ట్రూమేక్‌

Telugu Movie Stories Remake From Other Languages - Sakshi

కాగితం మీద సీన్‌ ఉంటే నమ్మకం కుదరదు. అదే ఆల్రెడీ తీసేసిన స్క్రిప్ట్‌ అయితే ఒక గ్యారంటీ. అది పెద్ద హిట్‌ అయి ఉంటే ఇంకా భరోసా. అక్కడ హిట్‌ అయ్యింది ఇక్కడ హిట్‌ అవుతుందిలే అని ధైర్యం.
కాని రీమేక్‌లు ఎప్పుడూ మేజిక్‌స్టిక్‌లే. అవి సరిగ్గా తిప్పితే పూలవర్షం కురుస్తుంది.లేదంటే పాము పడగై కాటేస్తుంది. ఇటీవలి రీమేక్‌లు సక్సెస్‌స్టోరీ ఇది.

రీమేక్‌ అనేది కత్తి మీద సాము. మార్పులు చేసి తీయాలా యథాతథంగా తీయాలా అనేది ఎప్పుడూ ఒక పజిల్‌. మార్పులు చేసి తీసిన కొన్ని సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. మార్పులు చేయకుండా తీసిన సినిమాలూ హిట్‌ అయ్యాయి. మార్పులు చేసినా, చేయకపోయినా ఫ్లాప్‌ అయిన సినిమాలు ఉన్నాయి. సినిమాలు ఎలా ఎందుకు ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతాయో చెప్పలేము. చిరంజీవి అంతటి మెగాస్టార్‌ కెరీర్‌ పరంగా ఒడిదుడుకులలో ఉన్నప్పుడు హిట్‌ ఇచ్చి నిలబెట్టిన ‘హిట్లర్‌’ రీమేకే. పెద్ద సక్సెస్‌ ఇచ్చి రాజకీయ ప్రవేశానికి ఊతం ఇచ్చిన ‘ఠాగూర్‌’ రీమేకే. ‘శంకర్‌దాదా ఎంబిబిఎస్‌’ కూడా రీమేకే. అలాగే మోహన్‌బాబుకు సినిమా రంగంలో సెకండ్‌ లైఫ్‌ ఇచ్చి స్టార్‌ ఇమేజ్‌ తెచ్చిన ‘అల్లుడుగారు’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘రౌడీ గారి పెళ్లాం’ సినిమాలు రీమేక్‌లే. కాని రీమేక్‌ అంటే మాత్రం చాలామంది దర్శకులు నెర్వస్‌గానే ఫీలవుతారు. గతంలో తెలుగులో రీమేక్‌ స్పెషలిస్టులు ఉండేవారు. పాతరోజులలో ఎస్‌.డి.లాల్‌ వంటి డైరెక్టర్లు హిందీ సినిమాలను తెలుగులో రీమేక్‌ చేసేవారు. ‘నిప్పులాంటి మనిషి’ (జంజీర్‌), అన్నదమ్ముల అనుబంధం (యాదోంకి బారాత్‌), నేరం నాది కాదు ఆకలిది (రోటి) ఇవన్నీ ఎస్‌.డి.లాల్‌ తీసిన సినిమాలు. తర్వాతి రోజులలో రవిరాజా పినిశెట్టి రీమేక్‌లకు వాసి గాంచారు. ఆయన తీసి సూపర్‌హిట్‌ చేసిన ‘పుణ్యస్త్రీ’, ‘పెదరాయడు’, ‘చంటి’ రీమేక్‌లే. ఇక దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు రీమేక్‌ సినిమాలతోనే కెరీర్‌ నిర్మించుకున్నారు. ‘శుభాకాంక్షలు’, ‘సుస్వాగతం’, ‘సూర్యవంశం’, ‘సుడిగాడు’ ఇందుకు ఉదాహరణ.

అయితే ఇప్పుడు అలా లేదు. అందరు దర్శకులూ అవకాశాన్ని బట్టి రీమేక్‌లు తీయడానికి సిద్ధమవుతున్నారు. తీస్తున్నారు కూడా. మొన్న మొన్న వచ్చిన నాగార్జున ‘ఊపిరి’ ఫ్రెంచ్‌ ‘‘ది ఇన్‌టచ్‌బుల్స్‌’కు రీమేక్‌. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. నాగచైతన్య ‘ప్రేమమ్‌’ కూడా మలయాళ సూపర్‌హిట్‌కు రీమేక్‌. చందు మొండేటి దర్శకుడు. ఇటీవల తెలుగులో మళ్లీ రీమేక్‌ల చర్చ వస్తోంది. కారణం ఇటీవలి రీమేక్‌ సినిమాలు హిట్‌ కావడమే. ఎంత మార్చాలి ఎంత మార్చక్కర్లేదు అనే లెక్కలని జాగ్రత్తగా వేసి తీసిన సినిమాలివి. ఒక రకంగా వీటిని ‘ట్రూమేక్‌’లు అనొచ్చు. ఒరిజినల్‌ సినిమా పట్ల నిజాయితీతో ఉండి తీసిన సినిమాలన్నమాట. వాటి విశేషాలు.

ఓహో బేబీ!
సినిమా కథకు ఐడియా వెలగడం పెద్ద విషయం కాదు. దానిని విస్తరించి ఆసక్తికరమైన తొంభై సీన్లుగా మలచడం అసలు విజయం. ఒక స్త్రీ జీవిత చరమాంకంలో తిరిగి యంగ్‌గా జీవించే ఛాన్స్‌ వస్తే అనే ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే దానిని సినిమాకు వీలుగా మలిచిన తీరు కూడా ఆసక్తికరమే. అందుకే కొరియన్‌ సినిమా ‘మిస్‌ గ్రానీ’ పెద్ద హిట్‌ అయ్యింది. కథకు యూనివర్సల్‌ యాక్సెప్టెన్స్‌ ఉందని గ్రహించాక 11 భాషలకు చెందిన సినీరంగాలవారు ఈ కథను దేశ విదేశాలలో ఎగరేసుకుపోయారు. అలా ఈ కథ తెలుగుకు కూడా చేరి ‘ఓ బేబీ’ అయ్యింది.  నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ముఖ్య పాత్రలో నటించారు. బేబీగా 80 ఏళ్ల వృద్ధ స్త్రీ పాత్రను లక్ష్మి చేశారు. రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యపాత్రల్లో నటించారు. బేబీ ఎంత బాగా నచ్చిందంటే సూపర్‌హిట్‌ కావడమే కాదు  సుమారు 30 కోట్ల గ్రాస్‌ కూడా వసూలు చేసింది. హిందీలో కూడా రీమేక్‌ కాబోతోంది. హిందీలో ఆలియా భట్‌ టైటిల్‌ రోల్‌ చేస్తారని తెలిసింది. ఈ సినిమా హిట్‌ కావడానికి కారణం తెలుగుదనం తప్పిపోని విధంగా తెరకెక్కించడం, ఇది మన కథే అన్న భావన కలిగించడం. ఎప్పుడైతే బామ్మగా లక్ష్మి చేశారో ఆమె తన నుడికారంతో ఒక సాధారణ బామ్మను చూస్తున్న అనుభూతిని కలిగించారు. సమంత ఆ పాత్రను నేటి అమ్మాయిగా ప్రేక్షకులకు దగ్గర చేయగలిగింది. సగటు తెలుగు స్త్రీ మనోభావాలను, జీవితపు వెలితిని చూపడం వల్లే ఈ సినిమా హిట్‌ అయ్యిందని చెప్పొచ్చు.
‘‘రీమేక్‌తో వచ్చిన చిక్కేంటంటే సినిమా సరిగ్గా ఆడకపోతే పాడు చేశారు అంటారు. ఒకవేళ హిట్‌ అయితే సేమ్‌ అలానే తీశారు హిట్‌ అయిపోయింది అంటారు. రీమేక్స్‌తో ఎక్కువ పేరు సంపాదించడం కొంచెం కష్టం’’ – నందినీ రెడ్డి, ‘ఓ బేబి’ రిలీజ్‌ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో.

రాక్షసుడు
గతంలో ఎస్‌.వి.కృష్ణారెడ్డి ‘గన్‌షాట్‌’ అనే సైకో ఫిల్మ్‌ తీశారు. అందులో సైకోగా ప్రకాష్‌రాజ్‌ నటించారు. అలీ హీరో. కామెడీ చేయాల్సిన అలీ సీరియస్‌ రోల్‌ చేయడం, సీరియస్‌నెస్‌ చూపించాల్సిన విలన్‌ కామెడీ చేయడంతో ఈ సినిమా ప్రేక్షకులను సరిగా చేరలేదు. కాని ‘రాక్షసుడు’ సినిమా మాత్రం మొదటి సీన్‌ నుంచే సీరియస్‌ మూడ్‌లోకి తీసుకెళ్లిపోతుంది. స్కూల్‌ వయసు ఉన్న ఆడపిల్లలను చంపి అవయవాలను చిన్న చిన్న భాగాలుగా చేసి రాక్షసానందం పొందే ఈ సైకో కిల్లర్‌ను సినిమా దర్శకత్వం కోసం సైకోలను స్టడీచేసి, సినిమా తీసే వీలులేక పోలీస్‌ ఆఫీసర్‌ అయిన హీరో ఎలా పట్టుకున్నాడనేది కథ. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన ‘రాక్షసన్‌’కు రీమేక్‌ ఇది. అక్కడ ఈ కథను రాసి దర్శకత్వం వహించింది రామ్‌కుమార్‌. తెలుగులో రమేశ్‌ వర్మ దర్శకత్వం వహించారు.  క్లైమాక్స్‌ వరకూ విలన్‌ ఎవరనేది ప్రేక్షకుడు  పసిగట్టలేనంత పకడ్బందీగా స్క్రీన్‌ప్లే ఉంది. తమిళ ఒరిజినల్‌ను చాలా కొద్ది మార్పులతో రీమేక్‌ చేయడం వల్ల ఈ సినిమా ప్రేక్షకుల్లో దూసుకుపోయిందనే అభిప్రాయం ఉంది. సాధారణంగా పాత్రకు తగ్గ నటులు దొరక్కపోతే పాత్ర ఫెయిల్‌ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే తమిళంలో ముఖ్యపాత్రలు చేసిన ఇద్దరు ముగ్గురు నటులు తెలుగులో చేయడం కూడా సినిమా హిట్‌కు కారణం కావచ్చు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ హిట్‌ ఇదని చిత్రబృందం పేర్కొంది.
‘‘రీమేక్‌ చేయడం అంటే ఒక పెయింటింగ్‌ని మళ్లీ వేయడం. అది అంత ఈజీ కాదు. తమిళ సినిమా ఓ టెంపోలో నడుస్తుంటుంది. అదే టెంపోను ఇక్కడ రిపీట్‌ చేయగలిగాను. సక్సెస్‌ సాధించాను’’ – రమేశ్‌ వర్మ, ‘రాక్షసుడు’ రిలీజ్‌ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.– ఇన్‌పుట్స్‌: గౌతమ్‌ మల్లాది

గురి తప్పిన బాణాలు
రీమేక్‌లు అన్నిసార్లు సత్ఫలితాలు ఇవ్వవు. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన సత్యరాజ్‌ సినిమా ‘వాల్టర్‌ వెట్రివేల్‌’ను తెలుగులో చిరంజీవి, శ్రీదేవిలతో ‘ఎస్‌.పి.పరశురామ్‌’గా తీస్తే ప్రేక్షకులు నిరాకరించారు. గ్లామర్‌ స్టార్‌ శ్రీదేవి ఈ సినిమాలో పాత్రపరంగా అంధురాలు కావడం జనానికి రుచించలేదు. మలయాళంలో మోహన్‌లాల్‌ నటించగా సూపర్‌హిట్‌ అయిన ‘దేవాసురమ్‌’ను తెలుగులో మోహన్‌బాబు ‘కుంతీపుత్రుడు’గా తీస్తే ప్రేక్షకులు మెచ్చలేదు. కన్నడలో సూపర్‌హిట్‌ అయిన విష్ణువర్థన్‌ సినిమా ‘ఆప్తరక్షక’ తెలుగులో వెంటేష్‌తో ‘నాగవల్లి’గా తీస్తే సత్ఫలితం ఇవ్వలేదు. కన్నడలో సూపర్‌హిట్‌ అయిన శివ రాజ్‌కుమార్‌ ‘జోగి’ని తెలుగులో ప్రభాస్‌తో ‘యోగి’గా తీస్తే ఆశించిన ఫలితం ఇవ్వలేదు. హిందీలో సూపర్‌ హిట్‌ అయిన ఆమిర్‌ ఖాన్‌ ‘మన్‌’ను తెలుగులో నాగార్జునతో ‘రావోయి చందమామ’గా తీస్తే ప్రేక్షకులు నిరాశాజనకమైన రిజల్ట్స్‌ ఇచ్చారు. కనుక పట్టువదలక పని చేస్తూ పోవడమే చేయదగినది. నచ్చితే హిట్‌ అవుతుంది. లేకుంటే అనుభవం వస్తుంది.

ఎవరు
‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాలతో థ్రిల్లింగ్‌ హిట్స్‌ అందుకున్నారు అడివి శేష్‌. మళ్లీ ఓ మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా ‘ఎవరు’తో వచ్చారు. స్పానిష్‌ సినిమా ‘ది ఇన్విజిబుల్‌ గెస్ట్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌ ఇది. ఆల్రెడీ హిందీలో ‘బద్లా’ గా ఈ సినిమా రీమేక్‌ అయింది. ఆ రెండు సినిమాలను చూసిన వారు కూడా ఎంటర్‌టైనింగ్‌గా చూసేలా మరిన్ని ట్విస్ట్‌లతో తెలుగు చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రామ్‌జీ. ఓ బడా బిజినెస్‌మేన్‌ భార్య పోలీస్‌ ఆఫీసర్‌ను చంపేస్తుంది. తన మీద అత్యాచారం చేశాడని, ఆత్మరక్షణ కోసం కాల్చానని చెబుతుంది ఆమె. ఇందులో నుంచి తప్పించడానికి విక్రమ్‌ వాసుదేవ్‌ అనే లంచగొండి పోలీస్‌ ఆఫీసర్‌ సహాయం తీసుకుంటుంది. ఈ కేస్‌లో నుంచి తప్పించుకోవడానికి విక్రమ్‌ వీళ్లకు సాయం చేశాడా? వీళ్లు తప్పించుకున్నారా? లేదా అనేది క్లుప్తంగా ‘ఎవరు’ కథ. ఒరిజినల్‌లో ఉన్న కొన్ని పాత్రలను తప్పించి, మరిన్ని ట్విస్ట్‌లు జోడించి ఎంగేజింగ్‌ థ్రిల్లర్‌గా రూపొందించారు.‘‘ఒరిజినల్‌ సినిమా అక్కడ ఎందుకు ఆడింది? అనే విషయం అర్థం చేసుకోవాలి. ‘ఇన్విజిబుల్‌ గెస్ట్‌’ కోల్డ్‌ ఫిల్మ్‌. వాళ్ల ఎమోషన్స్‌ అలానే ఉంటాయి. మనవి అలా ఉండవు. దాన్ని అర్థం చేసుకుని మనకు తగ్గట్టుగా మలుచుకుంటే కచ్చితంగా సక్సెస్‌ సాధించవచ్చు’’ – వెంకట్‌ రామ్‌జీ. ‘ఎవరు’ దర్శకుడు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top