఆ .. ప్రవక్త ఆమీన్
అది పవిత్ర రమజాన్ మాసం. శుక్రవారం రోజు. ముహమ్మద్ ప్రవక్త(స) జుమా ఖుత్బా కోసం మింబర్ (వేదిక) ఎక్కుతున్నారు. కుడికాలు మొదటి మెట్టుపైపెడుతూనే ‘ఆమీన్’ అన్నారు. అలా రెండవ మెట్టు, మూడవ మెట్టు అధిరోహిస్తూ ఆమీన్ .., ఆమీన్ అని పలికారు. జుమా సమావేశంలో పాల్గొన్న సహచరులకు ఏమీ అర్థం కాలేదు. ప్రవక్తవారు ఈ రోజేమిటీ.. అసందర్భంగా ఆమీన్ .. ఆమీన్ అని ముమ్మారు పలికారు. అని గుసగుసలాడుకున్నారు. ఇదే విషయాన్ని ప్రవక్తవారిని అడిగారు. దానికాయన, ‘నేను ప్రసంగం కోసమని వేదికనెక్కుతూ మొదటి మెట్టుపై కాలుమోపుతుండగా జిబ్రీల్ వచ్చారు. ఎవరైతే రమజాన్ మాసాన్ని పొంది, దాని ఉపవాసాలు పాటించి తమను తాము నరకాగ్ని నుండి రక్షించుకునే ప్రయత్నం చేసుకోలేదో, వారిపై దేవుని శాపం అవతరించుగాక.. అన్నారు. దానికి నేను ఆమీన్ అన్నాను. రెండవ మెట్టుపై కాలు మోపుతుండగా, ఎవరైతే వృద్ధ తల్లిదండ్రులకి సేవలు చేసి స్వర్గాన్ని పొందే అర్హత సాధించలేదో వారిపై దేవుని శాపం పడుగాక.. అన్నారు. దానికీ నేను ఆమీన్ అన్నాను. మూడవ మెట్టుపై పాదం మోపుతుండగా, ఎవరైతే మీ పేరు అంటే, ‘ముహమ్మద్’ అని పలికి, లేక విని దురూద్, సలాం పలకలేదో వారిపై దేవుని శాపం అవతరించుగాక.. అన్నారు. అప్పుడు నేను ఆమీన్ అన్నాను’. అని వివరించారు ప్రవక్త మహనీయులు. దైవదూతల్లో అత్యంత ఆదరణీయులు, దైవదూతల నాయకుడూ, హజ్రత్ ఆదం అలైహిస్సలాం మొదలు, మొహమ్మద్ ప్రవక్త(స) వరకూ ప్రతీ దైవప్రవక్తకూ దేవుని దగ్గరినుండి సందేశం తీసుకు వచ్చిన జిబ్రీల్ దుఆ చేయడం, ముహమ్మదుర్రసూలుల్లా వారు ఆ దుఆకు ఆమీన్ (తథాస్తు) పలకడమంటే దీనికి ఎంతగొప్ప ప్రాముఖ్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. కనుక రమజాన్ ఉపవాసాలను ఎట్టిపరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయకుండా నియమ నిష్టలతో, అత్యంత శ్రద్ధాభక్తులతో ఆచరించాలి. అలాగే తల్లిదండ్రులను గౌరవించాలి. ఆదరించాలి. వారి బాగోగులు చూడాలి. తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడం, వారిబాగోగులు చూడక పోవడం దైవాగ్రహానికి దారి తీసేప్రమాదం ఉంది. ఇదే విధంగా ముహమ్మద్ ప్రవక్తవారిపై సలాములు పంపుతూ ఉండాలి. అంటే తరచుగా దురూదె షరీఫ్ పఠిస్తూ ఉండాలి. ప్రవక్త వారి పేరు పలికినా, లేక విన్నా వీలైతే దురూద్ చదవాలి. లేకపోతే కనీసం సల్లల్లాహు అలైహి వసల్లం అని పలకాలి. రమజాన్ రోజాల పట్ల నిర్లక్ష్యం వహించడం, దురూద్ పంపక పోవడం, తల్లిదండ్రుల్ని పట్టించుకోక పోవడం ఎంతటి పెద్దపెద్ద పాపాలో అర్థం చేసుకోవాలి. జిబ్రీల్ దూత దుఆ చేయడం, రసూలుల్లా వారు తథాస్తు పలకడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దైవం మనందరికీ ఈవిషయాలను అర్ధం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
శుభాలను ప్రసాదించే ఈద్
రమజాన్ – సత్కార్య సౌరభాలు పరిమళించే వరాల వసంతం. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి, జీవనసాఫల్యానికి కావలసిన సమస్త విషయాలు దీనితో ముడివడి ఉన్నాయి.ఎందుకంటే ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించింది. ఇది యావత్తు మానవాళికీ ఆదర్శ ప్రబోధిని. కారుణ్య సంజీవిని. మార్గప్రదాయిని. రమజాన్ సందర్భంగా ఈ మాసంలో సత్కార్యాలు బాగా ఊపందుకుంటాయి. దుష్కార్యాలు గణనీయంగా తగ్గిపోతాయి. సమాజ వాతావరణంలో చక్కటి, ఆహ్లాదకరమైన మార్పు కనిపిస్తుంది. తరాలీ నమాజులు కూడా ఈ మాసంలోనే ఆచరించబడతాయి. అదనపు పుణ్యం సంపాదించుకోడానికి ఇదొక సువర్ణావకాశం.‘ఫిత్రా ఆదేశాలు కూడా ఈ మాసంలోనే అవతరించాయి. వీటివల్ల సమాజంలోని పేదసాదలకు ఊరట లభిస్తుంది. దాదాపుగా అత్యధిక సంఖ్యాకులు జకాత్ కూడా ఈ మాసంలోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదవారి ఆర్థిక అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది. ఇంతేకాదు ఈ మాసంలో అనుసంధానమై ఉన్న విషయాలు అనేకం ఉన్నాయి. దైవం ఈ పవిత్రమాసాన్ని బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాడు. మానవుల ఇహ, పర ప్రయోజనాలకు, సాఫల్యానికి ఉపకరించే అనేక అవకాశాలున్నా సద్వినియోగం చేసుకోడానికి శక్తివంచనలేని కృషిచేయాలి. అలుపెరుగని ప్రయత్నం ఆరంభించాలి. నిజానికి రోజా వ్రతమన్నది కేవలం ముహమ్మద్ ప్రవక్త(సం) వారి అనుచర సముదాయానికి మాత్రమే పరిమితమైన ఆరాధన కాదు. ఇది సార్వకాలిక, సార్వజనీన ఆరాధన. దీనికి చాలా ఘనమైన ప్రాచీన, సామాజిక నేపథ్యముంది. అనాదిగా ఇది అన్ని కాలాల్లో, అన్ని సమాజాల్లో చలామణిలో ఉన్నట్లు దైవగ్రంథం ద్వారా మనకు తెలుస్తోంది. ఒక వ్యక్తిదైవం కోసం, దైవ ప్రసన్నత కోసం, దైవాదేశాలకనుగుణంగా, దైవ ప్రవక్త సాంప్రదాయ విధానం ప్రకారం పాటించినట్లయితే, తప్పకుండా అతనిలో ఈ సుగుణాలు జనించి తీరవలసిందే. నిజానికి నమాజ్, రోజా, జకాత్, హజ్ లాంటి ఆరాధనల ద్వారా మనిషి సంపూర్ణ మానవతావాదిగా, మానవ రూపంలోని దైవదూత గుణసంపన్నుyì గా పరివర్తన చెందాలన్నది అసలు ఉద్దేశ్యం. అందుకే దైవం సృష్టిలో ఏ జీవరాశికీ ఇవ్వనటువంటి ప్రత్యేకత, బుద్ధికుశలత, విచక్షణాజ్ఞానం ఒక్క మానవుడికే ప్రసాదించాడు. కాని మానవుడు తన స్థాయిని గుర్తించక, దైవ ప్రసాదితమైన బుద్ధీజ్ఞానాలను, శక్తియుక్తులను దుర్వినియోగ పరుస్తూ, ఇచ్ఛానుసార జీవితం గడుపుతూ, కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. దైవాదేశాలను విస్మరించి ఇష్టానుసార జీవితం గడుపుతున్నప్పటికీ ఇహలోక జీవితం సుఖవంతంగా, నిరాటంకగా సాగిపోతోందంటే, ఇక ఏం చేసినా చెల్లిపోతుందని కాదు. ఏదో ఒకనాడు వీటన్నిటికీ ఫలితం అనుభవించవలసి ఉంటుంది. ఇహలోకంలో కాకపోయినా పరలోకంలోనైనా దైవానికి సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. అందుకని మనిషి తన స్థాయిని గుర్తించాలి. మానవసహజ బలహీనత వల్ల జరిగిన తప్పును తెలుసుకోవాలి. పశ్చాత్తాపంతో దైవం వైపునకు మరలి సత్కార్యాల్లో లీనమై పోవాలి. దైవభీతితో హృదయం కంపించి పోవాలి. ఈ విధంగా దైవానికి దగ్గర కావడానికి, సత్కార్యాల్లో ఇతోధికంగా పాలు పంచుకోడానికి పవిత్ర రమజాన్‌కు మించిన అవకాశం మరొకటి లేదు. అత్యంత భక్తి శ్రద్ధలతో రోజాలు పాటించి పరమప్రభువు నుండి నేరుగా ప్రతిఫలం అందుకోవడానికి ప్రయత్నించాలి. మనసా, వాచా, కర్మణా ఉపవాసాలు పాటించే వారిని సత్కార్యాల ప్రతిరూపం అనవచ్చు. త్రికరణ శుద్ధితో వ్రతం పాటించే వారి అంతర్గంతోపాటు, బాహ్య శరీరంలోకూడా పవిత్రాత్మ నిత్యం జాగృతమై ఉంటుంది. అనుక్షణంవారు అప్రమత్తంగా ఉంటూ అన్ని రకాల దోషాలనుండి పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మానవ సహజ బలహీనత వల్ల ఏదో ఒక పొరపాటు దొర్లిపోతూనే ఉంటుంది. ఇలాంటి చిన్నా చితకా పొరపాట్ల నుండి ఉపవాసాన్ని దోషరహితంగా, లోపరహితంగా తీర్చిదిద్దడానికిముహమ్మద్ ప్రవక్త (సం) ఒక దానాన్ని ఉపదేశించారు. ఈప్రత్యేక దానాన్ని షరి అత్ పరిభాషలో ‘సద్ ఖా ఫిత్ర్’అంటారు. ఎంతపేదవారైనప్పటికీ ఫిత్రా జకాత్‌ల రూపంలో అందే ఆర్థిక సహాయంతో పండుగ సంబరాల్లో ఆనందంతో పాల్గొనగలుగుతారు. పవిత్ర ఖురాన్ మార్గదర్శకంలో, ప్రవక్త మహనీయుని ఉపదేశాలనకనుగుణంగా మనం మన జీవితాలను సమీక్షించుకుంటే, సంస్కరణ ఎక్కడ అవసరమో గుర్తించే వీలు కలుగుతుంది. తద్వారా ఆచరణకు మార్గం సుగమం అవుతుంది. ఈ విధమైనటువంటి స్వీయ సమీక్షకు, సింహావలోకనానికి రమజాన్ కంటే మంచి తరుణం మరొకటి ఉండబోదు. దైవం అందరికీ రమజాన్ శుభాలను సమృద్ధిగా పొందే భాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆనందంతో, సుఖసంతోషాలతోజీవనం గడుపుతూ, పరలోకంలో దైవ ప్రసన్నతకు పాత్రులు కావాలన్నది ఇస్లాం ఆశయం. అందుకే జకాత్, ఫిత్రా సద్ఖఖైరాత్ అంటూ రకరకాల దాన ధర్మాలను ప్రోత్సహిస్తూ, సమాజంలో పేదరిక నిర్మూలనకు నిర్దిష్టమైన కార్యాచరణను ప్రతిపాదించింది. – ఎం.డి. ఉస్మాన్‌ఖాన్ -
మానవత్వానికి ఈద్
ఎక్కడో, ఎవరో సాయం చేయమంటూ చెయ్యి చాపారు. అతడిది ఏ కులమో, ఏ మతమో, ఏ వర్గమో, ఏ భాషో, ఏ ప్రాంతమో ఆలోచించకుండా చెయ్యి అందించాం. మనిషంటేనే సాయం, ప్రేమ. మన ం చేసే సాయంతో, పంచే ప్రేమతో ఒకరి ముఖంలో చిరునవ్వు కనిపిస్తే అంతకంటే ఏం కోరుకుంటాం? ఆ చిరునవ్వునలా మళ్ళీ మళ్ళీ చూడాలనుకోవడం తప్ప! రంజాన్ వచ్చేసింది. అలయ్ బలయ్ అంటూ మనిషిని మనిషికి దగ్గరచేసే పండుగిది. చెడును దూరం పెట్టి మంచిని పెంచే పండుగిది. పవిత్రతతో అల్లాను పలకరించే పండుగిది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కుల, మతాలకు అతీతంగా మనిషికి సాయం చేయడమే మానవత్వమని, ఆ మానవత్వానికి సలామ్ కొట్టే కొందరి కథలే.. మానవత్వానికి ఈద్.. 2015లో భారీ వరదలతో చెన్నై నగరం అతలాకుతలం అయింది. ఉరప్పాకం ప్రాంతంలో మోహన్, అతడి భార్య చిత్ర వరదల్లో చిక్కుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతానికి తన మిత్రబృందంతో ఓ పడవ వేసుకొని వచ్చిన యూనస్, వీరిద్దరినీ చూసి ప్రాణాలకు తెగించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించాడు. ఆ సమయంలో చిత్ర నిండు గర్భిణి. వరద తీవ్ర స్థాయిలో ఉంది. చుట్టుపక్కల ఏ ప్రాంతంలోనూ కరెంట్ లేదు. నాలుగు గంటల పాటు కష్టపడి మోహన్‌తో కలిసి పెరుంగలతూర్లోని ఓ ఆసుపత్రిలో చిత్రను చేర్పించాడు యూనస్. ఆసుపత్రిలో రెండు రోజులపాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆమె, చివరకు ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమ ప్రాణాలను కాపాడిన యూనస్‌కు కృతజ్ఞతగా తమ బిడ్డకు యూనస్ అన్న పేరు పెట్టుకున్నారు చిత్ర–మోహన్ దంపతులు. ‘ఒక మనిషికి సాయం చేయాలన్న ఆలోచనే ఎప్పుడూ మనల్ని ముందుకు తీసుకెళుతుంది’ అంటూ యూనస్ చెప్పిన మాటను చిత్ర దంపతులు ఇప్పటికీ మరచిపోలేదు. మనిషికి సాయం చేయాలన్న యూనస్ ఆలోచన ఎప్పటికీ వర్ధిల్లుతూనే ఉంటుంది. భాయ్.. తుఝే సలామ్! కట్టె కాలే దాకా తోడున్నాడు..! ‘ఊపిరాగే వరకూ నీ తోడుంటా’నంటాడు స్నేహితుడు. స్నేహం గొప్పదనమది. సంతోష్ సింగ్, రజాక్ ఖాన్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. సంతోష్‌ను దేవుడు ముందే పిలిచేశాడు. అతడి అంత్యక్రియలు జరపడానికి భార్య, పిల్లలు తప్ప ఇంకెవ్వరూ లేరు. వారు కాకుండా ఉన్న ఒకే ఒక్క అయినవాడు రజాక్ ఖాన్. ముస్లిం అయిన రజాక్, ఏదీ ఆలోచించకుండా సంతోష్ అంత్యక్రియలను స్వయంగా నిర్వహించాడు. తనే తలకొరివి పెట్టడంతో పాటు, హిందూ సాంప్రదాయ పద్ధతులన్నీ పాటించి సంతోష్ దహన సంస్కారాలు నిర్వహించాడు రజాక్ ఖాన్. సంతోష్ భార్య, కూతురు బాగుండాలని వారికి తనవంతు ఆర్థిక సాయం కూడా అందించాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ సంఘటన స్నేహమనే బంధానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపించింది. పరమవీర భారతీయుడు.. 1965లో ఇండియా–పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఆర్మీ ఆఫీసర్ అబ్దుల్ హమీద్ ఒంటిచేత్తో అరడజన్కు పైగా పాకిస్థాన్ యుద్ధ ట్యాంక్‌లను ధ్వంసం చేశారు. ఆ తర్వాత అదే యుద్ధంలో చనిపోయిన ఆయన, ఇండియన్ ఆర్మీలో చెరగని ముద్ర వేసిన హీరో. పరమ వీర చక్ర అవార్డు గ్రహీత. ఆయన నలుగురు కుమారుల్లో ఇద్దరు ఆర్మీకి పనిచేశారు. తాజాగా హమీద్ మనవడు సిరాజ్ కూడా ఆర్మీకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. సిరాజ్ అతిచిన్న వయసు నుంచే తన తాత గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ వస్తున్నాడు. ‘తాతపేరు తలచుకున్నప్పుడల్లా దేశానికి సేవ చేయాలన్న ఆలోచన మరింత బలపడుతుంది. ఆర్మీకి పనిచేయాలన్నది నా కల. నా స్నేహితులను కూడా ఈ దిశగా ప్రోత్సహిస్తున్నా. మేమిప్పుడు పదిమంది ఆర్మీలో చేరేందుకు కష్టపడుతున్నాం’ అంటున్నాడు సిరాజ్. హైద్రాబాద్‌లోని పాతబస్తీలోనూ ఓ కుటుంబం మూడు తరాలుగా దేశసేవకే అంకితమవుతూ వస్తోంది. తాత, తండ్రులిద్దరూ ఆర్మీలో దేశకోసం పోరాడిన మాదిరే, తానూ అదే బాటలో వెళ్ళాలని చిన్నప్పట్నుంచే కలలుగన్నాడు ఫిరోజ్ ఖాన్. 2003లో ఆర్మీలో చేరాడు. పదేళ్ళపాటు సరిహద్దుల్లో దేశం కోసం సేవ చేసి 2013లో పాకిస్థాన్ ముష్కరుల దాడిలో చనిపోయాడు.దేశ సేవకు అంకితమైన ఇలాంటి కుటుంబాలన్నీ, సమాజానికి ప్రతీ తరం ద్వారా ఒక్కో కథను చెప్తున్నాయి, ఒక్కో ఆలోచనను పరిచయం చేస్తున్నాయి. ఆ ముస్లిం రైతు గుండె.. ఓ హిందూ ప్రాణాన్ని బతికించింది! గుజరాత్‌లోని సోద్ వద్లా ప్రాంతానికి చెందిన ఆసిఫ్ జునేజా అనే ఓ రైతు గతేడాది డిసెంబర్లో ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఒక ప్రైవేటు హాస్పిటల్లో అతడిని చేర్చగా, రెండు రోజుల పోరాటం తర్వాత వైద్యులు అతడిని బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. ఇక ఇదే విషయాన్ని జునేజా కుటుంబానికి తెలియజేసిన వైద్యులు, అతడి అవయవాలను దానం చేయడం గురించి ఆలోచించమన్నారు. వైద్యులు అడిగిన దానికి వెంటనే జునేజా కుటుంబం ఒప్పేసుకుంది. ‘జునేజా అవయవాలు ఒకరి ప్రాణాన్ని బతికిస్తున్నాయంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది?’ అంటూ అతడి అవయవాల దానానికి అంగీకరించారు. ఇక అదే సమయానికి అహ్మదాబాద్‌లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అర్జాన్ అంబాలియాకు గుండె మార్పిడి అవసరం ఉంది. ఈ విషయం తెలుసుకున్న వైద్యులు, ఆసిఫ్ గుండెను వెంటనే అహ్మదాబాద్‌కు తరలించారు. అహ్మదాబాద్‌లో నాలుగు గంటల పాటు సాగిన ఆపరేషన్ విజయవంతం అయింది. అంబాలియా తిరిగి కోలుకున్నాడు. ఒక గుండెను దానం చేయడానికి ఆ కుటుంబం ఏ మతానికిస్తున్నామని ఆలోచించలేదు. ఆ గుండె ఏ మతస్తుడి శరీరంలో ఉందని ఆలోచించకుండా కొట్టుకుంటోంది. మతసామరస్యానికి ఓ గొప్ప ఉదాహరణ ఆ గుండె చప్పుడు. ఊరు బాగుండాలని కల కన్నాడు..! రాజస్థాన్‌లోని లేదీ గ్రామస్తుడైన ఆసుఖాన్కు ఊరంటే పిచ్చి. ఊరు బాగుండాలని ఎప్పుడూ కలలు కనేవాడు. ముఖ్యంగా రైతులకు ఏదైనా చేయాలని ఉండేదాయనకు. ఈ నేపథ్యంలోనే 1995లో తన ఊర్లోనే చిన్న గోశాలను ఏర్పాటు చేసి 20 ఆవులకు ఆశ్రయం కల్పించాడు. పేద రైతులకు ఆ ఆవులను తక్కువ ధరలకే అమ్మడం మొదలుపెట్టాడు. ఆవులకు వయసైపోయినట్లయితే వాటిని తన గోశాలలోనే వదిలిపెట్టమని కూడా ఒక షరతు పెట్టేవాడు. ఆసుఖాన్ ఆ గ్రామంలోని పేదరైతుల మంచి చెడ్డా చూసే పెద్దవాడయ్యాడు. క్రమక్రమంగా గోశాల పెద్దదయింది. ఆసుఖాన్ మరణం తర్వాత కూడా అది అలాగే నడుస్తూ ఉంది. ఆసుఖాన్ తమ్ముడు ఫూలే ఖాన్ ఇప్పుడు ఆ గోశాలను నడుపుతున్నాడు. ప్రస్తుతం 600లకు పైగా ఆవులు ఈ గోశాలలో ఆశ్రయం పొందుతున్నాయి. ‘మా అన్న స్థాపించిన ఈ గోశాలను ఇప్పటికీ నడుపుతూ ఉండడం, రైతులకు సాయం అందిస్తూ ఉండడం గౌరవంగా భావిస్తున్నా. నెలకు సుమారు లక్ష రూపాయల వరకూ ఖర్చవుతోంది. మా ఫ్యామిలీ సొంత డబ్బుతో పాటు ఊరి ప్రజలంతా ఇచ్చే విరాళాలతో గోశాల నడుపుతున్నా. భవిష్యత్‌లో దీన్ని మరింత పెద్దది చేయాలని అనుకుంటున్నా’ అంటున్నాడు ఫూలేఖాన్. ఊరు బాగుండాలని కలగన్న ఆసుఖాన్, అన్న కలను తనదిగా చేసుకొని ముందుకెళుతోన్న ఫూలే ఖాన్, ఇద్దరివీ గొప్ప ఆలోచనలే. సమాజం ఇష్టపడే, సమాజం కోరుకునే ఆలోచనలే! ధైర్య సాహసాలు చూపింది.. చిన్నారిని కాపాడింది! ఉత్తరప్రదేశ్‌కు చెందిన 15ఏళ్ళ నజియా ఇంటర్ చదువుతోంది. ఒకరోజు నజియా తన కాలేజీ పూర్తి చేసుకొని ఇంటికి వెళుతోన్న సమయంలో ఓ ఆరేళ్ళ చిన్నారిని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై లాక్కెళుతోన్న సంఘటన చూసింది. ఆ పాప అరుస్తూ ఉండడంతో, ఆమెను కిడ్నాప్ చేస్తున్నారన్న విషయాన్ని పసిగట్టి బైక్ వెంట పరిగెత్తింది. రెండు నిమిషాల పాటు పాపను గట్టిగా తనవైపుకు లాగుతూనే వెళ్ళింది. చుట్టూ జనం కూడా పోగవ్వడంతో పాపను అక్కడే వదిలేసి ఆ వ్యక్తులిద్దరూ పారిపోయారు. నజియా రక్షించిన ఆ పాప పేరు డింపీ. డింపీ కూడా నజియా చదువుతున్న విద్యా సంస్థల్లోనే చదువుతోంది. వెంటనే ప్రిన్సిపల్‌కు, పోలీసులకు, డింపీ తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేసింది నజియా. ‘పాప ఏడుస్తూ చేసిన అరుపులు వినగానే మరింకేం ఆలోచించలేకపోయా. వాళ్ళను ఎదిరించగలనా? లేదా? ఇవేం గుర్తురాలేదు’ అంటూ నజియా ఆ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. నజియా ధైర్య సాహసాలను మెచ్చి ప్రభుత్వం ఆమెకు రాణి లక్ష్మీబాయి బ్రేవరీ అవార్డు అందించింది. డింపీ తల్లిదండ్రులకు నజియా ఇప్పుడు పెద్ద కూతురిలా మారిపోయింది. అతిపెద్ద హిందూ దేవాలయం.. ముస్లిం ఫ్యామిలీ విరాళం..! బిహార్ రాజధాని పట్నాలో ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం నిర్మితమవుతోంది. మహావీర్ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. 200 ఎకరాల్లో 20 వేలమందికి సరిపడే స్థలంలో ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ దేవాలయం నిర్మాణానికి అవసరమైన ఆ స్థలాన్ని ఎవరిచ్చారో తెల్సా? ఒక ముస్లిం కుటుంబం! మొత్తం 200 ఎకరాల్లో ఒక్క కుటుంబానిదే 50 ఎకరాలు కాగా, ఆ కుటుంబం ఆ స్థలాన్నంతా దేవాలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చేసింది. మిగతా 150 ఎకరాలను కూడా అక్కడి ముస్లింలు తక్కువ ధరకే అమ్మేశారు. ఒక హిందూ దేవాలయానికి, అందులోనూ ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా చెప్పబడుతున్న నిర్మాణానికి ముస్లింలు స్వచ్ఛందంగా తమ స్థలాన్ని విరాళంగా ఇవ్వడం భారతదేశంలో హిందూ–ముస్లింల సఖ్యత ఏ స్థాయిదో చెప్పకనే చెబుతోంది. ఆకలికి మతం లేదు..! అజహర్ మక్సూసీ.. హైదరాబాద్‌లో నివాసముంటున్న ఇంటీరియర్ డిజైనర్. పేదరికంలో పుట్టి పెరిగిన మక్సూసీకి ఆకలి కేకలు లేని సమాజాన్ని చూడాలన్నది కల. ఒకరోజు తన కళ్ళెదుటే ఆకలితో అలమటిస్తున్న ఓ మహిళను చూశాడు. ఆమెకు అన్నం తినిపించిన రోజు ఆయనకు దేవుడేదో శక్తినిచ్చినట్టనిపించింది. ప్రతిరోజూ ఇలా ఆకలితో బాధపడేవారికి తనవంతుగా ఏదైనా సాయం చేసే శక్తినివ్వమని దేవుడిని ప్రార్థించాడు. ఆయన కోరికను ఆ దేవుడు మన్నించాడు. ఇప్పుడు అజహర్ రోజుకి 100మందికి పైగా అన్నం తినిపిస్తున్నాడు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో సానీ వెల్ఫేర్ ఫౌండేషన్ పేరుతో ఆయన సేవలు కొనసాగుతున్నాయి. ఆకలికి మతం లేదన్నది ఆయన మాట. ఎంత మంచి మాటది! ఎంతమంది కడుపులు నింపుతోందది!! బీయింగ్ హ్యూమన్ సినిమాల్లో ఆయనొక సూపర్‌స్టార్. ఆయనేం చేసినా అభిమానులది ఫాలో అయిపోతుంటారు. అలాంటి స్టార్‌కు పిల్లలంటే తెగ ఇష్టం. వారికేదైనా చేయాలని ఆరాటపడ్డాడు. బీయింగ్ హ్యూమన్ అనే సంస్థను స్థాపించాడు. ఆ స్టార్ పేరు సల్మాన్ ఖాన్. పేదవిద్యార్థుల చదువుకు, వైద్య చికిత్సలకు ఈ సంస్థ సాయం అందిస్తూ వస్తోంది. సినిమాల ద్వారా తనకొచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సల్మాన్ ఖాన్ ఈ సంస్థకు విరాళంగా ఇస్తున్నాడు. వందలమందిని కాపాడి దేవుడయ్యాడు..! ఐఎస్ఐఎస్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ. ఇరాక్, సిరియాలలో ఈ సంస్థ చేస్తున్న ఉగ్రవాద చర్యలు అన్నీ ఇన్నీ కావు. గతేడాది జూలైలో సయ్యద్ మొహమ్మద్ ష్రిన్లో ఓ భారీ ఉగ్రవాద దాడికి ఐఎస్ఐఎస్ ప్లాన్ చేసింది. ఒక సూసైడ్ బాంబర్ ఆ ప్రాంతానికి వచ్చి తన చేతుల్లోని బాంబ్ రిమోట్ నొక్కే సమయానికి అతడిని ఓ యువకుడు గట్టిగా హత్తుకొని దూరంగా లాక్కెళ్ళాడు. అప్పటికే సూసైడ్ బాంబర్ రిమోట్ నొక్కేశాడు. అతడిని లాక్కెళ్ళిన యువకుడితో సహా ఆ ప్రాంతంలో మొత్తం 37మంది ప్రాణాలు కోల్పోయారు. 70మందికి పైగా గాయపడ్డారు. సూసైడ్ బాంబర్‌ను ఆ యువకుడు లాక్కొని వెళ్ళకపోయి ఉంటే వందల్లో ప్రాణ నష్టం జరిగేదని పోలీసులు అంచనా వేశారు. ఆ యువకుడి పేరు నాజీహ్ షకీర్ అల్ బల్ద్వాయ్. తన ప్రాణాన్ని లెక్క చేయకుండా రెప్పపాటు సమయంలో సూసైడ్ బాంబర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసిన బల్ద్వాయ్, వందల మంది ప్రాణాలను కాపాడిన దేవుడయ్యాడు. బల్ద్వాయ్ శరీరం ఈ ప్రపంచాన్ని వీడిందంతే. అతడి సాహసం మనిషన్నవాడు ఉన్నంతకాలం ఊపిరి పీల్చుకుంటుంది. మరో మహిళ అలా బాధపడకూడదు అనుకున్నాడు..! 1969లో పురుడు కోసం హైదరాబాద్‌లోని నయాపూల్ వద్దనున్న ఓ ప్రభుత్వాసుపత్రికి వచ్చిందో నిండు గర్భిణి. ఆమె మార్వాడీ. ఆసుపత్రిలో కాన్పు చేయడానికి మగ డాక్టర్ మాత్రమే ఉన్నాడు. మగ డాక్టర్ అయితే తాను కాన్పు చేయించుకోనని ఆ మహిళ అలాగే నొప్పులు భరిస్తూ కూర్చుంది. తీవ్రమైన నొప్పులకు తట్టుకోలేక అలా కూర్చున్న చోటే ప్రాణాలొదిలింది. తర్వాతి రోజు పత్రికల్లో ఈ వార్త ప్రధానంగా వినిపించింది. అది చూసి చలించిపోయాడు అబ్దుల్ రజాక్. ఖిద్మతే ఖల్క్ పేరుతో ఓ సంస్థను స్థాపించి, ఆ çసంస్థ పేరున ఓ ఆసుపత్రి తెరిపించాడు. నగరంలోని డాక్టర్లను కలిసి తనకు సాయం చేయాల్సిందిగా కోరాడు. మహిళలతోనే కాన్పు చేయించాలన్న ఆలోచనతో 25 పడకలతో ఉస్మాన్‌పూర్‌లో రజాక్ ప్రారంభించిన ఆసుపత్రి ఇప్పుడు 250 పడకలతో నడుస్తోంది. రజాక్ ఖాన్ కన్న కలతో భవిష్యత్ తరం 48 సంవత్సరాలుగా పురుళ్లు పోసుకుంటూనే ఉంది.ఆ ఆసుపత్రిలో డెలివరీకోసం చేరే వాళ్లలో మార్వాడీలు, హిందూ స్త్రీలే ఎక్కువ. తిరిగిచ్చేయడంలోనే ‘థ్రిల్’ ఉంది! ప్రపంచమంతా గుర్తించే పేరొచ్చింది. తరాలకు సరిపడే సంపద వచ్చింది. తన చుట్టూ ఉన్న పరిస్థితులను ఒకసారి చూశాడు. కనీస చదువు కూడా చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న భవిష్యత్ తరం కనిపించింది. వారికేదైనా చేయాలని సంకల్పించాడు. ఒక ఫౌండేషన్ స్థాపించి, వేలకోట్ల రూపాయలు సేవ కోసం ఖర్చు చేస్తూ వస్తున్నాడు. గత మూడు సంవత్సరాల్లో సుమారు 36 వేల కోట్ల రూపాయలు ఆయన ఈ సంస్థకు విరాళంగా ఇచ్చాడు. ఆయనే విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ. ఆయన స్థాపించినదే అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్. పేదవిద్యార్థుల చదువుల కోసం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ పని చేస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో కనీస వసతులు కల్పించడం దగ్గర్నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ ఫౌండేషన్ నడుస్తోంది. ‘డబ్బు సంపాదించడంలో కనిపించిన థ్రిల్ కన్నా, ఇప్పుడు దాన్ని పంచిపెట్టడంలోనే ఎక్కువ కనిపిస్తోంది. మనచుట్టూ ఉండే సమాజం అందంగా ఉండాలన్న ఒక్క ఆలోచన చాలు.. సేవ వైపుకు అదే అడుగులు వేయి స్తుంది.’ అంటాడు ప్రేమ్‌జీ. ఆయన కల గొప్పది కదూ!? ఎన్ని వందల ముఖాల్లో నవ్వు నింపి ఉంటుందా కల!? అన్నార్తులకు ఆపద్బాంధవుడు అన్నార్తుల ఆకలి బాధలు తీరుస్తున్న సామాజిక యోధుడు జమీర్ హసన్. భారత్‌లో పుట్టి, పాకిస్థాన్‌లో పెరిగి అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డ జమీర్ ఆకలికి కుల మతాలేవీ లేవని నమ్ముతారు. ఆహారం పొందడం ఆకలితో అలమటించే వారి హక్కుగా ఆయన భావిస్తారు. వృత్తిపరంగా జమీర్ ఐటీ నిపుణుడు. ఐటీ రంగంలోని మిగిలిన వారిలాగానే ఆయన కూడా ఉద్యోగ బాధ్యతల్లో చాలాకాలం బిజీ జీవితాన్నే గడిపారు. బయట ప్రపంచంపై దృష్టి సారించలేదు. ఒకసారి కొడుకు చదువుకుంటున్న స్కూల్‌కు వెళ్లినప్పుడు ఆయనకు ‘సూప్ కిచెన్’ గురించి తెలిసింది. ఆ స్కూల్ టీచర్లు మురికివాడల్లో ఏర్పాటు చేసిన ‘సూప్ కిచెన్’ ద్వారా నిరుపేదలకు సూప్ పంపిణీ చేయడాన్ని ప్రత్యక్షంగా చూశారు. అప్పుడే ఆయనలో నిరుపేదల ఆకలి బాధను తీర్చడానికి తనవంతుగా ఏదైనా చేయాలనే ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనతోనే ఆయన ‘ముస్లిమ్స్ అగైనెస్ట్ హంగర్’, ‘ఫెయిత్స్ అగైనెస్ట్ హంగర్’, ‘హంగర్ వ్యాన్’, ‘వన్ వరల్డ్ కమ్యూనిటీ కేఫ్’లను ప్రారంభించారు. వీటికి మిత్రులు, దాతల అండ తోడవడంతో అమెరికా, కెనడాలలోని దాదాపు ఇరవై నగరాలు, పట్టణాల్లో వీటి ద్వారా నిరుపేదల ఆకలిని చల్లారుస్తున్నారు. అమెరికాలో దాదాపు 4.8 కోట్ల మంది నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారని, తనవంతుగా కొందరి ఆకలినైనా తీర్చగలగడం తనకెంతో సంతృప్తినిస్తుందని జమీర్ చెబుతారు. అతడు అడవిని సృష్టించాడు ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే నినాదం అప్పటికింకా ప్రాచుర్యంలోకి రాలేదు. చెట్లను ఎడాపెడా నరికేస్తూ పోతే వచ్చే అనర్థాల గురించి కూడా జనంలో పెద్దగా అవగాహన లేదు. అలాంటి రోజుల్లోనే అబ్దుల్ కరీం చెట్లు లేకుండా పోతే మనుషులకు నిలువనీడ లేకుండా పోతుందని గ్రహించాడు. తనకున్న వనరులతోనే ఏదైనా చేయాలనుకున్నాడు. కేరళలోని కాసరగోడ్ జిల్లా పులియంకుళం గ్రామం వద్ద కొండ దిగువగా ఉన్న ఐదెకరాల బంజరు భూమిని కొన్నాడు. ఇది సరిగా నలభయ్యేళ్ల కిందటి ముచ్చట. బంజరు భూమిని కొన్నందుకు ఇంటా బయటా అంతా అతడిని వెర్రిబాగులవాడిలా చూశారు. కొండ దిగువ బంజరులో ఏం సాగుచేస్తావని వేళాకోళంగా అడిగారు. ‘సాగు చేయడానికి కాదు, అడవిని పెంచడానికి ఆ భూమిని కొన్నాను’ అని కరీం బదులివ్వడంతో అతడిని మరింతగా వేళాకోళం చేసేవారు. ఎవరేమనుకున్నా కరీం పట్టించుకోలేదు. తన సంకల్పం నుంచి వెనుకడుగు వేయలేదు. ఎక్కడెక్కడి నుంచో రకరకాల వృక్షజాతుల మొక్కలు తెచ్చి నాటాడు. వాటి ఆలనాపాలనా చూసుకున్నాడు. ఏళ్లకు ఏళ్లు నిశ్శబ్దంగా దొర్లిపోయాయి. మొక్కలు కూడా మౌనంగానే మహావృక్షాలుగా ఎదిగాయి. నింగి వైపు తలలు ఎత్తి నిటారుగా నిలుచున్నాయి. నేల మీది మనుషులకు నీడనిచ్చే స్థాయికి చేరుకున్నాయి. ఐదెకరాల బంజరు నేల అద్భుతమైన ఆకుపచ్చని అడవిగా తయారవడంతో అబ్దుల్ కరీం మీడియా దృష్టిని ఆకర్షించాడు. మీడియా కథనాల ఫలితంగా అవార్డులు, రివార్డులు అతడిని వెతుక్కుంటూ వచ్చాయి. తానున్నా లేకున్నా తాను పెంచిన అడవి పదికాలాల పాటు పచ్చగా ఉంటుందని, తర్వాతి తరాల వాళ్లను పచ్చగా ఉంచుతుందని, ఇంతకంటే తనకు కావాల్సిందేముంటుందని వినమ్రంగా అంటాడు కరీం. దళితుల పాలిటి పెన్నిధి బిహార్‌లోని గయలో పుట్టి పెరిగాడు షఫీక్ ఉర్ రెహమాన్ ఖాన్. అసలే వెనుకబడిన ప్రాంతం. అలాంటి చోట నిరుపేద దళితుల బతుకులు ఎలా ఉంటాయో ఊహించుకోవాల్సిందే! డబ్బు కోసం ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేసేవారు. అప్పులు తీర్చలేక బడికి వెళ్లాల్సిన పిల్లలను వెట్టిచాకిరికి పంపేవారు. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వాళ్లవి. ఇంటిల్లిపాదికీ సరైన తిండి తిప్పలు ఉండేవి కాదు. పిల్లలకు చదువు సంధ్యలు ఉండేవి కాదు. ఇలాంటి సమస్యలను చిన్నప్పటి నుంచి కళ్లారా చూసేవాడు షఫీక్. దళితుల సమస్యలపై కలత చెందేవాడు. పెద్దయ్యాక వాళ్లకు ఏదోలా చేతనైనంత సాయం చేయాలనుకునేవాడు. చదువుకుంటున్న దశలోనే తోటి కుర్రాళ్లతో కలసి దళిత వాడల్లో స్వచ్ఛంద సేవకు నడుం బిగించాడు. చదువు పూర్తయ్యాక 2005లో ‘ఎంపవర్ పీపుల్’ పేరిట స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి, గయతో పాటు బిహార్, జార్ఖండ్‌లలోని చుట్టుపక్కల ప్రాంతాలకూ తన సేవలను విస్తరించాడు. మొదట్లో బడికి వెళ్లలేని పిల్లలకే కాదు, అక్షరజ్ఞానం లేని పెద్దలకు కూడా పాఠాలు చెప్పసాగాడు. క్రమంగా ఇతర సమస్యలపైనా దృష్టి సారించాడు. బాల్య వివాహాలు, ఆడ శిశువుల భ్రూణహత్యలు, పెళ్లిళ్ల పేరిట బాలికల అక్రమ రవాణా, మనుషుల అక్రమ రవాణా, వెట్టిచాకిరి వంటి సమస్యలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు. తన పోరాటంలో బాధితులైన దళితులనూ భాగస్వాములుగా చేసుకున్నాడు. స్వావలంబన కల్పించడం ద్వారా దళితుల బతుకుల్లో వెలుగులు నింపాలనేదే తన ఆశయమని చెబుతాడు షఫీక్. బాలికలకు చదువుల తల్లి పేదరికం వల్ల చదువుకు దూరమవుతున్న బాలికల సంఖ్య మన దేశంలో తక్కువేమీ కాదు. బాలికలను చదువులకు చేరువ చేస్తేనే సమాజంలో సమూలంగా మార్పు వస్తుందని నమ్ముతారు సఫీనా హుసేన్. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డిగ్రీ పొందారు. స్వదేశానికి తిరిగి వచ్చేశాక రాజస్థాన్‌లోని వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి సారించారు. బాల్య వివాహాలు, వెట్టిచాకిరీ వంటి సమస్యలను దగ్గరగా గమనించారు. రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో మధ్యలోనే చదువు మానేస్తున్న బాలికల సంఖ్య ఎక్కువగా ఉంటుండటం సఫీనాను కలవరపెట్టింది. బాలికలను బడి బాట పట్టించేందుకు ఆమె ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో ‘టీమ్ బాలికా’ పేరిట బాలికల బృందాలను ఏర్పరచారు. బాలికల బృందాల సహాయంతో చదువుకు దూరమవుతున్న బాలికలను గుర్తించి, వారిని బడి బాట పట్టించడంలో సత్ఫలితాలను సాధించారు. తొలుత 2008లో 500 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం దాదాపు 13 వేల పాఠశాలలకు విస్తరించారు. రాజస్థాన్‌లో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో దీనిని దక్షిణ అమెరికా, ఆఫ్రికాలలోని వెనుకబడిన దేశాలలోనూ ప్రారంభించారు. బాలికల చదువుపై ఎందుకు ఇంతగా శ్రద్ధ తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే, బాలికలకు చదువు చెప్పిస్తే మొత్తం సమాజమే స్వావలంబన సాధిస్తుందని, అందుకే తనవంతు కృషి కొనసాగిస్తున్నానని చెబుతారు సఫీనా. అనాథాశ్రమానికి స్థలదానం బ్యాంకు ఉద్యోగం చేస్తున్న షేక్ ఫైజుద్దీన్కు సామాజిక సేవపై ఆసక్తి ఉండేది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (అప్పట్లో ఖమ్మం జిల్లా) ములకలపల్లి మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు మేనేజర్‌గా పనిచేసే సమయంలో మడి వెంకటేశ్వర్లు అనే గిరిజనుడు ఒక పూరిపాకలో నలుగురు అనాథలను సాకుతుండటాన్ని చూశారు. అలాంటి అనాథల కోసం తాను కూడా ఏదైనా చేయాలని తలపోశారు ఫైజుద్దీన్. అనాథాశ్రమం కోసం 2004లో ఆయన ఒకటిన్నర ఎకరాల స్థలాన్ని కొని ఇచ్చారు. ప్రస్తుతం ఆ స్థలంలో చక్కని వసతులతో నిర్మించిన ఆశ్రమంలో 45 మంది గిరిజన అనాథ బాలబాలికలు ఆశ్రయం పొందుతున్నారు. ఆలయానికి స్థలదానం... ప్రతి వేసవిలో జలదానం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లికి చెందిన మహమ్మద్ రఫీయుద్దీన్ అటవీశాఖలో చిరుద్యోగి. చేసే ఉద్యోగం చిన్నదే అయినా రఫీయుద్దీన్ మనసు పెద్దది. ఉన్నంతలోనే సాటివారికి సాయం చేసే మనస్తత్వం. గ్రామంలో సాయిబాబా ఆలయ నిర్మాణం కోసం స్థలం కొని ఇచ్చారు. మసీదు నిర్మాణానికి తనవంతు సాయం చేశారు. గ్రామస్థుల దాహార్తి తీర్చేందుకు 1988లో గ్రామం నడిబొడ్డున చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆరేళ్ల కిందట రఫీయుద్దీన్ మరణించినా, ఆయన కొడుకులు జహీరుద్దీన్, తాజుద్దీన్లు తండ్రి ఆశయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఏటా వేసవిలో చలివేంద్రాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. మండే ఎండలను దృష్టిలో ఉంచుకుని వారు చలివేంద్రంలో ఫ్రిజ్ కూడా ఏర్పాటు చేయడం విశేషం. నిరుపేదలకు ఆర్థికంగా చేయూత... బడుగు బతుకులు వెళ్లదీసే నిరుపేదలు ఆర్థిక స్వావలంబన సాధించడం ఆషామాషీ కాదు. సొంత వ్యాపారాలు పెట్టుకుని నిలదొక్కుకుందామనుకునే నిరుపేదలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు అంతగా ఆసక్తి చూపే పరిస్థితులు ఉండవు. ఒకవేళ రుణాలు ఇచ్చినా, వడ్డీ భారం తట్టుకోవడం పేద బతుకులకు కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో నిరుపేదలకు స్వావలంబన కల్పించాలనే ఉద్దేశంతో ముందుకొచ్చారు అబ్దుల్ జలీల్. తన మిత్రుడు వలీయుద్దీన్ ఫారుకీతో కలసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి, పేదల స్వయం ఉపాధి కోసం వడ్డీలేని రుణాలు ఇవ్వడం ప్రారంభించారు. జలీల్, ఫారుకీల చలవ వల్ల ఎందరో పేదలు జీవితంలో నిలదొక్కుకోగలిగారు. -
తెలుగులో ఖురాన్
రంజాన్ స్పెషల్ మొదటిసారి సరళీకరించిన కంభం వాసి ఇస్లాంలోని అంశాలను తెలియజేసే ఖురాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. రంజాన్ మాసంలో అవతరించిన ఈ దివ్య గ్రంథం శాంతి.. సమానత్వం.. సేవా గుణాలకు ప్రతీకగా నిలుస్తుంది. గతంలో ఇతర భాషల్లోనే అనువాదమైన ఖురాన్‌ను ఎలాగైనా తెలుగులోకి తర్జుమా చేసి రాష్ట్ర ప్రజలకు అంకితమివ్వాలనే ఆలోచన మొట్టమొదటిగా కంభం వాసికి కలిగింది. అరబిక్, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ వంటి 30కి పైగా వివిధ భాషల్లో అచ్చయిన ఖురాన్ అప్పటికింకా తెలుగు ప్రజలకు సరిగా అందుబాటులోకి రాలేదు. దీనిపై కలత చెందిన అబ్దుల్ గఫూర్ చివరకు తెలుగులో సరళీకరించారు. ఎవరీ గఫూర్ ఇస్లాంపై మమకారంతో అబ్దుల్ గఫూర్ 1946లో కంభంలో తన నివాసం పక్కనే మసీదు నిర్మించారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ వెళ్లి దారుల్ ఉలూమ్ దేవబంద్‌లో మౌల్వి కోర్సు పూర్తి చేశారు. అప్పటి నుంచి ఆయన పేరు మౌల్వి అబ్దుల్ గఫూర్‌గా మారింది. కొంత కాలం కర్నూల్ ఇస్లామియా అరబిక్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆ కళాశాల ఇంకా ఉంది. ఈ నేపథ్యంలో తన కల సాకారం చేసుకోవడానికి ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు. కంభంలో ఆయన నిర్మించిన మసీదులో కూర్చొని ఖరాన్‌ను 3 భాగాలుగా తెలుగులోకి అనువదించారు. ఇదే సమయంలో ఓ వైపు అరబిక్ లిపి, దాని పక్కనే తెలుగులిపి, మరో పక్క పూర్తి తెలుగులో అర్థంతో పాటు, ఇంగ్లీషు లిపి కూడా రాశారు. 1948 నాటికి పుస్తకం ముద్రించారు. మరికొన్ని గ్రంథాలు గఫూర్.. ఖురాన్‌తో పాటు మహ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర, మిష్కాత్ షరీఫ్ పుస్తకాలను కూడా రచించారు. ఈయనకు ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు అమ్మాయిలున్నట్లు తెలిసింది. ఖురాన్ అనువాదం తర్వాత మక్కాకు వెళ్లారు. అయితే మక్కా యాత్ర చేసిన ఫొటోలు ఉండకూడదని వాటిని తగులబెట్టారట. గఫూర్ అనువాదం తర్వాత 1978లో విజయవాడ వాసి హమీదుల్లా షరీఫ్.. ఉర్దూలోని ఖురాన్‌ను తెలుగులోకి అనువదించారు. కోట్లాది మంది కంఠస్తం చేసిన ఖురాన్ ఖుర్ఆన్ అనే పదం ‘‘ఖిరాత్’’ నుంచి వచ్చింది. ఖిరాత్ అంటే చదవడం, ఖుర్ఆన్ అంటే పదేపదే చదవబడే పుస్తకం అని అర్థం. అల్లాహ్ ఈ దివ్యగ్రంధాన్ని జీబ్రాలాల్ దైవదూత ద్వారా అవ తరింపచేశాడు. ఖుర్ఆన్కు పుర్ఖాన్, హుదా, ఖుష్రా, జిక్రా, ఆల్కితాబ్, షిఫా అనే పేర్లు కూడా ఉన్నాయి. ఖుర్ఆన్ను కంఠస్తం చేసినవారు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల మంది వరకు ఉంటారని అంచనా. దివ్య ఖురాన్ మక్కానగరంలో 10 సంవత్సరాలు, మదీనాలో 13 సంవత్సరాల పాటు అవతరించింది. మక్కాలో అవతరించిన అధ్యాయాలను మక్కా అవతరణ అని , మదీనాలో అవతరించిన అధ్యాయాలను మదీనా అవతరణ అని అంటారు. - కంభం రూరల్ 128 మంది నమాజ్ చేస్తున్నారు: డాక్టర్ ఖాసీం అన్వర్: మౌల్వి అబ్దుల్ గఫూర్ తమ్ముడు మా అన్న మౌల్వి అబ్దుల్ కట్టిన మసీదుకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నా. ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు వీలుగా ఆయన స్థలాన్ని కొని.. మసీదు కట్టించారు. ప్రస్తుతం ఇక్కడ 128 మందికి పైగా నమాజ్ చేస్తున్నారు. ఆయన పేరు మీద బిలాల్ మసీదులో మదర్సా ఏర్పాటు చేశాడు. -
చింతలపూడిలో హరీరా స్పెషల్