విభజన గాయం

Tamas Special Tv Serial on Country Partition - Sakshi

తమస్‌

దేశ విభజన రేపిన గాయం ఈనాటికీ ఇరు దేశాలనూ సలపుతూనే ఉంది. నేల మీద గీచిన గీత హృదయాలను భగ్నం చేసింది. ఆనాటి చరిత్ర, ఆ ప్రజల వేదన సాహిత్యంలో ప్రతిబింబించింది. భీష్మ సహాని రచన ‘తమస్‌’కు గోవింద్‌ నిహ్లాని ఇచ్చిన బుల్లితెర రూపమే ‘తమస్‌’.

నాథు తన షాప్‌లో పనిచేసుకుంటూ ఉన్నాడు. థెకెదార్‌ అనే పశువైద్యుడు నాథు వద్దకు వచ్చి తన వైద్య అవసరాల కోసం ఓ పందిని చంపి తీసుకురావాలని అడుగుతాడు. తాను ఆ పని చేయలేనని, పందిని చంపడంలో తనకెలాంటి నైపుణ్యం లేదంటాడు నాథు. థెకెదార్‌ పట్టుబట్టి నాథుకు 5 రూపాయలు ఇచ్చి ఒప్పించడంతో ‘సరే, రేపు ఉదయం నాటికి చంపి తీసుకొస్తా’నని చెబుతాడు.నాథు పందిని చంపే మొట్టమొదటి సీన్‌ ప్రేక్షకుల్లో ఒక ఉత్కంఠను కలిగిస్తుంది. 1947 దేశ విభజన కాలంలో సిక్కులు, ముస్లింలు మత విద్వేషాలతో ఏ విధంగా రగిలిపో యారో బుల్లితెర మీద ధైర్యంగా చూపిన సీరీస్‌ ‘తమస్‌’. 

మరుసటి రోజు ఉదయం బక్షిజి, రాజకీయ పార్టీలోని కొంత మంది సభ్యులు ప్రచారంలో భాగంగా ముస్లిం మత పెద్ద మొహల్లా వద్దకు చేరుకుంటారు. అక్కడి మురికి కాలువలను శుభ్రపరచడం, దేశభక్తి గీతాలను పాడటం చేస్తూ... మొహల్లాతో పాటు ఉన్న ఇతర ముస్లింలను కూడా తమ కార్యక్రమంలో పాల్గొనమని కోరుతారు. వాళ్లు అందుకు ఒప్పుకోరు. అంతలోనే మసీదు మెట్ల వద్ద ఎవరో ఒక పంది మృతదేహాన్ని విసిరేశారనే వార్త దావానలంలా వ్యాపిస్తుంది. దీంతో అక్కడి ముస్లింల నుంచి పార్టీ సభ్యుల మీదకు రాళ్లు వచ్చి పడతాయి. ఇండ్లకు నిప్పు అంటుకుంటుంది. కాసేపట్లో అంతటా అశాంతి నెలకొంటుంది.

అశాంతికి మూలం
సమాజంలో ఏర్పడిన అశాంతికి భయపడి, ముస్లిం లీగ్‌ ప్రతినిధి బక్షిజీ, హయత్‌ బక్ష్‌ డిప్యూటీ కమిషనర్‌ రిచర్డ్‌ను కలిసి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతారు. పోలీసులను మోహరించాలని లేదా కర్ఫ్యూ విధించాలని బక్షిజీ, హయత్‌ చేసిన సూచనలను రిచర్డ్‌ తిరస్కరిస్తాడు. బదులుగా పార్టీ సభ్యులే శాంతి భద్రతలను కాపాడాలని ఈ విషయాన్ని మిగతా వర్గాలను కోరమని చెబుతాడు. నాథు మసీదు వద్ద పంది మృతదేహాన్ని చూసి తాను గత రాత్రి చంపిన పంది అదేనని గుర్తుపట్టి ఆశ్చర్యపోతాడు. అశాంతికి లోనవుతాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వీధిలో ఉన్న థెకెదార్‌ను చూస్తాడు. నాథు అతని దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కాని, థెకెదార్‌ నాథుకి అందకుండా పరిగెత్తుతాడు. తాను చంపిన పంది వల్లే అల్లర్లు తలెత్తాయని తెలుసుకున్న నాథు అపరాధ భావనతో ఇంటికి వెళ్లి గర్భవతిగా ఉన్న తన భార్య కమ్మోకి అసలు విషయం చెబుతాడు. బయటనుంచి వినిపిస్తున్న గొడవలను చూసిన వాళ్లకు దూరాన ఇండ్లు కాలిపోవడం కనిపిస్తుంది. ఆ మత హింస కు తానే కారణమని నాథూ తనని తాను నిందించుకుంటాడు.

ఇల్లు వదిలి...
ప్రమాదాన్ని గ్రహించిన నాథు భార్య, తల్లితో కలిసి ఆ ప్రాంతం వదిలి సిటీకి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. వాళ్లు కాలినడక తమ ప్రయాణాన్ని మొదలుపెడతారు. నాథు తన వికలాంగ తల్లిని వీపుపై మోస్తుంటాడు. ప్రయాణ సమయం లో నాథు తల్లి చనిపోతుంది. అడవిలోనే తల్లి భౌతిక కాయాన్ని కాల్చి, తల్లికి సరైన అంత్యక్రియలు చేయలేని తన దుస్థితికి దుఃఖిస్తాడు.

కూతురు కోసం..
హర్నంసింగ్‌ అతని భార్య బాంటో లది సిక్కు కుటుంబం. పొరుగూర్లో ఉన్న తమ కుమార్తె జస్బీర్‌ ఇంటికి వెళ్లాలనుకుని బయల్దేరుతారు. వారు రాత్రంతా కాలినడకన ప్రయాణించి ఒక గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఎవరింటిలోనైనా కాసేపు విశ్రాంతి తీసుకొని బయల్దేరుదామని ఓ ఇంటి తలుపు తడతారు. ఆ ఇల్లు ముస్లిం ఎహ్సాన్‌ అలీకి చెందినది. అతను గతంలో హర్నం సింగ్‌కు స్నేహితుడే. తన కొడుకుకు తెలియకుండా స్నేహితుడి కుటుంబానికి ఆశ్రయం ఇస్తాడు ఎహ్సాన్‌. పగటిపూట వాళ్లు దాక్కున్నా రాత్రి సమయంలో ఎహ్సాన్‌ కొడుకు హర్నం సింగ్‌ వాళ్లను చూస్తాడు. తమ ఇంటిని తక్షణమే వదిలి వెళ్లమనడంతో అక్కణ్ణుంచి బయల్దేరుతారు హర్నం సింగ్, అతని కుటుంబం. మరుసటి రోజు ఉదయం నాథు, అతని భార్యను అడవిలో కలుస్తారు. అందరూ కలిసి గురుద్వారాకి బయల్దేరుతారు.  

గురుద్వారా
ముస్లింలు నిరంతరం ఆయుధాలు సేకరిస్తున్నారని, తామంతా అదేవిధంగా ఆయుధ సంపత్తిని పెంపొందించుకోవాలని సిక్కుల సంఘం నాయకుడు గురుద్వారాలో తేజ్‌సింగ్‌ సిక్కులకు చెబుతుంటాడు. గురుద్వారాలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో తేజ్‌సింగ్‌ మాట్లాడుతూ సిక్కుల వద్ద తగినన్ని ఆయుధాలు లేవని, సంధి కోసం 2 లక్షల రూపాయలు అవసరం అవుతాయని చెబుతాడు. తేజ్‌సింగ్, సిక్కు కౌన్సిల్‌ అంత డబ్బు చాలా ఎక్కువగా భావించి ముస్లింలతో చర్చలు జరపడానికి జూనియర్‌ గ్రంథి, నాథూలను పంపుతుంది. అయితే, ముస్లిం గుంపు నాథు, గ్రంథీలతో పాటు గురుద్వారాను చుట్టుముట్టి దాడి చేస్తారు. దీంతో ఆగ్రహించిన సిక్కులు ఆయుధాలు తీసుకొని నినాదాలు చేస్తూ పోరాడటానికి బయల్దేరుతారు. గురుద్వారా వద్ద జస్బీర్‌ అనే వ్యక్తి సిక్కు మహిళలను బావిలోకి దూకి సామూహిక ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తాడు. ఆ సమయంలో కొంతమంది తల్లుల చేతుల్లో పసిపిల్లలు ఉంటారు.

1947లో పంజాబ్‌ విభజన సమయంలో అల్లర్లతో అట్టుడుకుతున్న పాకిస్తాన్‌ నేపథ్యంలో ఈ చిత్రం విభజన పర్యవసనాలను కళ్లకు కట్టింది. ఆ సమయంలో భారతదేశానికి వలస వచ్చిన సిక్కు, హిందూ కుటుంబాల దుస్థితిని చూపింది. 1988లో వచ్చిన ఈ సీరియల్‌ ఆ తర్వాత నాలుగు గంటల నిడివిగల చలనచిత్రంగా రూపొందింది. 35వ జాతీయ సినిమా అవార్డులో మూడు అవార్డులు ‘తమస్‌’ సినిమా గెలుచుకోవడం విశేషం.
1988 కాలంనాటి సీరీస్‌ తమస్‌. మొదటి సన్నివేశంలోనే ఓమ్‌ పురి పాత్ర ఒక పందిని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఓపెనింగే ఒక ఆకట్టుకునే ప్రదర్శన. కానీ, భయం, హింస వంటి ఇతివృత్తాలతో ఒక చీకటి కోణాన్ని ఆవిష్కరించింది. దూరదర్శన్‌లో ప్రసారమైన ఈ మినీ సిరీస్‌కు స్వరకర్త వన్‌రాజ్‌ భాటియా సంగీతం మనల్ని వెంటాడుతుంది. రచయిత భిషమ్‌ సహ్ని హిందీ నవల తమస్‌ నుంచి దర్శకుడు గోవింద్‌ నిహ్లాని తీసుకుని ఈ సీరియల్‌ను రూపకల్పన చేశాడు.
తమస్, అంటే చీకటి. భారత విభజన సమయంలో వలస వచ్చిన సిక్కులు, హిందూ కుటుంబాల కథ ఇది. ఈ కథాంశం నిహ్లానీని ఆశ్చర్యపరించింది. ‘ఇది సినిమాకు తగిన కథాంశం అవుతుంది’ అనుకున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు చాలా డబ్బు అవసరం అవుతుంది. ఇది అంత ఆచరణీయం కాకపోవచ్చు అని కూడా అనుకున్నాడు. ‘ఈ ఇతివృత్తాన్ని పరిచయం చేయడానికి ముందు దూదర్శన్‌ ప్రతినిధులతో మాట్లాడాను. వారూ ఆసక్తి కనబరిచారు. ఈ కథాంశం వివాదాస్పదమని, అభ్యంతరాలు ఉండవచ్చనీ భావించాను. ముందు కొంత భయపడ్డాను. ఈ సీరీస్‌ను నిషేధించవచ్చని కూడా అనుకున్నాను. నన్ను కొందరు హిందూ వ్యతిరేకి అనుకున్నారు. దేశ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుందనీ భావించారు. కొందరు విభజన వాస్తవాలను కచ్చితంగా ప్రదర్శించలేదన్నారు’ అని నాటి విషయాలను ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు నిహ్లాని వివరించారు.
ఇందులోని సీన్స్‌ కోసం గుర్‌గావ్‌లోని కొన్ని ప్రదేశాలు, అక్కడి ఫిల్మ్‌సిటీని ఎంచుకున్నారు. అప్పటికే పేరున్న నాటక, సినిమా రంగ అగ్ర నటీనటులు.. ఓమ్‌పురి, అమ్రిష్‌పురి, దినా పథక్, ఎ.కె.హంగల్, ఇఫ్త్‌ఖర్, సురేఖ సిక్రీ.. మొదలైనవారు ఇందులో నటించారు.

కమిటీ ఏర్పాటు.. ఇంత ఘోరం జరిగాక రిచర్డ్‌ నగరంలోని ప్రముఖ వ్యక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, అక్కడి ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యల గురించి తెలియజేస్తారు. శాంతి సందేశాన్ని పంపడానికి నాయకులను అమన్‌ కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతారు. బక్షిజీ, హయత్‌ బక్షన్‌ను అమన్‌ కమిటీ ఉపాధ్యక్షులుగా నియమిస్తారు. సమావేశం ముగింపులో థెకెదార్‌ మత సామరస్యం నినాదాలు చేస్తూ కనిపిస్తాడు. శరణార్ధి శిబిరంలో హర్నం సింగ్, బాంటో, కమ్మో ఉంటారు. ముస్లింలతో చర్చలు జరిపేందుకు జూనియర్‌ గ్రంథీతో వెళ్లినప్పటి నుండి కనిపించని నాథును కనుక్కోవడానికి సహాయం చేయాలని హర్నం సింగ్‌ ఒక ప్రభుత్వ ఉద్యోగిని అభ్యర్థిస్తాడు. నగరంలో ఆసుపత్రి గుడారాలన్నింటిలోనూ ఆరా తీయాలని ఆ ఉద్యోగిని అడుగుతాడు. నేల మీద వరసగా పడి ఉన్న మృతదేహాలను చూస్తూ, వాటిలో నాథు మృతదేహాన్ని గుర్తించి కమ్మో నిలువునా కూలిపోతుంది. నర్సులు ఆమెను ప్రసవానికి గుడారంలోకి తీసుకువెళతారు. గుడారం బయట కూర్చొని ఉన్న హర్నం సింగ్, బాంటోలకు ‘అల్లాహు అక్బర్‌’, హర్‌ హర్‌ మహాదేవ్‌’ నినాదాలతో పాటు గుడారం లోపల నుంచి అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఏడుపులు వినిపిస్తాయి.– ఎన్‌.ఆర్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top