రేపటి నవ్వు

funday story to in this week - Sakshi

ఈవారం కథ

సూర్యుడు నడినెత్తి మీంచి కిందకి దిగి చాలా సేపయ్యింది.అప్పటికి జనాలు కూడా కాస్తంత పలచబడ్దారు. కడుపులో ఖాళీ ప్రేవుల కదన కుతూహలం.. దిగులు మేఘాలుగా మారి ముఖమంతా కమ్ముకొస్తున్నా అయిదారు గంటల్నించీ అతనక్కడే కూర్చునున్నాడు.మఖలో పుట్టి పుబ్బలో మాయమైనట్టు ఘడియ ఘడియకీ ఆ వైపొచ్చే, వెళ్ళే వాళ్ల రాకపోకలు, అతని ముఖంలో ఆశ నిరాశలకు క్షణకాలం జీవం పోస్తున్నాయి.సరిగ్గా వాళ్లు తన ముందుకి వచ్చారనుకున్నప్పుడు లోపలెక్కడో ఉండి, వెతికితే తప్ప కనబడని అతని కళ్లు, పున్నమి చంద్రుని వెలుగు నింపుకుని వాళ్లనీ, తన ముందు పరచి ఉన్న పాత గోను సంచి మీద కుప్పలా పోసున్న ఎండు చింతగుల్లల్నీ మార్చి మార్చి చూస్తున్నాయి. వాళ్లెళ్లిపోయిన మరుక్షణంలో అమావాస్య చంద్రుడవుతున్నాడతను. ఆ క్షణకాలం ఊపిరిని  ఆగమని శాసించి, ఆశల దోసిళ్లను చాస్తూ యుద్ధ విరమణ చేసిన ప్రేవులు అంతలోనే విజృంభిస్తున్నాయి.క్షణ క్షణానికీ అతనితో చీకటి వెలుగుల దోబూచులాట. నిమిష నిమిషానికీ.. అతనికీ, చతికిలబడ్డ ప్రేవులకీ అలుపులేని బతుకాట. అక్కడంతా అలుపులేని పోరాటమే.

అప్పుడే అణగారిపోతూ, అంతలోనే ఆశలకి ఆయువు పోస్తూ.. అతని ముందు రాశి పోసిన కుప్పలా ఎండిపోయిన చింతగుల్లలు.అంతా చేసి ఏడెనిమిది కిలోలకంటే ఉండవవి. ఎన్నుంటేనేం? అవతని రెక్కల కష్టం. ఎంత కష్టపడ్దాడో వాటిని చింతచెట్టు నుండి రాలగొట్టటానికి. కొట్టటం ఒక ఎత్తయితే, తొక్కితే ఎక్కడ పెచ్చులు పగిలిపోయి చింతపండుకి మట్టి అంటుకుంటుందోనని అతి జాగ్రత్తగా  వాటన్నింటినీ తొక్కకుండా ఎప్పటికప్పుడు ఏరటం ఒకెత్తు.ఆ ప్రక్రియలో బరువైన కర్రతో చేతిని పద్దాకా ఆడించాల్సి రావటమే కాదు.. కాయ పడ్డప్పుడల్లా ఎక్కడ పడిందో అక్కడంతా ఇంతెత్తున ఉన్న చెత్తలో వెతికి వెతికి వంగుని తియ్యాల్సి రావటం. చెప్పుల్లేని కాళ్లల్లో ముళ్లే గుచ్చుకున్నాయో, పుల్లలే దిగబడ్డాయో గానీ ఆ మాత్రం కాయలు దొరికేసరికి చేతుల్తో పాటూ కాళ్లూ పచ్చి పుళ్లే.కాలం కదుల్తున్న కొద్దీ అతని కళ్లలో అప్పటిదాకా పెరిగిన ఆశ, రాశి మీదనుండి రాలుతున్న చింతకాయల్లా దిగజారి పోతూండగా, పెరిగే ఆకలి మూలుగుల్ని తట్టుకోలేని పెరిగిన చేవ చచ్చిన వయసు. అంతకంతకీ నడిరేయి చింతనావరించిన నీడలా ఆక్రమిస్తున్న నీరసం.

కడుపులో వికారం మొదలై నోట్లో నీరూరసాగింది. ఎక్కడ వాంతవుతుందోనని చిన్న చింతపిక్క గుల్లఒలిచి నోట్లో వేసుకున్నాడేమో.. పుల్లగా ఉండేసరికి తుపుక్కున ఊసేసేడు కళ్లు చికిలిస్తూ. అప్పటికే ఆ పక్కోళ్లూ, ఈ పక్కోళ్లూ.. తెచ్చుకున్న వాటి మూతలు తెరిచారు.కబుర్లాడుకుంటా తింటూ తింటూ మధ్యమధ్యలో ఆ పక్కన ఆక్కూర పరుచుకు కూర్చున్న అమరయ్య ఒకటికి రెండుసార్లు చెప్పాడు కూడాను.. ‘‘చూడబోతే కొత్తాళ్లా ఉన్నావ్‌..  అల్లక్కడే కొంచెం ముందుకెల్తే కేంటీన్‌ ఉంటది. తిన్రా.. పో. నేను చూస్తా ఉంటా. ఎవురైనా వత్తే నే ఇత్తాలే పొయ్రా అయ్యా’’ అని.మెల్లగా అతనికేసి చూసి తలతిప్పేసేడు తప్ప బదులియ్యలేదు.‘‘ఏవూరి సింతది?’’ అమరయ్యన్నాడు ముద్దని నోటినిండా కూరుకుంటానే.. వెనక్కి తిరిగి వెడల్పాటి చింతగుల్లల గట్టకేసి చూపుసారిస్తా.‘‘మావూరిదేం’’‘‘ఎవర్రాలగొట్టేరేటి?’’‘‘నేనే’’.బుర్ర తిప్పి ఇటు చూసేడా పక్కాయన. క్షణకాలం చూపతని మీదే నిలిపి... ‘‘ఏటి నువ్వా?’’ అన్నాడు. ‘‘ఆ..’’ అన్నాడు పీలగా.అమరయ్య చాలాసేపటికి మళ్లీ మాట్లాడాడు – ‘‘ఈ సెట్టు కొత్తగా మొల్సిందా ఏటి? నిన్నెప్పుడూ ఈడ్న సూసిన గురుతే లేదు పెద్దయ్యా’’‘‘రానప్పుడెలా సూత్తావ్‌ లే’’ చిన్నబుచ్చుకోలేదితను.‘‘అద్గదీ సంగతి. మాయావిడతో అంటానే ఉన్నాన్నేను. ఈ మడిసి ఇంతకుముందెప్పుడూ ఇటో అడుగెయ్యగా నే సూళ్ళేదని’’‘‘నాకేంపని ఈడ్న. పచ్చల్లట్టుకుని వొటేల్లకు బోవటం, అడిగినకాడికి ఏసేసి ఆమట్ని ఇంటికి ఎల్లటం.ఈడకొచ్చి నేనేటిజయ్యాల’’ నోట్లో నోట్లో అనుకున్నా వినపడనే వినపడింది అమరయ్యకి. ‘‘అద్సర్లేగానీ.. ఏం దినొచ్చావో గానీ కూడుకి బొమ్మంటే బోవు. ఆడ అడుక్కిబోతే మనకేనట్తం. పైసలేం తగ్గిచ్చడు కేంటీనోడు. బొయ్‌ రమ్మంటే నీగ్గాదా సెప్పేది పొయ్యో ముద్దేసుకురా నే కాపుంటాగా!’’ అన్నాడు అమరయ్య సొతంత్రించి.

కాయలెగదోత్తా కూకున్నాడుదప్ప నోరిప్పలేదు ముసిలాయన.కాసేపు చూసి మళ్ళీ అతనే, ‘‘కాదుగాని పెద్దాయనా నేనోటి జప్తా ఇంటా? పొద్దుననగా వచ్చేవు. కాయకదల్లేదు. ఓ ముద్దేసుకొచ్చి ఆ గుల్లలన్నీ వల్చి పడెయ్‌. అమ్ముడవ్వాపోతే నన్నడుగు. అసలే కొత్త సింతపండు. మాంచి బంగారం రంగులో మెరిసిపోద్ది. నిమిసాల్లో ఎత్తూపోతారయ్యా. నేనెంతుకు సెప్తున్నానో నా మాటిను. ఏదీ పట్టు నే సాయవొత్తాగానీ’’ అంటా గబుక్కునో కాయ సేతిలోకి తీసుకుని రెండు గుల్లలు తీసాడో లేదో.. గుంజుకున్నాడు ముసిలోడు, తన తోలే వలిచేసినంత ఇదైపోతా.  తెల్లబోయేడు అమరయ్య. ‘‘కావాల్సినోల్లే వత్తారయ్యా! అందాకా సూత్తాగానీ వలవను. ఒకటా రెండా ఇన్నేసి కాయలు. నేనిట్తనే ఇచ్చేత్తా’’ ఖరాఖండీగా చెప్పేశాడు.అమరయ్య మళ్లీ నోరెత్తలేదు.ముఖవిటు తిప్పుకున్నాడు పెద్దాయన. కాయలొంక చూసేడు. మళ్ళీ మళ్ళీ చూసేడు. అందులో ప్రతి కాయా తన చేత్తో ఏరిందే. ఒక్క పిక్కున్న ఒంటికాయతో సహా. మనవడు గుర్తొచ్చేడతనికి. మనసు మూలిగింది నీరసంగా. మళ్ళీ సూడ్నే లేదనుకున్నాడు. రాజారావ్‌ సెప్తే తప్ప.. పిల్లాడు గుర్తురానందుకు తిట్టుకోన్నిమిషం లేదు.  ‘‘ఇంతకీ ఏంజేసేవోడివో సెప్పనే లేదు’’ తీరిగ్గా బీడీ ముట్టిస్తా అన్నాడా పక్కాయన అమరయ్య. ‘‘పచ్చళ్లమ్మేటోణ్ణి..’’ తల తిప్పకుండానే బదులిచ్చేడీయన.లక్ష్మమ్మ గుర్తుకొచ్చిందతనికి. ఆమెతో పాటే నోటిని ఊటబావిని చేస్తా... పచ్చళ్లు కూడా.ఒంట్లో ఓపికున్నప్పుడు ఊళ్లో రైతులు పెట్టిన పచ్చళ్లు కేజీలు, రెండు కేజీల్లెక్కన తూయించుకుని పట్నం పట్టుకెల్లి చిన్న చిన్న హోటల్లలో, బస్తీల్లో అమ్మేవాడు. అలా అయిదార్రకాల పచ్చళ్లు తట్ట నిండినన్నీ పట్టుకెల్లి అయినకాడికి అమ్మేసి సందేలకి ఇల్లు చేరేవోడు.పగలంతా పచ్చళ్లట్టుకుని అతను పట్నానికి అమ్మకాలకి పోతే, తట్టలో తక్కిడీ, తూకం రాళ్లేసుకున్న లక్ష్మమ్మ తట్టని నెత్తిన మోస్తా ఊరంతా తిరిగి పచ్చళ్లు తూయించుకుని సందేలకి సిద్ధం చేసి ఉంచేది మర్నాటి అమ్మకాలకి. వాటినట్టుకుని పొద్దున్నే సైకిలేసుకుని బయలుదేరేవాడు.  

ఒకోనాడు అతను వస్తూ వస్తూనే ఎవళ్లో వోటేలోళ్లు ఇచ్చేరని పకోడీల పొట్లాం పెళ్లాం చేతిలో పెట్టేవోడు. అప్పటికే వంట చేసేసి ఉంచేదేమో వాటిన్నంజుకుని అన్నం తినేటోళ్లు.ఉన్న ఒక్కగానొక్క పిల్లకీ పెళ్లి చేసి పంపేసేరేమో, పచ్చళ్ల అమ్మకాల్తో బాగానే బతికేవారు, యానాదిరావు వాళ్ల బతుకుల్లోకి వచ్చేదాకా.యానాదిరావు వడ్డీ యాపారం చేస్తాడు. అంతకుముందు రెండు మూడేళ్లు అయ్యుంటదేమో పొట్ట చేతబట్టుకుని తూర్పు సైడు నించి ఈ ప్రాంతాలకొచ్చి. రోజువారీ వసూళ్లతో ఏ పొద్దు చూసినా పూలరంగళ్లా తయారై ఇస్త్రీ మడత నలక్కుండా సైకిలేసుకుని తిరుగుతూనే ఉండేవాడు. వంద అప్పడిగితే తొంభై చేతిలో పెట్టి వందని ఖాతాలో రాసుకునేవాడు. రోజుకి పది రూపాయల చొప్పున పది రోజులపాటు కట్టే ఒప్పందం మీద వడ్డీ డబ్బులు పది రూపాయలూ ముందే తీసేసుకునేవాడు. అప్పుడప్పుడూ పిల్లకేదైనా కొనాలంటే యానాదిరావే అయ్యేవోడు వాళ్లిద్దరికీ. అలాంటిది ఒకనాడు తన రోజువారీ బాకీ తీసేసుకున్నాక తీరిగ్గా కూర్చుని లక్ష్మమ్మ ఇచ్చిన టీ సుక్క చప్పరిస్తా అతన్తో అన్నాడు – ‘‘ఒంట్లో సత్తువుంది గదా! ఎన్నాల్లిలా ఆళ్లూ ఈళ్లూ పెట్టిన పచ్చళ్లు అమ్ముకుంటా బతుకుతా? ఆమె ఊరంతా తిరిగి కొంటం, నువ్వమ్మటం. ఇద్దరి రెక్కల కష్టం మీద ఎనకేసిందెంతో చూపిచ్చు. రేపు పిల్ల పురుడుకొత్తది. మరింత అవసరం పడద్ది. అప్పుడేంజేత్తా? అదే అంటన్నా? నీకు రాదా పచ్చళ్లెడతం? ఇప్పుడు నువ్వెంత సంపాదిత్తన్నావో అంతకి అయిదారింతలు తక్కువరాదు. పెళ్లాం తోడుంది..’’ రెచ్చగొట్టేడు.

‘‘ఆ.. మాటలేటి పచ్చళ్లెట్టటవంటే? నువ్వు బాగానే చెప్తావ్‌? వందా రెండొందల్తో అయ్యే పనా? ఎన్ని డబ్బులుండాలి?’’ అన్నాడతను ఎటోచూత్తా.‘‘ఏం గావాలయ్యా నీకు? సెప్పు ఎంతగావాల్నో! ఈళ్లంతా అయిన రకం కాయలు  తెచ్చి పెట్టేత్నారా ఏటి పచ్చళ్లు? నాసిరకం మిరపకాయలూ, నాసిరకం కారం, నాసిరకం కాయలు, ఏ రకానికా రకవే దొరుకుతాయ్‌ బజార్లో. ఆ మాత్రం నువ్వు సెయ్యలేవా? నువ్వు వూ..అను. డబ్బుల సంగతి నాకొదిలెయ్‌..’’ అనేసరికి ముఖాముఖాలు చూసుకుని బాగనే ఉందనుకున్నారు మొగుడూ, పెళ్లాం. దాంతో సరేనన్నారు.లాభం తీసేసుకుని మిగతాది చేతిలో పెట్టేడు యానాదిరావు.ఆ మర్నాడే భార్యాభర్తలిద్దరూ పట్నం వెళ్లి పెద్ద పెద్ద బానలే కాకుండా మార్కెట్‌ యార్డుకి పోయి బత్తా నాసిరకం ఎండు మిరపకాయలు, అరబత్తా కల్లుప్పూ కొనేసి నాటురిక్షా కట్టుకుని ఊసులాడుకుంటా ఇంటికొచ్చేసేరు.ఎండు మిరపకాయలకి ముచ్చికలు తీత్తంటే యానాదిరావొచ్చి తిట్టేడు, ‘‘కావాలని కారంలో పొట్టు కలిపి మరీ అమ్ముతుంటే ఉన్న ముచ్చిగ్గూడా ఒలిసేసి నిఖార్సైన పచ్చడెట్టేద్దావనే..’’ అంటా.   ‘‘అట్టొద్దులే అయ్యా! మన మీదన ఇస్వాసంతో ఆబగా నోట్టో ముద్దెట్టుకుంటారు, ఎంతో రుసిగా ఉంటాయని. సేసిందేదో నాన్నేంగా సెయ్యాలా!’’ అంటా ఆమట్నే ఎండలో మిరపకాయల్ని పోసేసింది లక్ష్మమ్మ.  కారం కొట్టడం, జల్లిచ్చటం అన్నీ లక్ష్మమ్మే చూసుకుంది. అన్నీ సిద్ధమయ్యాయనుకున్నాక నిమ్మకాయలు కొనుక్కొచ్చి కోసి ఊరేసి పచ్చడెట్టేరు. పెరిగిపోయేయి అమ్మకాలు. తొలి దినాల్లో నిమ్మకాయల్తో మొదలైన పచ్చళ్లేపారం మాగాయో, ఆవకాయో, ఆవతొక్కు, టమాటా, గోంగూరా, ఉసిరికాయల్లాంటి అయిదారు పచ్చళ్లకి ఎగబాకింది యాపారం.

అప్పు తీసుకుంటానూ ఉన్నాడు, నెలొచ్చేతలికి యానాదిరావు జమచేసుకుంటూనూ ఉన్నాడు. నిండా పచ్చళ్లతో కళకళలాడతన్న కడవల మీద సీవండి పళ్ళేలు మూతలేసి వాటిని గట్టేరు. సొంత పచ్చళ్లని ఒకటికి రెండుసార్లు చెప్పేతలికి హోటల్‌ ఆర్డర్లు పెరిగాయేమో వాటిని అమ్మగా వచ్చిన డబ్బుల్తో పాకనేయిద్దావని తాటాకు కొని ఎండలో మేటేసేడు, పాకనేసాకా పిల్లని పురిటికి తీసుకురావచ్చని.ఇక రేపో మాపో పాకనేయిత్తాడనగా.. అమ్మాయి ఇంటి నించి కబురు. పిల్లకి ఏడో నెల్లోనే ఉన్నట్టుండి నొప్పులు రావటం, అతి కష్టం మీద  బిడ్డ పుట్టెయ్యటం, తల్లిప్రాణం ప్రమాదంలో ఉందని, పట్నం తీసుకెళ్లమని ఆరెంపీ డాక్టరు చెప్పేసరికి హాస్పిటల్‌కి తీసుకెళ్లేలోపే పిల్ల పోయిందని, ఉన్నపళంగా బయల్దేరి రమ్మని.గుండెలు బాదుకుంటా అప్పటికప్పుడు బయల్దేరెల్లేరేమో భార్యాభర్తలిద్దరూ గోరు చుట్టు మీద రోకటి పోటన్నట్టు వారం తిరక్కుండా, వాళ్లింకా అక్కడ ఉండగానే ఊళ్లో ఉన్నట్టుండి వచ్చిన ఈదురుగాలికి, పాకమీద ఆకుల్లేచిపోయి టపారం మొత్తం లేచిపోయిందేమో అత్తారబతంగా ఆవుపేడెట్టి అలుక్కుని ముగ్గులెట్టుకున్న నేల తాత్తా వానకి నాని దూలాలు కూలి బానలన్నీ ముక్కలవగా బతుకు బజారుపాలయ్యింది.

వానకే కాదు వడ్డీకి మనసుండదేమో యానాదిరావు పీకల మీదకెక్కాడు.పెళ్ళావేమో పిల్ల మీద మనేదతో గుక్కెడు నీళ్లు కూడా మింగమనసవ్వక మంచవెక్కింది. స్థలానికి చెందిన పేపర్లన్నీ వాన్లో తడిచి కుక్కనాలుకలయ్యే సరికి  ‘‘ఆ సంగతి నాకొదిలెయ్‌’’ అన్న యానాదిరావు మాటల్తో ఉన్న రెండు సెంట్ల చెక్కా యానాదిరావు పాలయ్యింది.అయ్యన్నీ చూడ్డానికేనా బతికుందన్నట్టు్ట లక్ష్మమ్మ నిద్దట్లోనే కన్నుమూసింది.తింటాకీ ఉంటాకే కాదు, మాటకీ మంతికీ కూడా మనిషి లేకపోయేసరికి మనేదెట్టుకున్న అతను ఉన్నట్టుండి పాతికేళ్లు పెద్దోళ్లా అయిపోయాడు. పిచ్చోడల్లే రోడ్లట్టుకు తిరుగుతుంటే, అంతకు ముందు ఊళ్లో అతనికి పచ్చళ్లమ్మిన రాజారావ్‌ చూసి, ‘‘తీరాజూత్తే మూణ్ణాలుగేళ్లవలేదు పురాగా ఆ యానాదిరావు ఈ ఊరొచ్చి. కళ్లముందే నీ నించి లాక్కున్న స్థలంలో కాంక్రీటు గోడల్లేపి, రేకులేసి పచ్చళ్లేపారం మొదలెట్టి ఇరగదీత్తన్నాడు. నువ్వేమో ఉన్నయ్యన్నీ ఊడగొట్టుకుని దిక్కూమొక్కూ లేనోడల్లే ఊరట్టుకు తిరుగుతున్నావ్‌. ఎవరూ లేపోతే అలాగే పిల్లోడంటూ ఒకడున్నాడు గదా ఊళ్ళో. నీ కూతురు.. అదే నీ కన్నపేగు సొరస. ఆడొద్దా నీకు? ఆడికొద్దా తాతగారిల్లు? అప్పుడే మర్సిపోయేవా ఆణ్ని? పోయినోళ్లతో మనవూ పోతావేట్రా?’’ అంటా గడ్డెట్టేడేమో అప్పుడే గుర్తొచ్చినట్టు బోరుమంటా కూలబడ్డాడతను.‘‘పోయినోళ్ళు పోయేరు. ఆ మాటకొత్తే అందరం పొయ్యేటోల్లమే. ఎవ్వరం ఉండం. అలా అని ఆల్లతో మనవూ పోలేం. జరిగిందొదిలెయ్‌. ఏదోటి సెయ్యాల. ఆ పిల్లకి అన్నీ నువ్వే. లేనోపిక తెచ్చుకో. తప్పదు. ఆడికోసం. నీ దగ్గరేం లేదని తెల్సు. సలహా ఇచ్చేనని సొల్లనుకోపోతే నా సేను గట్టు మీద సింతసెట్టు దోరముగ్గిన నిండా కాయల్తో కలకల్లాడతంది. అరమూట రాలగొట్టేతలికి నా పనైపోయింది. ఆటి పెచ్చులూడగొట్టి గింజలు పెరికే తలికి మా యాడోళ్ళు సేతులెత్తేసేరు. ఎంతని సేత్తారు ఎవురైనా? అంతుకే చెప్తున్నా. నాకైతే కొట్టుకునే ఓపిక లేదు. నీకోపికుంటే కొట్టుకుని అమ్ముకో. ఎంతొత్తే అంతే.  సింత పిక్కలు కూడా నాకొద్దు. అమ్ముకో. పిల్లోడికి  చొక్కాకన్నా వత్తయ్‌.’’

‘‘అలాగేనండయ్యా...’’‘‘ఎదర బేరాన్నెట్టుకుని ఎవుర్తో మాట్టాడతన్నావ్‌? బేరవొచ్చిందయ్యా. అటు సూడు..’’ అరిచేడు అమరయ్య మోచేత్తో పొడుస్తా.  ఈ లోకంలోకి వచ్చేడతను. పిచ్చోడల్లే చూసేడు కాసేపు.ఇదేం తెలీని వాళ్లిద్దరూ వాళ్ల గోలలో వాళ్లున్నారు.‘‘ఏంటి? ఇవి కొంటారా?’’ ఆశ్చర్యంగా అంది ఒకామె.‘‘అవును. నేనెప్పుడూ ఇలాంటివే కొంటానండి. నాకివే ఇష్టం..’’‘‘చాలా కష్టం కదా? బుర్ర తినేస్తాయండీ బాబూ?’’‘‘మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు తెలియదు కానీ మన ఫ్లోర్‌లో వాళ్లందరికీ తెలుసు. ఎప్పుడూ నేనివే కొంటానని..’’‘‘అవునా? అమ్మో! మీకు చాలా ఓపికండి’’‘‘ఓపిక లేకపోయినా ఓపిక చేసుకుంటానండి. కాస్తంత శ్రద్ధ  చేసుకుని  వలుచుకున్నామంటే హాయిగా ఉంటుంది. నేనెప్పుడూ ఇంతే! రెండు మూడు రోజులు పట్టినా గుల్లలు వలుచుకుని, ఉట్లూ, గింజలూ తీసేసి బాగా ఎండలో ఎండాక ఉప్పు కలిపి ఫ్రిజ్‌లో పెట్టేస్తాను. ఏడాదంతా చూసుకోవక్కల్లేదు. నల్లబడకుండా ఉంటుంది. అదే బయట కొన్న చింతపండైతే కాళ్లతోనే తొక్కుతారో, మురికి చేతుల్తోనే ముడతారో! ఆ ప్రాసెస్‌లో ఇవి మన దాకా వచ్చేలోపు వీటి మీద బల్లులే పాకుతాయో, బొద్దింకలే పాకుతాయో మనకి తెలియదు కదా! అదే ఇవి కొనుక్కుని బాగు చేసుకున్నామనుకోండి.. ఆ ఫీలే వేరు కదా? అన్ని విషయాల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ చింతపండు విషయంలో సాధ్యమే కదండీ! ఏమంటారు?’’ అంటూనే కింద మోకాళ్ల మీద కూర్చుని ఒంటి పిక్కొకటి చేత్తో పైకి తీసి, గుల్లొలిచి నోట్లో పెట్టుకుని ఒక చప్పరింపు చప్పరిచ్చి, ‘‘మరీ పుల్లగానూ లేదు, మరీ తియ్యగానూ లేదు. ఇలాగే ఇష్టం నాకు..’’ అంది ఇంత ముఖం చేసుకుని లేచి నిలబడతా. ‘‘కానీ టైం వేస్ట్‌ కదా!’’ అంది రెండో ఆమె గుల్లల్నే గుచ్చి గుచ్చి చూస్తా.‘‘ఒగ్గంట తక్కువ నిద్రోతే పోలా! లేదంటే టీవీ చూడటం తగ్గించో, కబుర్లాపో, ఒక సినిమా మానేసో..’’ అంటూ ఇతని వైపు తిరిగి, ‘‘ఎంతయ్యా  కేజీ?’’ అనడిగింది మొదటావిడ. అతను సమాధానం చెప్పే లోపే, రెండో ఆవిడ ‘‘మీరు మరీను..’’ నవ్వుతూ అని, అంతలోనే ‘‘సర్లే అడగండి.. నేనూ తీసుకుంటాను. అంతగా నేను తీసుకోలేకపోతే మీరో చెయ్యవెయ్యరా ఏమిటి?’’ అంది అతని  వైపు చూసి కన్నుగీటుతూ. ఆశ  నిలబడిపోయిన వేళ, చేతి వేళ్లల్లో సత్తువ చేరి అమరయ్య తోడు రాగా, కాసేపటికే ఖాళీ గోను పట్టా మడతలై ముడుచుకుని చంకెక్కగా లేచి నిలబడి ముందడుగేసాడతను, మనవడే కళ్లముందు కదలాడుతుండగా. చాలా రోజుల తర్వాత నవ్వాడతను.  
కన్నెగంటి అనసూయ  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top