మిగిలిపోయిన పాఠాలు ఎవరికి చెప్పాలి?

గత ఏడాది మాసాయిపేట స్కూలు బస్సు దుర్ఘటనలో మరణించిన తమ కుమారుడు మనీష్ విగ్రహం వద్ద 'ఇప్పుడు ఏ స్కూలుకు పోతవు బిడ్డా...' అని విలపిస్తున్న తల్ల


స్కూలుకెళుతున్న పిల్లలకేం తెలుసు... ఆ బస్సు కదులుతున్న శవపేటికని. ఆ ట్రైను బుసకొట్టే కాలనాగు అని. అంతా క్షణంలో జరిగిపోయింది... మాసాయిపేట దుర్ఘటన ఇంకా కలచివేస్తూనే ఉంది. సమాధుల పక్కన... ఇళ్లల్లో దండలు వేసిన ఫొటోల దగ్గర... స్కూల్లో ఆ పిల్లలు కూర్చున్న బెంచీల మీద... పేర్లు కొట్టేసిన అంటెండెన్స్ రిజిస్టర్‌లో... మీ మనసులలో... కన్నీరు ఓడుతున్న మా కలంలో... అంతా ఆ విషాద జ్ఞాపకాలే.మరి అంతటి నష్టం ఏమి నేర్పిపోయింది? వాళ్ల ఆయుష్షు ఇప్పుడు ఎవరికి పోయాలి? మిగిలిపోయిన పాఠాలు ఎవరికి చెప్పాలి?



ఈ వృథా వృథా కాకూడదు. రేపటి నుండి స్కూళ్లు షురూ. పిల్లల్ని స్కూలుకు పంపేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు చెబితే బాగుండు అనిపించింది. ఈ జాగ్రత్తలే ఆ పిల్లలకు నివాళి అనిపించింది. 


రామ్

ఎడిటర్,ఫీచర్స్


 

మళ్లీ రావైతివి కొడకా...


 ‘రోజూ ఓ ముద్ద పెట్టి బడికి పంపేదాన్ని... కాని ఆ రోజు ఓ ముద్దయినా పెట్టలేదే... బస్ వచ్చేసిందమ్మా అంటూ పరుగున పోతివి... మళ్లీ రావైతివి కొడకా...! ఇప్పుడు ఏ స్కూలుకు పోతవు బిడ్డా!’ అంటూ ఈ రోజుకీ కంటికి మింటికీ ఏకధారగా ఏడుస్తూనే ఉంది ఆ తల్లి. కన్న కొడుకు రూపాన్ని విగ్ర హంలో చూసుకుంటూ ఆ బిడ్డ జ్ఞాపకాలతోనే జీవిస్తున్న ఆ తల్లి పేరు పుష్ప. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక తనూ కళ్లనీళ్లు పెట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు పుష్ప భర్త స్వామి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ గ్రామం వీరిది. మనీష్... పుష్ప ఒక్కగానొక్క కొడుకు. ఏడవ తరగతి చదువుతున్నాడు. కిందటేడాది జరిగిన మాసాయిపేట బస్సు ప్రమాదంలో చనిపోయాడు.

 

 అమ్మా... చెల్లి ఇక రాదా!

 ముగ్గురు పిల్లల్లో ఓ బిడ్డను కోల్పోయారు వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన మాల్లాగౌడ్, లత.  రైలు ప్రమాదం నుంచి ఇద్దరు పిల్లలు రచిత, వరుణ్‌లు తీవ్రగాయాలతో బతికి బయటపడ్డారు. చిన్న కూతురు శృతి చనిపోయింది. ‘అమ్మా చెల్ల్లెలు ఇక తిరిగి రాదా...’ అని పిల్లలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నారు ఆ అమ్మానాన్న.  

 

శోకం మిగిలింది


ఇంట్లో ఏటు చూసిన ఉరుకులు, పరుగులు. చిన్నారులతో ఇల్లు సందడిగా ఉండేది. ఉన్న ఇద్దరు పిల్లలను రైలు ప్రమాదం పొట్టనపెట్టుకుంది. ఆ ఘటన మిగిల్చిన విషాదంతో నేటికీ ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన నీరజ, వీరబాబు దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ‘ఆ దేవుడు మాకు తీరని శోకాన్ని మిగిల్చాడు’ అని కుమిలిపోతున్నారు.ఊరికి దూరంగా వచ్చేశారు!

రైలు కూత వినగానే ఇప్పటికీ వారి గుండెల్లో భయం తన్నుకొస్తుంది. ఉన్న ముగ్గురు పిల్లల్లో ఇద్దరు పిల్లలు స్కూలు బస్సును రైలు డీకొన్న ప్రమాదంలో చనిపోయారు. బతికి బయటపడిన కూతురిలోనే పోయిన ఆ ఇద్దరినీ చూసుకుంటున్నారు గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన జక్కుల యాదగిరి, సంతోష దంపతులు. ఊళ్ల్లో ఉంటే పిల్లల జ్ఞాపకాలే వెంటాడుతాయని... ఉన్న ఒక్క బిడ్డనైనా కాపాడుకుందామని తూప్రాన్‌కు మాకాం మార్చారు.

 

ఆరోజు

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద 2014 జూలై 24న స్కూలు బస్సును రైలు డీకొన్న దుర్ఘటన నేటికీ ఈ తల్లిదండ్రులను కలిచివేస్తూనే ఉంది. బడిపిల్లల ప్రయాణ భద్రతను సమాజానికి ఒక బాధ్యతగా గుర్తుచేస్తూనే ఉంది. ఆ ప్రమాదంలో మొత్తం 16 మంది పిల్లలు చనిపోయారు.

ఇలాంటి సంఘటన మరొకటి జరగకూడదు. మనం జరగనీయకూడదు.
ఇల్లు మూగబోయింది

గుండ్రెడ్డిపల్లి గ్రామానికే చెందిన చింతాల రాములు, వసంత దంపతులకు సుమన్, శ్రీవిద్య ఇద్దరు పిల్లలు. ఉన్న ఇద్దరు పిల్లలు అదే దుర్ఘటనలో దూరం అయ్యారు. దాంతో పదకొండు నెలలుగా ఆ ఇల్లు మూగబోయింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లల్ని ఇంగ్లిష్ చదువుల కోసమని ప్రైవేట్ పాఠశాలకు పంపితే తమకు కన్నీరే మిగిలిందని వారు రోదిస్తున్నారు. ‘పిల్లల అల్లరితో పాటు అమ్మ, నాన్న అనే పిలుపులకూ దూరమయ్యాం. వ్యవసాయం చేసుకునే జీవించేవాళ్లం. ఇప్పుడే పనీ చేయాలనిపించడం లేదు. పిల్లలు లేని జీవితం ఎందుకు?’ అని ఆ దంపతులు, వారితో పాటు పిల్లల నానమ్మ... చిన్నారుల ఫొటోలు చూసుకుంటూ మౌన వేదన అనుభవిస్తున్నారు.

                                  - ఇందూరి రవీందర్, సాక్షి, తూప్రాన్ స్కూలు ప్రయాణం

 పిల్లల చదువుల్లో మార్కులు, ర్యాంకులే కాదు చూడాల్సింది. అంతకన్నా ముందు ప్రయాణంలో వారి భద్రత ముఖ్యం అని తల్లిదండ్రులు గమనించాలి.

రూల్: 1

పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు కలిసి ఒక కమిటీగా ఏర్పడాలి. ప్రతి 15 రోజులు/నెల రోజులకోసారి అందరూ సమావేశమై బస్సుల ఫిట్‌నెస్, బస్సు డ్రైవర్లు, అటెండర్ల ప్రవర్తన... సంబంధిత అంశాలను చర్చించాలి.

 

రూల్: 2

బస్సు కండిషన్‌కు సంబంధించిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్, డ్రైవర్ లెసైన్స్, అటెండెంట్‌ను.. చూపించమనాలి. డ్రైవర్ మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడో లేదో ఆరా తీయాలి.

 

రూల్: 3

కొన్ని చోట్ల బస్సులు/వ్యానులలో 20 సీట్లు ఉంటే 30/35 మంది స్టూడెంట్స్‌ను సర్దుతారు. అందుకే, బస్సులో/వ్యాన్‌లో సీట్లు ఎన్ని? అందులో ప్రయాణించే విద్యార్థుల సంఖ్య ఎంత? తెలుసుకోవాలి. అలాగే డ్రైవర్, అటెండర్ ప్రవర్తన ఎలా ఉంటుంది? అని మధ్య మధ్య పిల్లలనూ అడుగుతుండాలి.

 

రూల్:4

బస్సు ప్రమాదాలు, విపత్కర పరిస్థితులు ఎదురయ్యే సందర్భాలలో డ్రైవర్లను, అటెండర్లను అప్రమత్తం చేయాలని పిల్లలకు సూచనలను ఇవ్వాలి. ప్రయాణంలో కలిగే అసౌకర్యం గురించి పిల్లలు చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించాలి. వారి నుంచి సరైన స్పందన రాకపోతే పోలీసులను సంప్రదించవచ్చు.

 

రూల్:5

ఆటోలలో సీట్లకంటే పిల్లలే ఎక్కువ కనపడుతుంటారు. చిన్న కుదుపులకే జరిగే ప్రమాదాలు ఆటో ప్రయాణాలలోనే ఎక్కువ. వీలైనంత వరకు ఆటోలలో పిల్లలను స్కూల్‌కు పంపకపోవడమే మంచిది. అంతకంటే వ్యాన్‌లను ఎంచుకోవడం ఉత్తమం.

 

రూల్:6

సైకిళ్ల మీద స్కూల్‌కి వెళ్లే పిల్లలూ హెల్మెట్ ధరించాలి. పిల్లలు అడుగుతున్నారని చాలా మంది తల్లిదండ్రులు స్కూల్‌కి వెళ్లడానికి బైక్స్ ఇస్తుంటారు. 18 ఏళ్లు దాటని పిల్లలకు ద్విచక్ర, త్రిచక్రవాహనాలు ఇవ్వకూడదు. తప్పనిసరిగా లెసైన్స్ ఉండాలి.

 

డిసెంబరులోనే చెక్ చేస్తాం

 కొత్త బస్సు కండిషన్ ఫిట్‌నెస్ రెండేళ్లు ఉంటుంది. తర్వాత ఏడాదికి ఒకసారి ఫిట్‌నెస్ టెస్ట్ చేస్తాం. అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి (స్కూల్ ఓపెనింగ్ సమయంలోనే కాకుండా డిసెంబర్‌లోనూ) చెక్ చేస్తుంటాం. బస్సులు, వ్యాన్‌లలో..  పిల్లలను ఓవర్ లోడింగ్ చేయకూడదు. బస్ ఫిట్‌నెస్ కండిషన్స్ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నా.. పాఠశాల గుర్తింపును రద్దు చేసే అవకాశాలు ఉంటాయి.

 - రఘునాథ్, ఆర్.టి.ఎ.జాయింట్ కమిషనర్, హైదరాబాద్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top